Selavulu Vachhay

మరిన్ని Telugu Books కై
Tags: ,
Share Now

Description

సెలవులొచ్చాయోచ్‌….!!!… Holidays

కొత్త ఉత్సాహం

మండువా లోగిళ్లు.. పడమటి గాలులు.. అచ్చంగాయలు.. తొక్కుడు బిళ్లలు.. తాటి ముంజెలు.. మామిడి తాండ్రలు.. వీటన్నింటినీ మించి.. బోలెడన్ని సెలవులు!!!

వేసవి అంటేనే మనసు ఉప్పొంగే ఉత్సాహం. పిల్లలకు మాటల్లో చెప్పలేనంతటి పెద్ద సంబరం

కానీ ఈ వేసవి సంబరాన్ని మనం ఇప్పుడు అంత అందంగా జరుపుకొంటున్నామా? అంత ఆనందాన్నీ అనుభవిస్తున్నామా?
పల్లెలకు పోవటం, రోజంతా కుటుంబంలోని చిన్నాపెద్దా అందరితో ఉల్లాసంగా గడపటం.. కాకి బాణాల నుంచి తూగుటుయ్యాలల వరకూ.. పాల ఐస్‌ నుంచి ఆరుబయట గోరుముద్దల వరకూ.. ఒకప్పుడు పిల్లలు మండు వేసవిలో సైతం బోలెడన్ని చల్లటి అనుభూతులను మూటగట్టుకునేవారు. కానీ నేడు వేసవి మొదలవుతూనే కోచింగులు, ఎంసెట్‌, ఆసెట్‌, ఈసెట్‌, షార్ట్‌టర్మ్‌, లాంగ్‌టర్మ్‌, బ్రిడ్జ్‌ కోర్సులు ట్రైనింగులు.. ఇవన్నీ కలిసి సెలవుల్ని కొద్దికొద్దిగా కొరుక్కుతినేస్తున్నాయి. దీంతో పిల్లలకు బయటకు వెళ్లి కొత్త వాతావరణాన్ని పరిచయం చేసుకుని, ఆత్మీయ ప్రపంచాన్ని ఆవాహన చేసుకునే అవకాశమే చిక్కటం లేదు. కాస్త పెద్ద వయసు వచ్చిన తర్వాత బతుకు పోరాటాలు ఎలాగో తప్పవు.           కానీ చిన్నతనం నుంచే సెలవు రోజులు ‘రొటీన్‌’గా మారిపోవటం ఏ రకంగానూ మంచిది కాదంటున్నారు నిపుణులు! అలాగని ఈ బిజీ యుగంలో నెలానెలన్నర పాటు పిల్లలను పూర్తిగా వదిలేస్తామా? రాష్ట్రంలో అందరికీ వేసవి సెలవులు ఆరంభమైన నేపథ్యంలో ఈ వేసవిలో మనమేం చెయ్యొచ్చు? అసలు వేసవి సెలవులంటే ఒక్క పిల్లలకేనా?

రేపటికి పడుతుంది పునాది!

