Description
Sri Ram Charit Manas in Telugu | code 1352
శ్రీ రామచరిత మానస్ (తులసీ రామాయణం)
‘నానాభాంతి రామఅవతారా రామాయన శతకోటి అపారా
కల్పభేద హభరిచరిత సుహాయే – భాంతి అనుకమునీసన్హగాయే|
కరియ, న, సంసయ అసఉరజానీ –సునియ కథా సాదర రతిమానీ||’’
దర్శనమలు వేరైన, కల్పనలు వేరైనా తత్వమొక్కటే అని పై పంక్తుల ద్వారా గోస్వామి తులసీదాస్ స్పష్టం చేశారు. అదే భావనను వ్యక్తపరుస్తూ, మైథిలీ శరణ్ గుప్త తన ‘సాకేత్’లో
‘‘రామ తుమ్హారా చరిత్ర స్వయంహీ కావ్యహై
కోయి కవి బడ్ జాయ్ సహజ సంభావ్య హై’’,
నీ చరిత్ర కావ్యమైతే, దానిని రచించిన ప్రతీవాడు కవి కావడం సహజమని రామాయణ కావ్య విశిష్టతను వినయపూర్వకంగా తెలియచేశాడు.
రామకథ అనేక భాషల్లో అనేక రూపాలు సంతరించుకున్నట్టే, హిందీలోకూడా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆపాదించుకుంది. భక్త కవులనేకులు ఈ గాథను ఆశ్రయించి తరించారు. అందులో శ్రీ గోస్వామి తులసీదాసు ఒకరు. హిందీ ఉపభాషల్లో ఒకటైన ‘అవథి’లో ‘రామ చరిత మానస’ పేరుతో రామాయణాన్ని దాదాపు 400 ఏళ్ల కిందట రచించారు.
ఈయనే కాక, అనేక పూర్వ, ఆధునిక హిందీ కవులు రామాయణ గాథ ఇతివృత్తంగా రచనలు చేశారు. ఇందు చెప్పుకోదగ్గవి: క్రీ.శ. 1523లో మాధవదాస్ జగన్నాథకవి రచించిన ‘రఘునాథ లీల’, అగ్రదాసస్వామి వ్రజభాషలో రచించిన ‘కుండలియా రామాయణ్’, విష్ణుస్వామి ‘రామచంద్ర చరిత్ర’, సేనాపతి కవి ‘కవిత్త రత్నాకర్’(1589) , హృదయరాంభల్లా ప్రసిద్ధకృతి ‘హనుమన్నాటక్’ (1623), పాణచందచౌహాన్ ‘రామాయణ మహానాటకం’ (1610), మానదాసు వాల్మీకి రామాయణాన్ని అనుకరిస్తూ రాసిన ‘రామ చరిత్రం’, సిక్కుల తొమ్మిదో గురువు గోవిందసింహాజీ రచించిన ‘గోవింద రామాయణం’, సహజ రామకవి కృతి ‘రఘు వంశదీపకం’, మధుసూధన కవి రచించిన ‘రామశ్వమేథము’, రామానుజదాస శరణ కవి ధోహా చౌపాయి శైలిలో వ్రాసిన ‘బృహత్కావ్యము’, ‘శ్రీ రామచంద్ర విలాసము’, తెలుగు భట్ట బ్రాహ్మణుడు పద్మాకరుడు రచించిన ‘రామ రసాయనము’, విశ్వనాథ సింహకవి కృతి ‘ఆనంద రామాయణము’ తోపాటు సూరదాసు పదావళిలోని నవమస్కంధంలలో 158 పదాలలో గానం చేసిన ‘శ్రీ రామచరిత్ర’ను మొదలగునవి.
అయితే అన్ని రుగ్మతలను పోద్రోలే భవౌషధిగా, పారయణ గ్రంధంగా ఉత్తర భారతాన్ని తేజోదీప్తం చేసిన కావ్యం మాత్రం గోస్వామి తులసీదాస్ విరచిన ‘శ్రీ రామచరిత మానస్’.
ఆనాటి సామాజిక, రాజకీయ, దైవిక పరిస్థితులను చూసి తల్లడిల్లిన తులసీదాస్ జాతిని ఏకంచేయడానికి,
‘‘నానా పురాణ నిగమాగమ సమ్మతం, యద్
రామాయణే నిగదితం క్వచి దన్యతోపి
స్వాంత స్సుఖాయ తులసీ రఘునాథ గాథా
భాషానిబంధ మతిమంజుల మాతనోతి’’,
పురాణాలను, నిగమాగమాలను తరచి రామచరిత మానస్ కు రూపకల్పన చేశాడు. అలాగే శివకేశవాద్వైతా భావనను తన మానస చరితలో తులసీదాస్ ప్రస్ఫుటంగా ప్రకటించాడు. ‘‘శివద్రోహీ మమ దాస కహావై, సోనరసవనెహుమోహిన భావై’’ అంటూ, స్వయంగా శ్రీరాముని చేతనే శివద్రోహి నాదాసుడు కాజాలడని చెప్పించాడు.
