Devata Vrukshalu

దేవతా వృక్షాలు 

 

198.00

Share Now

Description

దేవతా వృక్షాలు 
వృక్ష దేవతలు
హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.
నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.
దేవతా వృక్షాలు

వృక్షాలు భూమిపైనే కాదు- స్వర్గంలో, పాతాళంలోనూ ఉన్నాయంటారు. భూమి పైన కనబడే వృక్షాలూ స్వర్గంలోని వృక్షాలవంటివే. అసలు వృక్షం ఎక్కడ కనబడితే అక్కడ మూడు లోకాలూ ఉన్నట్లే భావించాలి. వాటి సౌందర్యం ముల్లోకాలనూ గుర్తు చేస్తుంది.

నిఘంటువుల్లో దేవతా వృక్షాల పేరుతో కొన్ని చెట్లు కనిపిస్తాయి. మందారం, పారిజాతం, సంతానం, కల్పవృక్షం, హరిచందనం అనేవి దేవతరువులని అమరకోశం చెబుతోంది.

ఏ చెట్టును చూస్తే ఆనందం వెల్లువెత్తుతుందో ఆ చెట్టు మందారం. ఈ చెట్టుకు సన్నని ముళ్లు ఉంటాయి. ఎన్నో దీర్ఘవ్యాధులకు ఈ చెట్టు ఔషధంలా పని చేస్తుందని నిఘంటుకారులు చెబుతున్నారు. జిల్లేడు చెట్టుకూ మందారం అనే పేరుంది. మందార మకరంద మాధుర్యానికి అలవాటు పడిన తుమ్మెదలు మరో చెట్టును ఆశ్రయిస్తాయా అని ప్రశ్నించాడు పోతన మహాకవి! జిల్లేడుకు గల ఔషధ గుణాలు అమూల్యమైనవి.

పారం అంటే నీరు. నీరు పుష్కలంగా ఉండే చెట్టు పారిజాతం. పారి అంటే నీళ్లు కలిగిన సముద్రం. అందులో నుంచి పుట్టింది పారిజాతం. అంటే ఈ పూవు సముద్రంలో నుంచి పుడుతుందని కోశాలు చెబుతున్నాయి. పారిజాత పుష్పం కోసం సత్యభామ ఎంత తపించిందో పురాణగాథ చదివితే తెలుస్తుంది.

కోరిన కోరికలను తీర్చేది, సంతానాన్ని ప్రసాదించేది సంతాన వృక్షం. సంతాన ప్రాప్తికి అవసరమైన ఔషధీగుణం ఈ చెట్టుకు ఉందని శాస్త్రవచనం. లోకంలో సంతానం లేక బాధపడుతున్నవాళ్లెందరో ఉన్నారు. అలాంటివారు ఎన్నో వైద్య పరీక్షల ద్వారా, శస్త్ర చికిత్సల ద్వారా, ఇతర వైద్య మార్గాల ద్వారా సంతాన సాఫల్యం కోసం యత్నిస్తుండటం విదితమే. చెట్లలో సంతానాన్ని ప్రసాదించే శక్తి ఉంటుందనే విషయం సంతానవృక్షం వల్ల తెలుస్తోంది.

ఏది అడిగితే అది ఇచ్చేది కల్పవృక్షం. కల్పం అంటే కోరిక, భావన. కల్పవృక్షం కింద నిలబడి మనసులో ఏది భావిస్తే అది ప్రత్యక్షమవుతుందని, కోరిన కోరిక ఎదుట ప్రత్యక్షమవుతుందని ఈ చెట్టుకు ప్రసిద్ధి ఉంది.

హరిచందనం అంటే బంగారు రంగుతో కూడిన సుగంధవృక్షం. హరి అంటే ఇంద్రుడని, అతణ్ని ఆనందింపజేస్తూ స్వర్గలోకంలో ఉంటుంది కనుక ఈ చెట్టుకు హరిచందనం అనే పేరు వచ్చింది. హరి శబ్దం రంగును చెబుతోంది. హరి అంటే కపిల వర్ణం. గోరోచన వర్ణం. బంగారు ఛాయ అని నిఘంటువులుచెబుతున్నాయి.ఆకర్షణీయమైన ఛాయతో మనసులను హరిస్తుంది కనుక ఈ చెట్టుకు హరిచందనం అని పేరు.

చెట్లను వనదేవతలని పిలవడం సంప్రదాయం. పూర్వకాలంలో మునుల ఆశ్రమాలు వనదేవతలకు నిలయాలై ఉండేవి. అభిజ్ఞానశాకుంతలంలో కాళిదాసు చెట్లను ఎంతో రమణీయంగా వర్ణించాడు. కణ్వుడి పెంపుడు కూతురు శకుంతల తన చెలులతో కలిసి ప్రతినిత్యం చిన్న మొక్కలకు, తీగలకు, వృక్షాలకు నీళ్లు పోసి రక్షించేదనే వర్ణనలు కనిపిస్తాయి. శకుంతలను అత్తవారింటికి పంపే సందర్భంలో కణ్వమహర్షి ఒక్కొక్క వనదేవత (చెట్టు) దగ్గరకు వెళ్ళి, మనుషులతో మాట్లాడినట్లే మాట్లాడుతూ, శకుంతల ప్రయాణానికి అనుమతిని కోరడం చూస్తే- పూర్వ మహర్షులు చెట్లను ఎంతగా ప్రేమించేవారో తెలుస్తుంది.

కల్మషవాయువులను దిగమింగి, ఉష్ణతాపాన్ని జీర్ణించుకొని అమృతవాయువులను అందిస్తూ, చల్లని నీడలను ప్రసాదిస్తూ, ఔషధాలతో ప్రాణాలను నిలుపుతున్న చెట్లు నిజంగా దేవతలే!

– డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