SriVidyarnava Tantram of Sri Vidyaranya

శ్రీ విద్యార్ణవ తంత్రం
– శ్రీ విద్యారణ్య

– Sri Bhuvananandanadhulu

4 Parts | 2,370 Pages
Size : 14 cm x 22 cm

2,700.00

Share Now

Description

Sri Vidyarnava Tantram TELUGU

       శ్రీలలితామహాత్రిపురసుందరిని బ్రహ్మ మయముగా భావించి ఆ బ్రహ్మ రూపముగా రూపాంతరము చెందడానికి చేసే సాధనయే శ్రీవిద్య. ఇక్కడ విద్య అనగా మంత్రము అని అర్ధము. శ్రీ అనగా శ్రీలలితామహాత్రిపురసుందరి. అనగా ఆమెకు సంబంధించిన మంత్ర, యంత్ర మరియు తంత్రశాస్త్ర విజ్ఞానమునే శ్రీవిద్య అని అంటారు. అనంతాయై వేదాః అను వేదవాక్యమును అనుసరించి, వేదరూపమైన శ్రీవిద్యకూడా అనంతము. నాకు శ్రీవిద్య తెలుసు అని చెప్పుకొనేవారు ఎవరికీ ఈ విద్య పూర్తిగా తెలియదనే చెప్పవచ్చు.

      ఈవిద్య గురించి చాలా గ్రంథాలలో చెప్పబడినది. వాటిలో అరవై నాలుగు తంత్రములు, శుభాగమ పంచకములు ముఖ్యమైనవి. ఇన్ని గ్రంధాలను చదివి, అర్ధం చేసుకొని ఆచరణలో పెట్టకోవడం ఈరోజుల్లో మనబోటి వారికి చాలా కష్టము. అందువలనేమో విద్యానగర సామ్రాజ్యాన్ని స్థాపించిన శ్రీవిద్యారణ్యస్వామి భవిష్యత్తుని ఊహించి భావితరాలవారికి సులభంగా అర్ధమయ్యేటట్టుగా అన్ని తంత్ర శాస్త్రాలను క్రోడీకరించి “శ్రీవిద్యార్ణవ తంత్రమును” మనకు అందించారు. సాధకలోకం ఆ పుణ్యపురుషునకు ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండుగాక.

