Description
Keellanoppulu Mee Samasyalithe Book
అయితే కీళ్ల అరుగుదలతో వచ్చే ఈ నొప్పుల గురించి ఎన్నో అపోహలున్నాయి. ఆ అపోహల గురించి, అసలు వాస్తవాల గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కీళ్ల అరుగుదలా వన్–వే ట్రాఫిక్ లాంటిదే…
కాలం ముందుకు జరుగుతున్నట్లు… వయసు రోజురోజుకూ పెరుగుతున్నట్లు… అరుగుదల కూడా ముందుకే కొనసాగుతుంది. అలా అరిగే ప్రక్రియను ఏవిధంగానూ వెనక్కు మళ్లించలేం.
ఇదీ వన్–వే ట్రాఫిక్‌లో ప్రయాణించడం లాంటిది. ఆ దారిలో వెనక్కు తిరగడం సాధ్యం కాదు. కాకపోతే ప్రయాణాన్ని నెమ్మదిగా సాగేలా చేసుకోగలం.
కీళ్ల అరుగుదల విషయంలోనూ అంతే. అందమైన మన మునుపటి ఫిట్‌నెస్‌ను కొనసాగించేందుకు వ్యాయామాల వంటి మంచి జీవనశైలి అలవాట్లతో, మరికొన్ని జాగ్రత్తలతో వాటి అరుగుదల ఆలస్యంగా జరిగేలా మాత్రం చూసుకోగలం.
కీలూ – కండర సంబంధం… కృష్ణార్జున బంధం
కీళ్ల అరుగుదల తక్కువగా ఉండాలంటే దానికి సంబంధించిన కండరం బలంగా ఉండాలి. అందుకే కీలుకీ–కండరానికీ ఉన్న సంబంధాన్ని ఒకరకంగా కృష్ణార్జున బంధంగా చెప్పవచ్చు.
అర్జునుడికి కృష్ణుడి సపోర్ట్ ఉన్నట్లే… మన మోకాలి కీలుకి క్వాడ్రిసెప్స్ అనే తొడ కండరాల సపోర్ట్ ఉంటుంది.
యుద్ధంలో అర్జునుడిపై పడబోయిన అనేక దెబ్బలను శ్రీకృష్ణుడే కాచుకుని రక్షించినట్టే, మోకాలి కీళ్లపై పడే భారంలో చాలాభాగాన్ని క్వాడ్రిసెప్స్ కండరాలు తీసుకుంటాయి.
అలాగే తుంటి భాగానికి వస్తే… తుంటి కీలు దగ్గర కాలు ఫ్రీగా కదిలేందుకు, కాలు మన శరీరభాగాన్ని అంటి ఉండేందుకు ‘అబ్‌డక్టార్ మజిల్స్ ఆఫ్ హిప్’ అనే కండరాలు ఉపయోగపడతాయి.
ఇదే తరహాలో మెడ కండరాలు, మెడ భాగంలోని వెన్నుపూసలపై పడే భారాన్ని తీసుకుంటాయి.
అందుకే సర్వైకల్ సమస్య వచ్చినప్పుడు డాక్టర్లు మొదట మెడ కండరాలను బలంగా మార్చే వ్యాయామాలను చేయాల్సిందిగా సూచిస్తుంటారు.
ఇలా నడిచేందుకు ఉపయోగపడేది కీలు అయితే… దాన్ని నడిపించేందుకు సహాయపడేది సంబంధిత కండరం అన్నమాట. వ్యాయామంతో కండరాలు ఎంత బలంగా ఉంటే… కీలుపై పడే భారం అంతగా తగ్గుతుంది.
ఆ తరంలో ఆ బాధలు లేవెందుకు…
అప్పటి తరంలో చాలామందికి వృద్ధాప్యం వచ్చిన చాలా ఏళ్లకు గానీ కీళ్లనొప్పులు వచ్చేవి కావు. అయితే ఇటీవల చాలామందికి నలభై ఏళ్లు దాటకుండానే కీళ్లనొప్పులు వస్తున్నాయెందుకు అని కొందరు అడుగుతుంటారు.
ఇందుకు నాలుగు అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అవి 1. కండరాల బలహీనత; 2. ఊబకాయం; 3. శారీరక శ్రమ; 4. సైనోవియల్ ఫ్లూయిడ్ వల్ల కార్టిలేజ్ బలోపేతం అయ్యే ప్రక్రియలో అవరోధం ఏర్పడటం.
ఈ నాలుగు అంశాల్లోనూ ప్రధానమైనది శారీరక శ్రమ.
మిగతా అన్ని అంశాలతో దీనికి సంబంధం ఉంది. ఆ రోజుల్లో నడక, శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేది. దాంతో కండరాలు త్వరగా బలహీనపడేవి కావు.
అలాగే ఆ శ్రమ కారణంగానే ఊబకాయం వచ్చేది కాదు. ఇక మన కీళ్లలో కందెన (ల్యూబ్రికెంట్)లా పనిచేసే సైనోవియల్ ఫ్లుయిడ్ అనే గ్రీజులాంటి పదార్థం మన్నికతో ఎక్కువ రోజులు ఉండటానికీ దోహదపడేది శారీరక శ్రమే.
ఇటీవల ప్రజల్లో శారీరక శ్రమ తగ్గడంతో మిగతా మూడు అంశాలూ బలహీనం కావడం వల్లనే ఇటీవలి తరాల్లో కీళ్లనొప్పులు త్వరగా వస్తున్నాయి.
ఎంతగా నడిస్తే కీళ్లు అంతగా అరుగుతాయా?
నడక వల్ల కీళ్లపై భారం పడి త్వరగా అరిగిపోతాయన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఎముకకు నేరుగా పోషకాలు అందవు. మన వ్యాయామం, నడక వల్లనే ఎముకకు పోషకాలు అందుతాయి.
అలాగే సైనోవియల్ ఫ్లుయిడ్ ఆరోగ్యానికీ నడక అవసరం. అందువల్ల ఎంత నడిస్తే కీళ్లకు అంత ప్రయోజనం. కానీ ఈ నడక ఎలా పడితే అలా ఉండకూడదు.
ఏవి పడితే ఆ చెప్పులు తొడుక్కొని, ఇష్టం వచ్చిన ఉపరితలం మీద నడిస్తే ఆ నడక ప్రయోజనం ఇవ్వదు.
మెత్తటి అడుగుభాగం (సోల్) ఉన్న షూతో మట్టినేల లేదా గడ్డితో మెత్తగా ఉన్న నేలమీద గానీ ఆ నడక వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది.
ఇక మోకాలిపైన బరువు పడేందుకు దోహదపడే మరో అంశం ఇండియన్ స్టైల్ టాయిలెట్ సీట్.
ఎత్తుపల్లాలున్న దారుల్లో నడిచినప్పుడు, ఇండియన్ స్టైల్ టాయిలెట్లలో కూర్చున్నప్పుడు కీళ్లమీద మామూలు సమయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ భారం పడుతుంది.
అలాగే మోకాళ్లు ముడుచుక్కూర్చోవడం(స్క్వాటింగ్) కూడా మోకాలి నొప్పులకు కారణమవుతుంది. కీళ్లనొప్పులు మొదలైనప్పుడు మినహాయించి, మామూలు ఆరోగ్యంతో ఉన్నవారు ఎంత నడిస్తే అంత మేలు.
అలాగే ఇండియన్ టాయెలెట్లలో గొంతుక్కూర్చోకుండా ఉండటమూ కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మున్ముందు వచ్చే కీళ్లనొప్పులను నివారిస్తుంది.
కాల్షియమ్ తగ్గడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయా?
కాల్షియమ్ లోపం వల్ల ఎముక బలహీనం కావచ్చుగానీ… కీళ్లతో కాల్షియమ్‌కు నేరుగా సంబంధం ఉండదు. కీళ్లపై కాల్షియమ్ ప్రత్యక్ష ప్రభావమూ ఉండదు.
ఆహారానికి… కీళ్లనొప్పులకూ సంబంధం ఉందా?
కొంతమంది ఆహారానికీ, కీళ్లకూ సంబంధం ఉందేమోనని కూడా సందేహం వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యక్షంగా ఆహారానికీ, కీళ్లకూ సంబంధం ఉండదు.
అయితే అతిగా ఆహారం తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల ఊబకాయం వచ్చి… ఒంటి బరువు కీళ్లపై పడి కీళ్ల అరుగుదల వేగవంతం అవుతుంది.
ఇక కొన్ని రకాల ఆహారాలు కొంతమందికి సరిపడవు. ఒంటికి సరిపడని ఆహారం కారణంగా అలర్జీలు వచ్చి, ఆ అలర్జీ కీళ్లనొప్పులు, వాపు రూపంలో వ్యక్తం కావచ్చు.
ఎవరెవరిలో ఏయే ఆహారాల పట్ల అలర్జీ ఉంటుందో, ఆ అలర్జీ ఏ రూపంలో వ్యక్తమవుతుందన్నది ఆయా వ్యక్తుల దేహ స్వభావాన్ని బట్టి ఉంటుంది.
నిజానికి కీళ్లనొప్పి అన్నది ఎముక బలహీనం కావడం కంటే, ఎముక చివరన ఉండే కార్టిలేజ్ అనే భాగం అరగడం వల్ల, అందులోని గ్లూకోజమైన్ అనే జీవరసాయనం తగ్గడం వల్ల వస్తుంది.
ఈ కార్టిలేజ్‌నే వ్యావహారిక భాషలో కొందరు గుజ్జుగా వ్యవహరిస్తుంటారు. ఆ గుజ్జులోని నీటి పరిమాణం తగ్గడం వల్ల కూడా కీళ్లనొప్పులు వస్తుంటాయి. అంతేగానీ ఆహారానికీ, క్యాల్షియమ్‌కూ… కీళ్లనొప్పులకూ నేరుగా సంబంధం లేదు.
ఇంత అకస్మాత్తుగా బయటపడ్డాయేమిటి?
‘నిన్నమొన్నటివరకూ బాగానే నడుస్తున్నాను. ఠక్కున కీళ్లనొప్పులు బయటపడ్డాయేమిటి?… నిన్న లేని నొప్పి ఇంత అకస్మాత్తుగా ఎందుకొచ్చింది?’ అని కీళ్లనొప్పులతో బాధపడేవారిలో చాలామంది అడుగుతుంటారు.
వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరగడం అన్నది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఎవరికీ దీనినుంచి మినహాయింపు ఉండదు.
అయితే కీళ్ల అరుగుదల వల్ల కార్టిలేజ్ పూర్తిగా అరిగి, ఎముకకూ, ఎముకకూ ఒరిపిడి జరిగి వచ్చే నొప్పి రెండు రకాలుగా బయటపడుతుంది. కొంతమందిలో అది క్రమంగా పెరుగుతూ పోవచ్చు.
మరికొంతమందిలో అకస్మాత్తుగా బయటపడవచ్చు. కాబట్టి అరుగుదల అనేది అందరిలోనూ జరుగుతుంది. నొప్పి వ్యక్తమయ్యే తీరు మాత్రం రెండు రకాలుగా ఉంటుంది.
పెద్దవయసు వారిలోఎమ్మార్ స్కాన్ అవసరం లేదుకాస్తంత వయసు పైబడ్డాక కీళ్లనొప్పులతో డాక్టర్ దగ్గరికి వెళ్లారనుకోండి. పెద్ద వయసు వారిలో కీళ్లు అరిగి నొప్పులు వస్తున్నాయా అని నిర్ధారణగా తెలుసుకునేందుకు ఎమ్మార్ స్కాన్ తీయించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే పెద్దవయసు వారిలో అరుగుదల అనేది ఎలాగూ జరిగి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా యుక్త వయస్కుల్లోనూ, చాలా చిన్నవయసు వారిలోనూ కీళ్లనొప్పులు కనిపించాయనుకోండి.