It takes a village to raise a child
అన్నది ఓ చక్కటి ఆఫ్రికా సామెత. దీనర్థం పిల్లల్ని మనం ఒక్కళ్లమే కాదు,  మొత్తం ఊరుఊరంతా పెంచుతుందని! పిల్లలు పెరిగి పెద్దవటంలో చుట్టుపక్కల వారి పాత్ర, వారితో సంబంధాల ప్రభావం చాలా ఎక్కువని! అందుకే పిల్లల్ని సాధ్యమైనన్ని ప్రదేశాలకు పంపి ఎక్కువ మందిని కలిసే    అవకాశాలు కల్పించాలి!ప్రకృతికి దగ్గరగా ఉండే పచ్చటి   పల్లెను చూస్తూనే పిల్లల్లోంచి ఒక  చిట్టి శాస్త్రవేత్త బయటకు వస్తాడు.
కుండలు చెయ్యటం, పాలు పితకటం, తేనె తియ్యటం, ఎడ్ల బండి ఎక్కటం, పొలం దున్నటం.. ఇవన్నీ పిల్లలను విస్మయానికి గురి చేసే అపురూపమైన అనుభూతులే కాదు.. వీటికి అంతకు మించి ప్రయోజనం కూడా ఉంది. భవిష్యత్తులో వాళ్లకు మన దేశం గురించీ, జన జీవితం గురించీ, ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థ గురించి  అర్థం చేసుకోవటానికి ఇవెంతో దోహదం చేస్తాయి. పల్లె గురించి తెలియని వారికి మన దేశ సామాజిక, ఆర్థిక మూలాలు అర్థం కావటం చాలా కష్టం. పంచాయతీల నుంచి మొదలయ్యే దేశ రాజకీయాలను అవగాహన చేసుకోటానికీ ఇది ముఖ్యమే. ఇక ప్రకృతికి దగ్గరగా ఉండే పల్లెను చూస్తూనే వాళ్లలో ఒక చిట్టి శాస్త్రవేత్త బయల్దేరి, ఎన్నో జీవన సూత్రాలను అప్రయత్నంగా గ్రహిస్తాడు. అందుకే వేసవి సెలవుల్లో పిల్లలను పల్లెకు పంపి.. రకరకాల చేతి వృత్తులతో అలరారే గ్రామ జీవితాన్ని, చెట్టుచేమలతో ఓలలాడుతుండే అక్కడి వాతావరణాన్ని పరిచయం చెయ్యటం, ముఖ్యంగా పల్లె వాతావరణాన్ని అనుభవించనివ్వటం చాలా అవసరం. అలాగే పల్లెల్లో ఉండే పిల్లలు పట్టణంలోని తమ ఆత్మీయులను సందర్శించి అక్కడి జీవితాన్ని ఆకళింపు చేసుకోవటం భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగకరమైన అనుభవం అవుతుంది. అందుకే పిల్లలను వేసవిలో  తాము రోజూ చూసే వాతావరణానికి భిన్నమైన ప్రాంతాలకు పంపటం ముఖ్యమని గుర్తించాలి!!

జీవితానుభవాలకు కార్యశాల

సెలవులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలంతా ఎవరి సామాన్లు వాళ్లు సద్దుకుని తిరుగు ప్రయాణమయ్యే రోజున మనసులు ఆర్ద్రమైపోయి, కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా.. ఆప్యాయంగా మళ్లీ ఎప్పుడు కలుద్దామని ఆలోచించటం.. వీధి చివరి వరకూ వచ్చి టాటాచెబుతున్న తాతా బామ్మలను చూసి గుడ్ల నీరు కుక్కుకోవటం..చిన్నచిన్న దుఃఖాలు, బెంగలు, ఆనందాలు.. కుటుంబమంతా కలిసి గడిపే సెలవులే ఒక రకంగా పిల్లలకు మనమిచ్చే గొప్ప బహుమతులు.
ప్రేమ, ఆప్యాయత, చనువు, వీటన్నింటినీ మించి బాధ్యతగా చూసుకోవటం.. ఇవన్నీ పిల్లలకు బేషరతుగా దక్కే ఒకే ఒక్క ప్రదేశం తాతాబామ్మల ఇల్లు. అందుకే పిల్లలు అక్కడ ఎలాంటి సంకోచాలూ లేకుండా పూర్తి స్వేచ్ఛగా ఉండగలుగుతారు. తల్లిదండ్రులూ వారిని నిశ్చింతగా వదలగలుగుతారు. వేసవిలో చిన్నాన్నలు, పెదనాన్నలు, బావలు, అత్తలు.. వీరందరితో గడపటం వల్ల పిల్లలకు ఆప్యాయతల రుచి, అందులో ఉండే ఆనందం తెలుస్తాయి. కుటుంబ విలువలు అబ్బుతాయి. మనం ఒంటరివాళ్లం కాదన్న భావన మానసికంగా గొప్ప ఊరటనిస్తుంది. అన్నింటినీ మించి లక్ష్మణ రేఖలు దాటకుండానే సరదాగా గడపటం ఎలాగన్నది అనుభవంలోకి వస్తుంది. ఒకరికొకరు కథలు చెప్పుకోవటం, అంత్యాక్షరి ఆడటం.. ఇంటి వంటలను పిల్లలంతా కలిసి కూర్చుని వైనవైనాలుగా కబుర్లు చెప్పుకొంటూ తినటం.. మధ్యాహ్నం ఎండల్లో ఇంటి పెద్దలంతా సేదదీరుతున్నా పిల్లలంతా ఒక గదిలో చేరి, చప్పుడు చెయ్యకుండా అల్లరి చేయటం.. చిన్నచిన్న అలకలు, కీచులాటలు, మళ్లీ ప్రేమగా కలిసిపోవటం.. ఇవన్నీ గొప్ప అనుభవాలు. వీటి నుంచి వాళ్లెన్ని నేర్చుకుంటారో, పెద్ద అయిన తర్వాత ఈ రోజులను మురిపెంగా తల్చుకుంటారో! ఆహ్లాదం, విజ్ఞానం, ఆత్మీయతల వంటివన్నీ కలగలిసిన ఇంతటి అపూర్వమైన అనుభవం వేసవిలో కాక మరెప్పుడు దక్కుతుంది?