      ఈ గ్రంథము ఎన్నో తంత్రముల సమాహారము. శ్రీవిద్యారణ్య యతి విజయనగరమును విజయవంతంగా స్థాపించిన తర్వాత తంత్ర గ్రంథములన్నింటినీ ఔసోపనపట్టి వాటి నుండి శ్రీవిద్యా విషయములను ఎన్నింటినో ఒకచోట చేర్చి శ్రీవిద్యార్ణవ తంత్రంగా భావితరాలవారికి అందించారు. ఈ గ్రంథంలో శ్రీవిద్య గురించీ, దాని అనుబంధ విద్యల గురించి చాలా చక్కగా కూర్చారు. ఒకే విషయమును వేరు వేరు తంత్రములలో వేరువేరుగా చెప్పబడినది. శ్రీవిద్యార్ణవంలో కూడా అలాంటి వేరువేరు పద్ధతులను చేర్చడం జరిగింది. దీని వలన పాఠకులకు అక్కడక్కడ విషయం మీద గందరగోళం కలగడానికి అవకాశం ఉంది. అందుకే విషయం అర్థం కావడానికి నిష్ణాతులైన గురువు యొక్క అవసరం ఎంతో ఉంటుంది. ఈ గ్రంథంలో ఎన్నో మంత్రాలు, తంత్ర పద్ధతులు వివరించబడ్డాయి. ఎందరో దేవతల ఆవరణపూజలు వివరించబడ్డాయి. ముఖ్యంగా కౌళము, వామము, దక్షిణము, సమయములన్నింటినీ తెలుపబడ్డాయి. ఇందులో తెలియబడిన విషయములను పాఠకులు ఒక అవగాహన మాత్రంగానే అర్థం చేసుకోవాలి తప్ప వాటిని ఆచరించడానికి ప్రయత్నించకూడదు. ముఖ్యంగా శవసాధనలూ, శ్మశానసాధనలూ నేటి కాలానుగుణంగా ఎంతమాత్రమూ ఆచరణీయము కావు. ఈ మహోన్నత గ్రంథంలో ఎన్నో సమస్యలకు ఎన్నో ప్రయోగాలు, పరిహారాలు చెప్పబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి శత్రువును నిగ్రహించడం మరియు స్త్రీ వశీకరణ. పూర్వ కాలంలో రాజ్యవిస్తరణకు ఎక్కువగా యుద్ధాలు జరిగేవన్న సంగతి తెలిసిన విషయమే కదా. తమ బలము శత్రుబలము కన్నా తక్కువగల రాజులు తమ రాజ్యంలో ఉండే విద్యాధికుల చేత తమ రాజ్యమును తద్వారా తమ ప్రజలను రక్షించుకోవడానికి మాత్రమే ఆయా ప్రయోగాలు చేపించుకునేవారు. అంతేగానీ తమ స్వలాభానికి ఎప్పుడూ తంత్రములను ఉపయోగించేవారు కాదు. ఇక స్త్రీ వశీకరణ విషయానికి వస్తే, తమ స్వంత స్త్రీ కొరకై వాటిని ప్రయోగించేవారు కానీ పరస్త్రీ వశమునకు మాత్రము కాదు. ఎవడైనా మూర్ఖుడు తన స్త్రీని చెరపట్టినా లేదా తన స్త్రీ తనకు అనుగుణంగా ఉండకపోయినా ఆయా ప్రయోగములు చేసి ప్రయోజనము పొందేవారు. ఈ గ్రంథంలో ప్రకటించిన ప్రయోగాలు మనకు లౌకికంగా కనిపించినా మనం వాటిని అలౌకికంగానే అర్థం చేసుకోవాలి. ఒక మనిషిలో ఉండే అవలక్షణాలన్నింటికీ అతడి అరిషడ్వర్గాలే కారణం. అరిషడ్వర్గాలను జయించిన వాడే నిజమైన దైవసమానుడు. తంత్ర విధానాలన్నింటినీ ఆ అరిషడ్వర్గాలను నిర్మూలించకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలి తప్ప అధర్మ కామనలకు ఉపయోగించరాదు. అలాచేస్తే అనర్ధమే తప్ప మంచి జరగదు. దీనికి ఎన్నో ఉదంతాలు ఇప్పటికీ ఉన్నాయి.
శాస్త్రాలలో ఇలా ఎన్నో పూజలు చెప్పగా, కొంతమంది వీటివెనుక ఉన్న సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక “పూజలు ఉత్త దండగ. వీటివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. అనవసరంగా ధనము, కాలము వృధా” అని, “శ్వాస మీద ధ్యాస నిలపండి” అదే నిజమైన ఆధ్యాత్మికత అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఈ శ్వాస మీద ధ్యాస అన్నది తంత్రంలో మొట్టమొదటి ప్రక్రియ. అదే ప్రాణాయామం. అదే కాక బహిర్యాగము మొదలు పెట్టె ముందు చేసే అంతర్యాగంలోనూ, మరికొన్ని పూజా కర్మల్లోనూ ‘శ్వాస మీద ధ్యాస’ పెట్టి అనగా అప్పుడు ఆ సమయంలో ఏ నాసికా ఛిద్రము నుండి శ్వాస ప్రవహిస్తున్నదో ఆ వైపు నుండి ఫలానా క్రియ చెయ్యాలి అని చెప్పబడినది. అంతేగానీ శ్వాస మీద ధ్యాసే ఆధ్యాత్మికతకు చివరిమెట్టు కాదు. నిజానికి అదే తొలిమెట్టు. అక్కడ నుండి సాధకుడు ఎన్నో మెట్లు ఎక్కుతూ ఉండాలి.