అలాంటివారిలో సమస్య తెలుసుకునేందుకు ఎమ్మార్ స్కాన్ తీయించాలి.
దీనికి ఓ కారణం ఉంది. మన కీళ్ల భాగంలో నొప్పి రావడానికి మూడు ప్రధానమైన అంశాలు. మొదటిది కార్టిలేజ్, రెండోది మన కీళ్ల మధ్యన షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేసే మెనిస్కస్ అనే భాగం. మూడోవి లిగమెంట్లు.
ఈ మూడింటిలో ఏవైనా ఆటల్లో భాగంగా కార్టిలేజ్‌లోని కొంతభాగం దెబ్బతిన్నదా, లేక షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేసే మెనిస్కై (మెనిస్కస్‌కు బహువచనం) అనే భాగాలు దెబ్బతిన్నాయా,
లేక లిగమెంట్లు గాయపడటం, తెగడం జరిగిందా అనేది తెలుసుకోడానికి యువకులు, చిన్నవయసులో ఉన్నవారికే ఎమ్మార్ స్కాన్ తీయించాల్సి ఉంటుంది.
అందుబాటులో మందులు
కీళ్లనొప్పుల తీవ్రతను 4 దశల్లో చెప్పవచ్చు. ఇందులో మొదటి రెండు దశల్లో నొప్పులను మందులతోనే తగ్గించవచ్చు. మూడో దశలో చాలా వరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు.
అయితే నాలుగోదశలో ఉంటే మాత్రం అది శస్త్రచికిత్సతో మాత్రమే తగ్గుతుంది. ఇలా మొదటి రెండు దశల్లోని కీళ్లనొప్పులకు గతంలో వాడే నొప్పి నివారణ మందులతో పొట్టలో అల్సర్స్ రావడం, కడుపులో రక్తస్రావం కావడం వంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వచ్చేవి. కానీ ఇటీవల కాక్స్–2 ఇన్హిబిటర్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి.
ఇవి లేజర్ గన్స్‌లా పనిచేసి, కేవలం దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. అంతేతప్ప ఆరోగ్యకరమైన కణాలను ఎంతమాత్రమూ ముట్టుకోవు.
అలాగే గ్లూకోజమైన్ వంటి కాండ్రోప్రొటెక్టివ్ మందులు కూడా నొప్పిని తగ్గిస్తాయి. అయితే అవి కీలులో తగ్గిన గుజ్జును మళ్లీ పుట్టించవు. కాకపోతే గుజ్జు తరిగిపోయే ఒరవడిని మాత్రమే తగ్గిస్తాయి.
ఆ ప్రకటనలూ, ప్రచారాలూ నమ్మకండి…
ఇటీవల చాలామంది స్టెమ్‌సెల్స్‌తోనూ, ప్రోటీన్ రిచ్ ప్లాస్మా థెరపీతోనూ అరిగిపోయిన కార్టిలేజ్‌ను మళ్లీ పెంచగలమని ప్రకటనలు గుప్పిస్తూ, అమాయకులైన ప్రజలను ఆకర్షిస్తున్నారు.
సాధారణంగా ఆపరేషన్ అంటే భయపడేవారే ఇలాంటి ప్రకటనలకు తేలిగ్గా ఆకర్షితులవుతుంటారు.
నిజానికి నాలుగో దశ దాకా అరిగిన కార్టిలేజ్‌ను (గుజ్జును) మళ్లీ పుట్టించడం, లేదా మళ్లీ పెరిగేలా చేయడం వైద్యప్రక్రియలో లేనేలేదు. వైద్యపరంగా అలాంటి చికిత్సలకు ఎలాంటి హేతుబద్ధతా లేదు.
