Description
కాలం దాచిన కన్నీరు
-గొల్లపూడి మారుతిరావు
గొల్లపూడి మారుతీరావు పరిచయం అక్కర్లేని ప్రజ్ఞావంతుడు. రచయిత, నటుడు, కథకుడు, నాటక రచయిత, నవలాకారుడు, రేడియోప్రయోక్త, సాహితీవేత్త… ఇలా బహుముఖీనం ఆయన ప్రతిభ. సినిమాలకు కూడా మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ నెట్ పేపర్లలో కాలమిస్టుగా పనిచేస్తున్నారు. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాత కూడా…
మారుతీరావు ఎప్రిల్ 14, 1939న అప్పటి మద్రాసు ప్రావిన్సీలో ఉన్న విజయనగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఎస్సీ ఆనర్సు పూర్తిచేశారు. ఆ తర్వాత పలు పత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికకు ఉప సంచాలకునిగా, 1960లో చిత్తూరు ఎడిషన్ కు సంపాదక మండిలిలో ఒకడిగా బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాదు, విజయవాడలలో ఆకాశవాణికి ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా, ఆ తర్వాత సంబల్ పూర్, చెన్నై, కడపలలో రేడియో కార్యనిర్వహన అధికారిగా పనిచేశారు. 1981లో కడప కేంద్రం నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ పొందారు.
1961 నవంబరు 11న శివకామసుందరిని వివాహం చేసుకున్నాడు. చిన్నతనం నుంచి ఎక్కువగా పుస్తకాలు చదవడం అలవాటున్న మారుతీరావు 14ఏళ్లకే రచనలు చేయడం ప్రారంభించాడు. ప్రారంభ రోజుల్లో కవిత్వం ఎక్కువగా రాశాడు. అవి ‘మారుతీయం’ పేరుతో ఆ కవిత్వం పుస్తకంగా కూడా వచ్చింది. వీరి మొదటి కథ ‘ఆశాజీవి’ ప్రొద్దుటూరులోని స్థానిక పత్రిక ‘రేనాడు’లో ప్రచురింపబడింది. కథా రచన నుండి నాటకాలపై మనసు మళ్లడంతో నాటకాలు రాయడం, ప్రదర్శించడం మొదలు పెట్టాడు గొల్లపూడి. ‘ఆడది’, ‘కుక్కపిల్ల దొరికింది’, ‘రిహార్సల్’, ‘మహానుభావులు’… లాంటి నాటకాలకు మొదట దర్శకత్వం వహించాడు. వాటిలో ప్రధాన పాత్రలు పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. వీరు రాసిన ‘అనంతం’ నాటికకు ఉత్తమ రేడియో నాటకం అవార్డు వచ్చింది. భారత దేశంలో చైనా దురాక్రమణ కాలంలో, ఆ ఇతివృత్తంతో మొదటి నాటకాన్ని ‘వందేమాతరం’ పేర వీరే రాశారు. ఆ నాటకాన్ని ప్రదర్శించి ప్రధానమంత్రి రక్షణనిధికి 50,000రూ.ఇచ్చాడు. 1975 ప్రాంతంలో వీరి ‘కళ్లు’ నాటిక విజయవంతంగా ప్రదర్శింపబడింది. ‘రాగరాగిణి’ నాటిక అప్పటి రాష్ట్రపతి డా. రాధాకృష్ణగారి సమక్షంలో ప్రదర్శింపబడింది. హిందీలోకీ అనువాదం అయింది. ‘కళ్లు’ నాటిక విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశంగా కూడా కొంతకాలం ఉంది.
మారుతీరావుకు చిన్ననాడే సాహితీ ఉద్దండులతో పరిచయాలు ఉండేవి. చాసో, శ్రీపాద, శ్రీశ్రీ, పురిపండ అప్పలస్వామి, అబ్బూరి రామకృష్ణారావు, కృష్ణశాస్త్రి, సి.నారాయణరెడ్డి వీరికి సన్నిహితులనే చెప్పాలి. టాగూర్ రచనలను, శరత్ రచనలను, చలం రచనలను విపరీతంగా చదివారు. టాగూర్ కథలు, గీతాంజలిని తెలుగులోకి అనువాదం చేశాడు. కొన్ని ప్రముఖ ఆంగ్ల రచనలను అనువాదం చేసి తెలుగు వారికి అందించాడు.