ఆధ్యాత్మ రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తనలోని ఆజ్ఞానాంధకారాన్ని శమింపచేసుకోవడానికి దేశభాషలో మానసమనే పేర తులసీదాస్ రామాయణాన్ని రచించాడు. ఆధ్యాత్మ రామాయణాన్ని అనువదించకుండా, సంస్కృతంలోని హనుమన్నాటకం, ఆనంద రామాయణం, అనర్ఘ రామాయణం, ప్రసన్న రాఘవం, భుశుండి రామాయణం, శ్రీమద్భాగతం, స్కాందపురాణం, భగవద్గీత, భృగుసంహిత మొదలగు అనేక రచనలను విశ్లేషించి, అందు తనకు నచ్చిన, ఆసక్తి కల్గించిన అంశాలను స్వీకరించి స్వతంత్ర రచన చేశాడు.
‘‘రచిమహేస నిజమానసరాఖా – పాయిసుసమన ఉసివాసన ఖాఖా
తాతేరామ చరితమానసవర, ధరెవునామ, హియహేరి, హరషిహర’’.
మహేశ్వరుడు తాను రచించి తన మానసంలో నిక్షేపించుకున్న రామకథను ‘రామచరితమానస’గా కీర్తించి పార్వతికి ఆ వృత్తాంతాన్ని ఉపదేశించాడు. అందుచేతనే తాను కూడా తన గ్రంధానికి ‘రామచరిత మానస’మని నామకరణం చేసినట్టు తులసీదాస్ పై పద్యంలో వెల్లడించాడు.
తులసీదాస్ ‘మానస’ శబ్ధాన్ని మానస సరోవరంగా అన్వయించుకొని సప్తసోపానాలంకృతమైన శ్రీ రామకీర్తి సరోవరంగా చిత్రీకరించాడు. ఇందు తులసీదాస్ శివపార్వతి సంవాదం, భుళుండి గరుడ సంవాదం, యాజ్ఞవల్క్య భరద్వాజ సంవాదం, తులసీదాసూ ఆయన శిష్యుల సంవాదం, ఇలా చతుష్టయ సంవాదాల రూపంలో రాశాడు. ఈ నాలుగు సంవాదాలు మానస సరోవరానికి నాలుగు అద్భుత ఘట్టాలు. విమల, సంతోష, విజ్ఞాన వైరాగ్య, విశుద్ధ సంతోష, జ్ఞాన, అవిరలభక్తి సంపాదనలనేవి ఇందు సప్తసోపానాలు, సప్తకాండాలు.
తులసీదాస్ రామాయణం రాయడానికి ప్రధాన కారణం ఆకాలంలో దేశంలో లోపించిన సదాచారం శీలసంపదల పునఃప్రతిష్ట చేయడమే. అందుకే రామాయణంలోని పాత్రలలో ఈ శీల నిరూపణకు ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. అలాగే భక్తివైరాగ్యాలను, పరబ్రహతత్వాన్ని అనేకవిధాలుగా తులసీదాస్ తన రామచరితమానస్ లో నిక్షిప్తం చేశాడు.
‘‘సబ ఉపమాకవి రహే జుఠారీ,
కెహి పటతరౌ విదేహకుమారీ,
జను విరించి సబ నిజనిపునాయీ,
విరచి విశ్వక ప్రగట దెఖాయీ,
సందరతా కహ సుందరకరయీ,
ఛవిగృహ దీపసిఖాజనుబరయీ’’.
‘విశ్వం విష్ణుర్వషట్కారః’ అని విష్ణు సహస్రనామావళి చెపుతోంది. విశ్వం అంటే విష్ణువు. విష్ణ్వవతారాంగా రామరూపంలో నిలబడ్డ ఆ పరాత్వరుడికే మహాలక్ష్మి స్వరూపాణి సీతను చూపెట్టాడనే చక్కని అర్ధాంతరములతో, విశ్వం, దీపశిఖ అనే పదాల ద్వారా సీతారాముల పరబ్రహ్మ తత్వాన్ని అద్వితీయంగా విరచించాడు తులసీదాస్.