చాలామంది తమ విలువైన డబ్బును, సమయాన్ని వృథా చేసుకొని, మోకాలి కీలుకు శాశ్వతంగా నష్టం చేకూరాకే మళ్లీ అసలైన వైద్యుల దగ్గరికి వస్తుంటారు.
అలాగే కొన్నిచోట్ల పల్లెల్లో, చాలా వెనకబడిన గ్రామీణ ప్రాంతాల్లో కాల్చిన జీడి పెట్టడం, వాచిన చోట విపరీతంగా మసాజ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఫలితంగా మోకాలి లోపలి కీలకమైన భాగాలు దెబ్బతిని శాశ్వత వైకల్యం సంభవించవచ్చు. కాబట్టి అలా ఎవరైనా చెప్పినా నమ్మరాదు.
శస్త్రచికిత్సే శరణ్యమా?
కాబట్టి ముందే డాక్టర్‌ను సంప్రదించి శస్త్రచికిత్స వరకు వెళ్లకుండా కాపాడుకునే జీవనశైలి జాగ్రత్తలు పాటించాలి.
వ్యాయామమే నైవేద్యం
మన పక్షాన మన భారం వహించేవాడినే మనం దేవుడు అంటాం కదా. అలాగే మన మోకాలి గర్భగుడిలో ఉండే కీలుదైవం కూడా మన భారాన్ని వహిస్తాడనుకోవచ్చు.
మరి ఆ దైవాన్ని ప్రార్థించి, సమర్పించదగిన నైవేద్యం ఏమిటి? వ్యాయామమే మనం మన మోకాలి గర్భగుడిలో వసిస్తూ, మన భారాన్ని తీసుకునే దేవుడికి సమర్పించే నైవేద్యం.
ఒక ప్రార్థనలా మనం ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు నడకారాధన నిర్వర్తించి సమర్పించే ఆ పూజా నైవేద్యంతో సంతృప్తి పడే కీలుదేవత మనను ఇతరులపై మన భారం పడకుండా చూస్తాడు.
మన కాళ్లపై మనం నిలబడేలా చేస్తాడు. అయితే కొందరిలో అప్పటికే మోకాళ్ల నొప్పులు వచ్చి నడవడం సాధ్యపడకపోవచ్చు.
అలాంటి వారు ఒంటిపై ఎలాంటి బరువు పడని ఈత వంటి వ్యాయామాలు చేయవచ్చు. కొందరు మెట్లు ఎక్కడం కూడా మంచి వ్యాయామమే కదా అంటుంటారు.
అది గుండెకూ, ఊపిరితిత్తులకూ మంచిదే కానీ… మోకాలికి కాదు. ఎందుకంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాలిపైనా, అందులోని షాక్ అబ్జార్బర్స్‌పైనా చాలా భారం పడుతుంది.
కాబట్టి మోకాలితోపాటు, గుండెకూ, ఊపిరితిత్తులకూ అన్నింటికీ ఆరోగ్యాన్నిచ్చే వ్యాయామాలు చేయడమే మంచిది కదా!
గర్భగుడి అంతటి పవిత్రమైనది మోకాలి కీలు
మోకాలి కీలు గర్భగుడి అంతటి పవిత్రమైనది. గర్భగుడిలో దేవుడు మాత్రమే ఉంటాడు. ప్రధాన పూజారి మినహాయించి ఎవరికి పడితే వారికి గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు.
అలాగే మోకాలి కీలు (ఆ మాటకొస్తే అన్ని రకాల కీళ్లు కూడా) దగ్గరికి కూడా ఏ మందులు పడితే ఆ మందులు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించకూడదు.
దురదృష్టవశాత్తూ చాలాచోట్ల తెలిసీ తెలియని గ్రామీణ వైద్యులు (ఆర్‌ఎంపీలు, క్వాక్స్) మోకాలిలో నొప్పి వంటివి వచ్చినప్పుడు నీరు తీయడం, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వంటి అనుచితమైన పనులు చేస్తుంటారు.
