Description
Vyasa Praneetham Book
వ్యాసప్రణీతం
Author : Appala Shyam Praneeth Sharma
మరో నీతిచంద్రిక
(వ్యాసప్రణీతం పుస్తక సమీక్ష)
మనిషిని మనీషిని చెయ్యటమే సనాతన వాజ్ఞ్మయం ప్రధాన లక్ష్యం. పురాణ, ఇతిహాస, కావ్య, ప్రబంధ తదితర సాహిత్యమంతా ఈ క్రమంలో ఏర్పడిందే.
వేటికవే మహోన్నతమైన సత్యాన్ని ఆవిష్కరిస్తాయి. వీటిని అందుకోవటం మనిషి కర్తవ్యం. అయితే, ప్రతి వ్యక్తికీ అంతటి సామర్థ్యం ఉండాలని ఆశించటం కూడా సమంజసం కాదు.
అందుకే ‘భాష్య’ / ‘వ్యాఖ్యాన’ సాహిత్యం ఏర్పడింది. మూలరచయిత హృదయాన్ని అర్థం చేసుకుని, రచన పరమార్థాన్ని జాతికి అందించే సర్వోన్నతమైన బాధ్యతను మల్లినాథ సూరి వంటి వ్యాఖ్యాన వాచస్పతులు తమ భుజాలకెత్తుకున్నారు.
వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ‘వ్యాసప్రణీతం’ అనే శీర్షికతో సనాతన సాహిత్య సముద్రగర్భంలోని ఆణిముత్యాల్ని ఒక్కొక్కటిగా సరళ సుందరంగా అందించే ప్రయత్నం చేశారు రచయిత.
హైందవజాతికి… ప్రత్యేకించి తెలుగువారి ముగింటకు తనంతట తానుగా అందివచ్చిన సాహిత్యామృత కలశం ఇది. అనేక వ్యాసాల సమాహారం ఈ గ్రంథం.
ప్రతి వ్యాసంలోనూ ఓ స్పష్టత, నిర్దుష్టత ఉన్నాయి. ఎంచుకున్న అంశం, చెప్పదలచుకున్న భావం పట్ల రచయితకు పూర్తి అవగాహన, సాధికారత ఉంది.
దేవుని పూజిస్తే పాపాలు పోతాయి… స్వర్గం వచ్చేస్తుందన్న ధోరణి కాకుండా పాఠకుడి హృదయాన్ని మలినరహితం చేసి, అతడి దృష్టిని ఆధ్యాత్మికసాధనవైపు మరల్చాన్న తపన రచయితలో కనిపించింది.
అందుకే, గ్రంథంలోని ప్రతి వ్యాసమూ ఓ చైతన్యాన్ని పాఠకుడిలో కలిగిస్తుంది. వేదపండితులు, సంస్కృతాధ్యయనం చేసిన వ్యక్తి కావటం వల్ల రచయితలోని పరిశోధనా దృష్టి కూడా ప్రతి వ్యాసంలో కనిపిస్తుంది.
అవతారం అంటే ఏమిటి? యజ్ఞం అనే పదానికి అసలైన అర్థం ఏమిటి? ఇలా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశోధించి, భావార్థంతో సహా వివరించారు రచయిత.
నేటితరం పిల్లలకు సైతం అర్థమయ్యేలా సరళభాషలో రచించిన ఈ గ్రంథం ప్రతి తెలుగు పౌరుడూ చదివితీరాల్సిన అవసరం ఉంది.