సహనం కోసం సహజీవనం..

యుద్ధం రాకుండా చూడటం రాజకీయ నాయకుల బాధ్యత అయితే ప్రజలు కలసి మెలసి సఖ్యతతో జీవించేలా చెయ్యటమన్నది చదువుల బాధ్యత అంటారు ప్రఖ్యాత విద్యావేత్త మరియా మాంటిస్సోరి. అందుకే పిల్లలకు వీలైనన్ని సంప్రదాయాలను, సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిచయం చెయ్యాలి. ఇతర సంస్కృతులను అర్థం చేసుకుని, ఆనందంగా ఆమోదించటం నేర్పించాలి.సంస్కృతికీ, విద్యకూ పరిమితులు  ఉండవు. మనం వీటితో కలిసి ఎంత దూరం ప్రయాణిస్తామన్నదే ముఖ్యం  – మాంటిస్సోరి

వేసవి సెలవుల్లో పిల్లలను కనీసం 2-3 రోజులైనా మన ఇంటికి, మన సంస్కృతికి భిన్నంగా ఉండే మన మిత్రులు, ఆత్మీయుల ఇళ్లలో గడిపేలా చూడటం ఉత్తమమని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల మన అలవాట్లు, మన ఇంటి ఆచారాలే కాదు.. ఈ ప్రపంచంలో మరెన్నో సంస్కృతులు ఉన్నాయన్న వాస్తవాన్ని వాళ్లు అవగతం చేసుకుంటారు. మన సంస్కృతే ఉత్తమమన్న ఆలోచనల నుంచి బయటపడి.. భిన్న సంస్కృతులను చూస్తూ, వాటిని అర్థం చేసుకుని, వాటితో సహజీవనానికి అలవాటుపడతారు. ఉదాహరణకు పంజాబీ, మళయాళీ, తమిళం, హిందూ, ముస్లిం, క్రైస్తవం.. వంటి భిన్న ప్రాంతాలకు, సంస్కృతులకు, మతాలకు చెందిన మిత్రుల ఇళ్లలో సన్నిహితంగా గడపటం వల్ల పిల్లలకు రకరకాల ఆహార సంప్రదాయాలు, అలవాట్లు, కట్టుబాట్లు, పండగల వంటివి పరిచయమవుతాయి. చిన్నవయసులో ఇలా సాంస్కృతిక భిన్నత్వాన్ని దగ్గరగా చూసిన పిల్లలకు సహనం, సహజీవనం తేలికగా అలవడతాయి. దీనివల్ల భవిష్యత్తులో చదువుకునేటప్పుడు హాస్టళ్లలో ఉండాల్సి వచ్చినా, వేర్వేరు ప్రాంతాలు, పరిస్థితుల్లో ఉద్యోగాలు చేయాల్సి వచ్చినా వాళ్లు ఆత్మ విశ్వాసంతో, అందరితో కలసి మెలసి ఆనందంగా గడపగలుగుతారు. చిన్నవయసులో ఒకటి రెండ్రోజులు ఇంటికి దూరంగా గడిపే ఈ తరహా ‘స్లీప్‌ ఓవర్‌’లను పిల్లలూ బాగా ఆస్వాదిస్తారు కూడా!

వేసవి.. సేవా సమయం!