గొల్లపూడి మారుతీరావు సుమారు 230 సినిమాలలో కమెడియన్, విలన్, ప్రత్యేక పాత్రలలో నటించాడు. కథా రచయిత, స్క్రీన్ ప్లే, మాటల రచయిత, నటుడిగా వీరికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పలు సార్లు నంది బహుమతులు కూడా వీరికి వచ్చాయి. హెచ్ఎమ్ టీవీలో ‘వందేళ్ల కథకు వందనాలు’ పేరుతో వచ్చే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రసిద్ధమైన తెలుగు కథలను పరిచయం చేశాడు. ‘కౌముది’ అనే నెట్ పత్రికలో కాలమ్ రాస్తున్నారు.
‘చీకట్లో చీలికలు’, ‘సాయంకాలమైంది’,
‘అమృతంగమయి’ వంటి నవలలు రాశారు. ‘టాంజానియా తీర్థయాత్ర’ అనే యాత్రా ట్రావెల్ ను కూడా రాశారు. ‘అమ్మకడుపు చల్లగా’ పేరుతో తన ఆత్మకథను అందించాడు.
కథా రచయితగా కూడా గొల్లపూడి మారుతీ రావుకు మంచి పేరుంది. అసలు మొదట మారుతీరావు కథారచయితే. తనకు తెలిసిన, చదివిన, విన్న అంశాల నుంచే కథలను అల్లేవాడు. దినపత్రికలో వార్త చదివి ‘మృత్యువు ఆత్మహత్య’, తన కళ్లెదుటే జరిగిన సంఘటన చూసి ‘కీర్తిశేషుడు’, కూరగాయలు అమ్మే స్త్రీ గురించి ‘కాలం కరిచిన కథ’… … ఇలా రాసేవాడు. రచనలకు పేర్లు పెట్టడంలో కూడా మారుతీరావుది ప్రత్యేకతే. ‘గాలిలో ఓ క్షణం’, ‘పిడికెడు ఆకాశం’, ‘మళ్లీరైలు తప్పిపోయింది’, ‘అహంకారపు అంతిమ క్షణాలు’… లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కథల్లో, నవలల్లో పాత్రలను తీర్చిదిద్దడంలో, మాటల్తో వాటికి జీవం పోయడంలో మారుతీరావు సిద్ధహస్తుడు. అందుకే వీరి కథలు మనసును తట్టిలేపుతాయి, ఆలోచింపచేస్తాయి, సమాజంలో మనిషికి కర్తవ్యాన్ని బోధిస్తాయి. ‘రోమన్ హాలిడే’, ‘నిదురపోయే సెలయేరు’, ‘జుజుమురా’ అనేవి వీరి కథా సంపుటాలు. ఇవన్నీ 1999లో వచ్చిన ‘గొల్లపూడి మారుతీరావు’ సమగ్ర సాహిత్యంలో మనకు లభ్యమవుతున్నాయి.
‘పెళ్లిపుస్తకం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ వీరి చిన్నకొడుకు చనిపోతే అతని పేరుతోనే స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశాడు. మారుతీరావుకు ఎన్నో అవార్డులు పురస్కారాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, పులికంటి కృష్ణారెడ్డి పురస్కారం, గురజాడ అప్పారావు మెమోరిల్ అవార్డు వచ్చాయి. శ్రీపాద, వంశీ తెలుగు అకాడమీ అవార్డులు వీరి ‘స్వప్న’ నాటికకు వచ్చాయి. వంగూరి ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన రెండో ప్రపంచ తెలుగు మహాసభలలో జీవిత సాఫల్య పురస్కారం వీరిని వరించింది. వీరి నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం కూడా వచ్చింది.
Tags:
Gollapudi Maruthirao Books, Gollapudi Books, Telugu Books