Ashtavakra Gita Telugu – Krovi Pardha Saradhi

– Krovi Pardha Saradhi

అష్టావక్రగీత

450.00

Share Now

Description

భగవద్గీత గురించి తెలియని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. కృష్ణభగవానుడు స్వయంగా అర్జునుడికి బోధించిన ఉపదేశం గీత. దీంతోపాటు అష్టావక్ర గీత కూడా వేదాంతపరంగా చాలా కీలకమైంది. అయితే, దీని గురించి అతి తక్కువ మందికి తెలుసు. ఒకసారి రామకృష్ణ పరమహంస తన శిష్యుడైన స్వామి వివేకానందుడికి అష్టావక్ర గీతను అందజేసి, అందులోని కొన్ని శ్లోకాలను బెంగాలీలోకి తర్జుమా చేయమన్నారు. దీనివల్ల అద్వైత సిద్ధాంతం గురించి నరేంద్రుడికి తెలుస్తుందని రామకృష్ణుడి భావన. ఈ విషయాన్ని 1950లో స్వామి నిత్యస్వరూపానంద రాసిన రామకృష్ణ పరమహంస చరిత్రలో ప్రస్తావించారు.

ఇక, అష్టావక్ర గీతను ఎవరు రాశారు అనే విషయానికి వస్తే ముందుగా ఆయన గురించి తెలుసుకోవాలి. అష్టావక్రుడు గురించి మహాభారతంలోని అరణ్యపర్వంలో పేర్కొన్నారు. ఆయన ఒక రుషి. అష్ట అంటే ఎనిమిది.. వక్ర అంటే వంకర అని అర్థం. శరీరంలో ఎనిమిది వంకరలు ఉన్నవాడు కాబట్టి ఆయనకు అష్టావక్రుడు అనే పేరు వచ్చింది.

ఉద్దాలకుడనే ఋషి వేదవేదాంగాలను తన శిష్యులచే అభ్యాసం చేయించేవాడు. వారి వేదఘోషతో అరణ్యమంతా పులకించిపోయేది. అయితే, అయనకు కహోదుడనే శిష్యుడు అంటే ప్రత్యేక అభిమానం. కాలక్రమంలో తన కుమార్తె సుజాతను కహోదునకు ఇచ్చి వివాహం చేశాడు ఉద్దాలకుడు. సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు ఒక రోజు కహోదకుడు వేదాలను మననం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ఎనిమిదిసార్లు తప్పుగా ఉచ్చరించారు. అయితే, ఈ వేదాలను వింటోన్న గర్భంలో ఉన్న శిశువు.. తన తండ్రికి ‘మీరు తప్పుగా ఉచ్ఛరిస్తున్నారు’ అని తెలిపాడు.

గర్భంలోని శిశువు తన లోపాన్ని ఎత్తిచూపడంతో ఆగ్రహించిన కహోదకుడి ‘నేను ఎనిమిది చోట్ల తప్పు చదివానన్నావు కాబట్టి నువ్వు అష్ట వంకర్లతో జన్మిస్తావు’ అని శపించాడు. అలా తండ్రి శాపం కారణంగా అష్టావక్రుడిగా జన్మించాడు. ఒకసారి విదీశ రాజ్యంలో జరిగిన పండిత సభకు వెళ్లిన కహోదకుడు అక్కడ జరిగిన ఒక సంవాదంలో వందినుడు అనే పండితుడి చేతిలో ఓడిపోయాడు. దీంతో రాజు ఆయనను చెరశాలలో బంధించాడు. అనంతరం 12 ఏళ్ల వయసులో అష్టావక్రుడు తన తండ్రిని విడిపించడానికి విదీశకు వెళ్లి అక్కడి పండితులను ఓడించాడు. కహోడకుడ్ని బంధ విముక్తున్ని చేసి, ఆ తర్వాత సామంగ నదిలో స్నానం చేసి తన వైకల్యాన్ని పోగొట్టుకున్నాడు.

అనంతరం దేశాటన ప్రారంభించి, మళ్లీ విదీశ చేరుకుని రాజు జనకుడి చేత అనేక సత్కారాలు పొందాడు. ఈ సందర్భంలో అష్టావక్రుడు చేసిన బోధలనే అష్టావక్ర గీత అంటారు. దీనిలో మొత్తం 20 అధ్యాయాలు ఉన్నాయి. అష్టావక్ర గీతలో అద్వైత సిద్ధాంత పోకడలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిని ఎప్పుడు సంకలనం చేశారనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం. కానీ, భగవద్గీత తర్వాతే దీనిని రచించినట్టు భావిస్తారు. సంస్కృతంలో ఉన్న గీతను అనేక భారతీయ భాషల్లోకి అనువాదం చేశారు. అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన అతి క్లిష్టమైన భావాలను అష్టావక్రగీత సున్నితంగా స్పృశిస్తుంది. సనాతన ధర్మంలో ఎనిమిది అంకెకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగాలను (కాళ్లు, చేతులు, మోకాళ్లు, ఛాతి, నుదురు) ఈ సంఖ్య సూచిస్తుంది. ఇవి సక్రమంగా ఉంటేనే భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయగలం.