Sri Mangala Gowri Vratam

శ్రీ మంగళ గౌరీ వ్రతం 

25.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

శ్రీ మంగళ గౌరీ వ్రతం

మాంగల్యసిద్ధిదాయిని
మహిళలు దీర్ఘ సుమంగళిగా, సకల సౌభాగ్యాలనూ, సత్సంతానాన్నీ పొంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం జీవించే భాగ్యాన్ని పొందడానికి మంగళగౌరి వ్రతాన్ని వైదిక సంస్కృతిలో భాగంగా మన పూర్వ ఋషులు అనుగ్రహించారు. ఇది యుగాలుగా ఆచరణలో ఉన్న వ్రతం. ఇందుకు సంబంధించిన గాథలు పురాణాల్లో ఉన్నాయి.
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి రుక్మిణి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించింది. రుక్మిణీ కళ్యాణం కథ వెనుక చరిత్ర ఇది. రుక్మిణియేకాకుండా శ్రీకృష్ణ పత్నులందరూ భర్త అనురాగాన్ని పొందడానికి మంగళగౌరి వ్రతం ఆచరించారు. అంతకుముందు యుగంలో సీతాదేవి కూడా గౌరిని పూజించి శ్రీరాముని భర్తగా పొందినట్టు కథ ఒకటి ఉంది.
హిమవంతుని కూతురు ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందాలని గౌరీదేవిని పూజించినట్టు కథనం. శివుడు ఒకప్పుడు కఠోర తపస్సు చేస్తున్న సమయంలో ఆయన పక్కన కూర్చున్న పార్వతి ఆ తపోగ్ని కారణంగా పార్వతి నల్లగా మారిపోయిందట. శివుడు కళ్ళు తెరచి, పార్వతిని చూసి ‘కాళీ’ అంటూ హేళన చేశాడట. ఆ పిలుపును అవమానకరంగా భావించిన పార్వతి ఆగ్రహించగా, శివుడు ఆమెను గంగతో అభిషేకించాడట. అప్పుడు ఆమె నల్లరంగు పోయి, గౌర వర్ణంతో మెరిసిపోవడంతో శివుడు ‘గౌరీ’ అని ఆప్యాయంగా పలకరించాడట. ఆ పిలుపుతో ఆ తల్లి మురిసిపోయింది. నాటి నుంచి పార్వతిని గౌరీదేవిగా ముల్లోకాలూ కీర్తిస్తున్నాయి.
క్షీర సాగర మధనంలో ముందుగా హాలాహలం పుట్టింది. దేవ-దానవుల ప్రార్థనపై శివుడు కంఠంలో గరళం మింగాడు. శివుడు కట్టిన మాంగల్యం గౌరీ కృప. ఎలాంటి ఆపద కలగదు. శివుడు ఆమె కంఠాన కట్టిన మాంగల్యం అంత ప్రభావితమైనది. గౌరీ దేవి అనుగ్రహం పొందాలంటే ఆమెను ప్రతి మంగళవారం, విశేషించి శ్రావణ మంగళవారాల్లో పూజిస్తే- ఆమె కృప వల్ల మాంగల్య సిద్ధి లభిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలు సౌభాగ్యాన్నీ, ఆయురారోగ్యాలనూ పొంది- దీర్ఘ సుమంగళిగా జీవిస్తారని పెద్దలు చెబుతారు.
వ్రత విధానం
ఈ వ్రతాన్ని మహిళలు వారి వివాహానంతరం మొదటి అయిదు సంవత్సరాలలో- ప్రతి శ్రావణమాసంలో వచ్చే మంగళవారాలలో ఆచరించాలి. మంగళగౌరిని ‘మంగళేమంగళాధారే… మాంగల్యం దేహిమే’ అని స్తుతించి, తోరాలను పూజించి, ఒక తోరాన్ని కలశ రూపంలో ఉన్న గౌరీదేవికి కట్టి, మరొకటి తన కుడచేతికి కట్టుకోవాలి. కలశం ముందు చలిమిడితో చేసిన ప్రమిదలలో- నేతిలో ముంచిన వత్తులతో అయిదు దీపాలు వెలిగించి, ఆ దీపాలపై అట్లకాడను మసిబారుస్తూ వ్రత కథ చెప్పుకుంటారు. పూర్వం సుశీల అనే మహా సాధ్వి మంగళగౌరి వ్రతం చేసి అల్పాయుష్కుడైన తన భర్తను, పూర్ణాయుష్కుణ్ణి చేయడం ఆ కథ సారాంశం.
కథ చెప్పుకొని, అట్లకాడ మీద పట్టిన మసికి నెయ్యి చేర్చి, కాటుకగా తాను పెట్టుకొని, వాయనం తీసుకోవడానికి వచ్చిన పెద్ద ముత్తయిదువులకు అందిస్తారు. సంప్రదాయం, ఇంటి ఆచారాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం దీపాలతో పాటు ముత్తయిదువుల సంఖ్య కూడా పెరుగుతుంది. మొదటి ఏడాది ఐదుతో ఆరంభమై, ఐదవయేట 25 దీపాలను వెలిగించి, అంతేమంది ముత్తయిదువులకు కాటుకతో పాటు జ్యోతులు వెలిగించిన ప్రమిదలనూ, వాయినాలనూ అందజేస్తారు. వ్రత కథలో సుశీల ఈ వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘ సుమంగళిగా, భర్త అనురాగంతోపాటు సత్సంతానవతి అవుతుంది. అంధులైన ఆమె అత్తమామలు ఆమె పట్టిన కాటుక పెట్టుకొని కంటి చూపు పొందుతారు. వారి అభిమానం, ఆశీస్సులూ ఆమెకు లభిస్తాయి.
ముత్తయిదువులు గౌరీదేవికి ప్రతీకలు. జ్యోతులతో పాటు ఫల, పుష్ప తాంబాలాదులూ, శనగలూ వాయినంగా స్వీకరించి- వారు ఇచ్చే ఆశీస్సులు సాక్షాత్తూ గౌరీదేవికి ఇస్తున్నట్టేనని విశ్వాసం.
మంగళగౌరీ వ్రతాన్ని కొత్తగా వివాహమైన యువతులే కాకుండా సువాసినులందరూ ప్రతి శ్రావణ మంగళవారం రోజునా ఆచరించాలి. ఆ రోజున గౌరీదేవిని షోశోపచారాలతో పూజించి, ఆ తల్లికి ఒక తోరాన్ని కట్టి, తను ఒక తోరాన్ని ధరించాలి. ఇంటిలోని ఆడపిల్లలకూ, కోడళ్ళకూ, వచ్చిన బంధువులకూ తోరాలను ఇవ్వవచ్చు. గౌరిని పూజించి, తోరాలను కట్టుకొని, ప్రసాదాలను ఆరగించిన వారు ఆ తల్లి అనుగ్రహం వల్ల అఖండ సౌభాగ్యవంతులు అవుతారని నమ్మిక. -ఎ. సీతారామారావు