       నాకు తెలిసినంత వరకు ఈ తంత్రమును ఎవరూ తెలుగులో అనువదించలేదు. ఈ తంత్రమును కొంతమంది పండితులు, సాధకులు హిందీ భాషలో అనువదించారు. అందరికీ సంస్కృతము, హిందీ భాషలు రాకపోవచ్చును. నేను మొదటిసారిగా మా గురువుగారు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీ శ్రీ శ్రీ శ్రీపాద జగన్నాథ స్వామి గారు) ముఖతః ఈ గ్రంధం గురించి విన్నాను. కానీ అవి తెలుగేతర భాషలో ఉండడం వలన, నాకు ఆయా భాషలు రాకపోవడం వలన కొంత నిరుత్సాహం చెందాను. 

        పూర్ణాభిషేకం అయిన కొన్ని సంవత్సరాల సాధన తర్వాత నాకు శ్రీవిద్య గురించి ఇంకా తెలుసుకోవాలని మనస్సు నందు ఉధృతమైన కోరిక జనించగా, మా గురువు గారి దగ్గర నా మానసిక క్షోభను మొరపెట్టుకున్నాను. అప్పుడు ఆయన ఈ తంత్రము నందు శ్రీవిద్యగురించి సమస్త విషయములు కలవు అని నన్ను ఈ శాస్త్రమును అధ్యయనం చేయమని సలహా ఇచ్చారు. నాకా సంస్కృతం రాదు. హిందీ అంతంత మాత్రము. అక్షరములు మాత్రము గుర్తుపట్టగలను. ఇదే విషయాన్ని గురువుగారికి నిస్సంకోచంగా విన్నవించుకున్నాను. అప్పుడు ఆయన నీవు మొదలు పెట్టు అన్నీ అవే అవగతమవుతాయని ఆశ్వీరదించారు. ఇంకేమి, గురువుగారి ఆశీర్వచనం లభించింది, మనస్సులో అమ్మ ప్రేరణ ఇస్తోంది. ఇంకేమి కావాలి? ఈ శాస్త్రాన్ని తెప్పించుకొని ఒక శుభముహూర్తమున చదవడం ప్రారంభించగా గురువుగారి ఆశీర్వచన బలం, అమ్మ దయా, కరుణా కటాక్షవీక్షణాల దీవెనల వలన నాకు ఈ గ్రంథము కొద్ది కొద్దిగా అర్ధమవడం ప్రారంభించింది. అప్పుడే ఈ గ్రంథాన్ని తెలుగులో రాసుకోవాలని అనిపించగా, గురువుగారికి ఇదే విషయాన్ని విన్నవించుకున్నాను. ఆయన ఎంతో సంతోషించి “తథాస్తు” అని దీవించి తప్పక రాయమని ప్రోత్సహించారు. అమ్మకు, గురువుకు అభేదము. శ్రీవిద్యలో ఇది మొదటి పాఠము. సద్గురువు ఆశీర్వచనము అంతటి బలమైనది. లేకపోతే సంస్కృత, హిందీ భాషలు రాని నేను ఈ గ్రంథమును తెలుగులోకి అనువదించడం ఏమిటి? కనుక, ఈ అనువాదం నాది కానే కాదు అని పాఠకలోకానికి సవినయంగా తెలియ పరచుకుంటున్నాను. ఇది అమ్మ ప్రేరణ మాత్రమే. ఇందులో తప్పులు మాత్రం నావి. వాటిని పాఠకులు, పండితులు, సాధకులు సహృదయంతో అర్ధం చేసుకొని నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇందు సాధనా రహస్యములు మూలగ్రంథమును అనువదించి ఇవ్వబడుచున్నవి.

Sri Vidyarnava Tantram of Sri Vidyaranya