నిజానికి మోకాలు చెప్పుకోదగ్గంత పరిమాణంలో వాస్తే తప్ప… మోకాలిలోంచి నీరు తీయడం వంటి చర్యలకు పాల్పడకూడదు.
అదీ ఒకటి రెండు సార్లు మాత్రమే. అలాగే కొంతమంది హైలూరానిక్ యాసిడ్ వంటి కందెనను ఎక్కిస్తామంటారు. కానీ దానితోనూ పెద్దగా ప్రయోజనం ఉండదు.
కాబట్టి అలా కందెనను ఎక్కిస్తామనే వైద్యాన్నీ నమ్మడం సరికాదు. వాస్తవానికి… తీవ్రంగా అవసరం ఉంటేనే తప్ప అనుభవజ్ఞులైన వైద్యులు నీరు తీయడం అనే చర్యకు ఉపక్రమించరు.
హైలూరానిక్ యాసిడ్ వంటి ద్రవాలను ఎక్కించే నిర్ణయాన్ని తీసుకోరు. అచ్చం… గర్భగుడిలోకి ప్రవేశించే ప్రధాన పూజారులను మినహాయించి ఎవరినీ అనుమతించనట్లే… మనం మోకాలి విషయంలోనూ దాన్ని అంతే పవిత్రంగా ఉంచాలన్నమాట.
అయితే ఇలాంటి గుజ్జు ఎక్కించడాలు, స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేయడాలు అనేవి 80 ఏళ్లు దాటిన వారిలోనూ, సర్జరీని తట్టుకో లేనివారిలోనూ డాక్టర్లు ఒక ఉపశమన వైద్యంలా చేస్తుంటారు. వారిని మినహాయించి, ఇలాంటి వైద్యాలు అంతకంటే చిన్నవయసు వారికి తగవు.
మహిళల్లో 4 రెట్లు ఎక్కువ
సాధారణంగా కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు పురుషులతో పోలిస్తే మహిళల్లో నాలుగు రెట్లు ఎక్కువ.
దీనికి నిర్దిష్టంగా కారణాలు తెలియవు. అయితే మహిళల్లో బరువు పెరగడం, స్థూలకాయం, హార్మోన్ల తేడాలు, వ్యాయామం అంతగా లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణాలని చెప్పవచ్చు.
కీళ్లనొప్పుల్లో ముఖ్యమైనది అవాస్క్యులార్ నెక్రోసిస్…
భారతదేశంలో చాలామందికి ఒక వయసు దాటాక తుంటిఎముక నొప్పి సాధారణంగా కనిపిస్తుంటుంది.
మన తొడ ఎముకపై భాగం ఒక గుండ్రటి బంతిలా ఉండి, అది తుంటి ఎముకలోని గిన్నె వంటి భాగంలో కదులుతూ ఉంటుందన్నది తెలిసిందే.
కొంతమందిలో ఈ బంతివంటి భాగానికి రక్తసరఫరా అందదు. దాంతో ‘అవాస్క్యులార్ నెక్రోసిస్’ (ఏవీఎన్) అనే కండిషన్ ఏర్పడి తీవ్రమైన తుంటి నొప్పి వస్తుంది.
మిగతా ఎముకలూ, కీళ్ల విషయంలోనూ ఇది జరగవచ్చు. కానీ ప్రధానంగా తుంటి ఎముక దగ్గర నొప్పి రావడమే మన దేశంలో చాలా ఎక్కువ.
దీనికి కారణాలేమిటి అన్న విషయం నిర్దిష్టంగా తెలియదు. అయితే ఆల్కహాల్, స్టెరాయిడ్స్ కూడా ఇందుకు కొంతవరకు కారణం కావచ్చని తెలుస్తోంది.
కాబట్టి ఎముకలు బలంగా, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్, స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి.
డాక్టర్ గురవారెడ్డి
సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్Tags:
Joints, Muscles, Arthritis