బయటకు వెళ్లటం కష్టమైతే మీ కాలనీలోని, లేదా వీధిలోని చిన్నపిల్లలను చేరదీసి వాళ్లకు రకరకాల కథలు చెప్పటం, పుస్తకాలు చదివి వినిపించటం, పర్యావరణ పరిరక్షణ గురించి వివరించటం, వీలైతే మొక్కలు నాటించి వాటిని సంరక్షించటం వంటి రకరకాల సామాజిక చైతన్య కార్యక్రమాలను తేలికగా నిర్వహించవచ్చు.వేసవిలో ఆత్మీయుల ఇళ్లలో శుభకార్యాల వంటివేమైనా ఉంటే పిల్లలను పంపి, వాళ్లు అక్కడి పనుల్లో నిమగ్నమయ్యేలా చూడటం మంచిది.

మన దేశంలో ఇంకా పూర్తిగా వేళ్లూనుకోలేదుగానీ అమెరికాతో సహా చాలా పాశ్చాత్యదేశాల్లో హైస్కూలు పిల్లలు వేసవిలాంటి దీర్ఘకాలం సెలవుల్లో (వెకేషన్‌) తప్పనిసరిగా ‘సోషల్‌ వర్క్‌’ చేయాల్సి ఉంటుంది. ఆసుపత్రులకు వచ్చే రోగులకు సహాయంగా నిలబడి దారి చూపటం, వృద్ధాశ్రమాల్లో పెద్దలకు అవసరమైన చిన్న చిన్న సపర్యలు చేయటం, అనాధ శరణాలయాలకు వెళ్లి చిన్నపిల్లలకు పాఠాలు బోధించటం.. ఇలా కొద్దిరోజుల పాటు ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ఎంచుకుని, విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. స్కూలు తెరిచిన తర్వాత వాళ్లీ అనుభవాలన్నీ క్రోడీకరించి ఒక నివేదిక కూడా సమర్పిస్తారు. దీనివల్ల పిల్లలకు లోకజ్ఞానం పెరగటమే కాదు, చొరవ, సేవా భావం కూడా అలవడతాయి. మన దేశంలో కూడా హైస్కూలు, కాలేజీ పిల్లలు.. పెళ్లిళ్లలో, పెద్దపెద్ద కార్యక్రమాల్లో అతిథులను ఆదరంగా తోడ్కొనటం, వడ్డనలు చేయటం, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాల్లో చేరి రకరకాల సహాయ సేవలు అందించటం వంటివి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. పిల్లలు వేసవిలో కొద్దిరోజుల పాటైనా ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమవటం వల్ల వారిలో సేవాభావం అలవడుతుందని, ముఖ్యంగా నిర్వహణా సామర్థ్యం మెరుగవుతుందని, సొంత కాళ్ల మీద నిలబడటంలో ఉండే మజా కూడా తెలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

సెలవులు క్షణాల్లో ఆవిరి

చిరకాలంగా మన సంస్కృతిలో భాగమైన పచ్చీసు, వామన గుంటలు, వైకుంఠ పాళీ, చెస్‌, కబడ్డీ, రింగాట వంటి వాటితో ఎన్నో ప్రయోజనాలున్నాయి. బొంగరాల ఆటతో చేతి కండరాల కదలికలు మెరుగవుతాయి. అల్లాబిల్లితో శరీరాన్ని బ్యాలెన్స్‌ చేసుకునే సామర్థ్యం, ఖోఖోతో సాటివారితో సమన్వయం, వైకుంఠపాళితో గెలుపోటములు స్వీకరించటం.. ఇలా ఆటల్లోనే బోలెడన్ని విషయాలు అబ్బుతాయి.ఇంట్లో కావొచ్చు, సమ్మర్‌ క్యాంపుల్లో కావొచ్చు.. పిల్లలు వీటిలో నిమగ్నమయ్యేలా చూడటం అన్ని విధాలా శ్రేయస్కరం.
నెల రోజుల సెలవులు, విశ్రాంతి చిక్కినప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికా లేకుండా వదిలేస్తే రోజులన్నీ వృథాగా ఆవిరైపోతాయి. అందుకే వేసవికి కచ్చితమైన ప్రణాళిక సిద్ధం చేయటం ముఖ్యం. కొత్త ప్రదేశాలకు వెళ్లి రావడంతో పాటు కొత్త పుస్తకాలు చదవటం, కొత్త నైపుణ్యాలను నేర్వటం వంటి వాటిలో నిమగ్నమైతే రొటీన్‌కు భిన్నంగానూ ఉంటుంది, కొత్త సామర్థ్యాలూ అబ్బుతాయి. ఈ సమయంలో చేసే ఏ పని అయినా పిల్లలకు మరీ తేలికగా అనిపించకూడదు. కొద్దిగా సవాల్‌లా ఉండాలి. కొత్త విదేశీ భాష లేదా కొత్త కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ నేర్చుకోవటం, తైక్వాండో, కరాటే, స్కేటింగ్‌, ఈత వంటి కొత్త క్రీడ లేదా గిటార్‌, సంగీతం వంటి కొత్త విద్యలు నేర్చుకోవటం, వ్యాసాలు, కథలు రాయటం, అనుభవాలను బ్లాగ్‌లో రాసుకోవటం వంటివి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. విశ్రాంతి సమయంలో పిల్లలకు వంట, ముఖ్యంగా కొత్తకొత్త వంటకాలు చేయటం కూడా పరిచయం చెయ్యొచ్చు. చిన్నతనంలో సరదాగా నేర్చుకునే నైపుణ్యమే.. పెద్దైన తర్వాత చాలా సందర్భాల్లో అక్కరకొస్తుంది. సంప్రదాయ ఆటలనూ ప్రోత్సహించవచ్చు. వీటివల్ల మానసిక వికాసం, బృందంతో కలిసి పని చేయటం, గెలుపు ఓటములను హుందాగా స్వీకరించటం వంటి ఎన్నో లక్షణాలు అబ్బుతాయి.

వేసవి వినోదం పెద్దలకు వద్దా?

ఏదో తెలీని నిస్సత్తువ. పని మీదా, చదువు మీదా మనసు లగ్నం కాకపోవటం. రకరకాల చింతలూ, చికాకులూ, కదిలిస్తే కన్నీరు రావటం, క్రమేపీ వృత్తిలో సామర్థ్యం తగ్గటం.. బయటకు చెప్పుకోలేని అంతర్‌ క్షోభ.. ఈ లక్షణాలను నేడు వైద్యరంగం
‘బర్న్‌ ఔట్‌’ అంటోంది!!రోజువారీ పనితో ప్రయోజనం ఏమిటో తెలుసా? అది సెలవులను మరింత రుచికరంగా, ఆస్వాదనీయంగా మారుస్తుంది! – బెర్ట్రాండ్‌ రసెల్‌
వేసవి సెలవులంటే పిల్లలకేనా? పెద్దలకు అక్కర్లేదా? అంటే.. పెద్దలకూ వేసవి వంటి దీర్ఘకాలిక సెలవులతో ఎంతో లాభం ఉంటుందని ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయన పూర్వకంగా నిరూపించారు. నిద్ర లేస్తూనే కళ్ల ముందర లక్ష్యాలు, పోటీలూ, బతుకు పోరాటాలూ పెరిగిపోయిన ఈ రోజుల్లో పెద్దలకూ ప్రశాంతత అనేదేం ఉండటం లేదు. దీనివల్ల అలసట, నిస్సత్తువ పెరిగిపోతున్నాయి. దీర్ఘకాలం ఇవిలాగే ఉండిపోవటం ‘బర్న్‌ ఔట్‌’కు దారి తీస్తోందని, దీన్నొక ఆధునిక రుగ్మతగా గుర్తించక తప్పదని వైద్యరంగం భావిస్తోంది. రోజురోజుకూ మనుషులు డీలాపడిపోతుండే ఈ దశ నుంచి బయటపడటానికి.. ఏడాదికి ఒక్కసారైనా ఒకటి రెండు వారాల పాటు పనికి దూరంగా ‘వెకేషన్‌’ తీసుకోవటం తేలికైన పరిష్కారమని మనస్తత్వ శాస్త్రవేత్తలంతా నొక్కి చెబుతున్నారు. అందుకే వేసవి సెలవులకు ఒకప్పటి కంటే ఇప్పుడు ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. సెలవుల వల్ల మానసికంగా పునరుత్తేజితమై.. పనిలో ఉత్పాదకత పెరగటం, జీవితంలో చక్కటి పురోగతి వంటివన్నీ సాధ్యమవుతాయని ‘వర్క్‌ టు లివ్‌: ద గైడ్‌ టు గెటింగ్‌ ఎ లైఫ్‌’ రచయిత జో రాబిన్సన్‌ సూచిస్తున్నారు. మరో ముఖ్య విషయం ఏమంటే రోజువారీ లక్ష్యాలుండే కార్పొరేట్‌ ఉద్యోగులు, సీఈవోల వంటివారికే కాదు.. ఇంట్లోనే ఉండిపోయే మహిళలు, సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్లు.. వీరంతా కూడా నిత్యం మానసిక ఒత్తిడి అనుభవిస్తూ.. ‘బర్న్‌ ఔట్‌’కు గురవుతుంటారని గుర్తించారు. ఏడాదికి ఒక్కసారైనా ఆటవిడుపు అన్నది వీరందరికీ ఒక ‘టానిక్‌’లా పని చేస్తుంది.

తప్పదు, ఇల్లు వదలాల్సిందే!

వెకేషన్‌.. అందరికీ లాభం! ఫ్రాన్స్‌ వంటి ఐరోపా దేశాల్లో ఉద్యోగులందరికీ సంవత్సరానికి 4-5 వారాల వెకేషన్‌ ఉంటుంది. బ్యూరో ఆఫ్‌ లేబర్‌ స్టాటిస్టిక్స్‌ ఈ దేశాల్లో ఉద్యోగుల పనితీరును అంచనా వేసి.. ఇతర దేశాల్లోని ఉద్యోగులకంటే కూడా వీరి ఉత్పాదక సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదల ఉన్నట్టు గుర్తించింది.అమెరికన్‌ సైకోసొమాటిక్‌ సొసైటీ అధ్యయనంలో- ఏటా కొద్ది రోజుల పాటు సెలవులు తీసుకునే ఉద్యోగుల ఆయుర్దాయం మెరుగ్గా ఉంటున్నట్లు తేలింది.

చాలామంది ఈ సెలవుల్లోనన్నా నాలుగు రోజులు ఇంటి వద్దే విశ్రాంతిగా ఉందామని అనుకుంటూ ఉంటారుగానీ.. వాస్తవానికి అది జరిగేపని కాదు! ఎంత విశ్రాంతిగా ఉందామనుకున్నా చివరికి ఇంటి మరమ్మతులో, చాలాకాలంగా పూర్తికాని పనులో, పాత పుస్తకాలో నెత్తినేసుకుని.. రోజులన్నీ వాటితోనే గడపాల్సి వస్తుంది. ఫలితంగా సెలవుల్లోనూ మానసికంగా, శారీరకంగా పూర్తి ‘అవిశ్రాంతంగా’ తయారవుతుంటారు. మరికొంతమందికేమో రెండు రోజుల విశ్రాంతి దొరికితే ఏమీ పాలుపోదు. నిత్యం ఆఫీసు పనికి, లక్ష్యాలకు అలవాటు పడిన ప్రాణాలకు కళ్ల ముందర బిజీబిజీ వాతావరణం లేకపోతే ఏం చెయ్యాలో తెలీక అదో పెద్ద ‘ఒత్తిడి కారకం’గా కూడా తయారవుతుంది. అందుకే సెలవుల్లో పూర్తి విశ్రాంతి కావాలంటే ‘రొటీన్‌’కు దూరంగా, ఇల్లు వదిలి.. వైవిధ్యభరితమైన ప్రదేశానికి వెళ్లటమే మంచిదంటున్నారు మానసిక నిపుణులు. మొబైల్‌, వాట్సప్‌, ట్విటర్ల వంటివన్నీ మనల్ని మానసిక ఒత్తిడిలోకి నెట్టేవే. వీటికీ దూరంగా ఉండాలంటున్నారు ‘గో అవే జస్ట్‌ ఫర్‌ ద హెల్త్‌ ఆఫ్‌ ఇట్‌’ రచయిత డా।। మెల్‌ బొరిన్స్‌. అందుకే పిల్లల పరీక్షల వంటి అడ్డంకులేమీ లేకుండా, కుటుంబమంతా విశ్రాంతిగా గడిపే వీలున్న వేసవిలోనే ఏదో ఒక ఊరికి ప్రయాణం కడితే.. ఇంటిల్లిపాదికీ ఉత్సాహం, ఉత్తేజం దక్కుతాయి.