రచనా విశిష్టత: తులసీదాస్ తన రచనను దోహా చౌపాయీ పద్దతిలో చేశాడు. అంటే, రెండేసి దోహాల మధ్య నాలుగేసి చౌపాయీలుంటాయి. ఇవిగాక నాలుగు పంక్తుల ‘‘ఛంద’’మనే మరోక వృత్తం, రెండు పంక్తుల సోరఠ అనే లఘువృత్తం గూడా మధ్య, మధ్య ఉపయోగించాడు. ఇక ప్రతికాండకు ప్రారంభంలో, ప్రార్ధనాపరమైన సంస్కృత శ్లోకాలుంటాయి. నాలుగు చౌపాయీలు ఒక దోహా కలిసి ఒక దోహా కింద పరిగణిస్తే, అటువంటివి బాలకాండలో 361, అయోధ్య కాండలో 325, అరణ్యకాండలో 46, కిష్కింధాకాండలో 30, సుందరకాండలో 60, లంకాకాండ లేదా యుద్ధకాండలో 121, ఉత్తరకాండలో 130 ఉన్నాయి. ఈ కాండలకు వరుసగా విమల సంతోష సంపాదన సోపానం, విమల విజ్ఞాన వైరాగ్య సంపాదన సోపానం, విమల వైరాగ్య సంపాదనం, విశుద్ధ సంతోష సంపాదనం, జ్ఞాన సంపాదనం, విమల విజ్ఞాన సంపాదనం, అవిరల హరిభక్తి సంపాదన సోపానం అనే పేర్లు కాండాంత పుష్పికల్లో నిగూఢపర్చాడు. ఉదాహరణకు ఉత్తరకాండ పుష్పిక చూడండి –
‘‘ఇతి శ్రీరామచరితమానసే సకల కలికలుష
విధ్వంసనే అవిరలభక్తి సంపాదనోనామ
సప్తమసోపానః సమాప్తః’’
తులసీ రామాయణానికి ఓఢ్ర భాషలో నాలుగు, వంగభాషలో మూడు అనువాదాలున్నాయి. అట్లే గుజరాతీలో ఒక టీకా, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో కూడా అనువాదాలున్నాయి. రష్యా భాషలో కూడా దీని అనువాదం కలదు.
ఇతర హిందీ రామాయణాలు: తులసీదాసు రామచరితమానస్ కాక అనేక రామాయణాలు హిందీలో ఉన్నట్టు పైన చెప్పడం జరిగింది. ఇందు తులసీదాసు సమకాలీనుడైన కేశవదాసు రామచంద్రిక బాలకాండలో విశ్వామిత్రుని ఆగమనంతో ప్రారంభమవుతుంది. ఇందు 39 ప్రకాశాలు అంటే సర్గాలున్నాయి. ఇందు ఛందములను పదే, పదే మారుస్తూ, ఔచిత్య రహితంగా ఉపమాన, ఉత్ర్పేక్షలతో కేశవదాసు రచన సాగించాడు. రామచంద్రికను వ్రజభాషలో ప్రారంభిచినా మధ్య,మధ్యలో బుందేల్ ఖండీ భాషాపదాలను కవి విచ్చలవిడిగా ఉపయోగించాడు. విస్తృత సంస్కృత సమాసాలు, పదాలతో ఈ గ్రంధం పామరునికి కొరుకుడుపడటం కష్టం. అందుకే ఇది జనావళిలో అంతగా ప్రాచుర్యం పొందలేదని విమర్శకుల అభిప్రాయం.
ఆధునికయుగంలో మైథిలీశరణ్ గుప్తా రాసిన ‘సాకేత్’ ప్రముఖమైనది. సాహిత్యంలో ఉపేక్షితులయిన నాయికల గురించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగుర్ చేసిన రచన ‘కావ్యకీ ఉపేక్షితా’తో ప్రేరేపణ పొందిన గుప్తా, తన రామాయణ గాథను ఊర్మిళను కేంద్రబిందువుగా చేసుకుని రచించారు. కథా ప్రారంభం వివాహానంతరం అయోధ్యలో ఊర్మిళా, లక్ష్మణుల సంవాదంతో ప్రారంభమై శ్రీరాముని యువరాజ్యాభిషేకం, కైకేయీ వరప్రదానం, రామవనగమనం, పాదుకా పట్టాభిషేకం ఘట్టాలు చోటుచేసుకుంటాయి. కవి ఊర్మిళను ఏ సమయంలోను విడిచి పెట్టడు. లక్ష్మణుడు వనవాసానికి వెళ్లిన తరుణంలో శత్రుఘ్నుని ద్వారా శూర్పణఖోదంతం, ఖరదూషణ వధ మొదలైన ఘట్టాలను అయోధ్యలోనే చెప్పిస్తాడు. రావణవధాది తదనంతర యుద్ధ క్రమమంతా అయోధ్యలోనే ఊర్మిళ, భరతాదులకు వశిష్టముని తన యోగదృష్టి ద్వారా దూరదర్శినిలో దర్శింపచేస్తాడు. గుప్త తన కథనంలో ఊర్మిళ త్యాగం, తపస్సు ప్రధానంగా వర్ణించాడు. ఖఢీబోలీ హిందీ గుప్త సాకేత్ లో మనకు కన్పిస్తుంది.
ముక్తాయింపు: మన రామాయణ విశిష్టతను మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. సంస్కృత వాజ్మయ మహాసాగరాన్ని మథించిన ప్రాశ్చాత్య కవులు కూడా ఈ మహాకావ్య విశిష్టతను ప్రశంసించకుండా ఉండలేకపోయారు. సర్ మోనియర్ విలియమ్స్ మాటల్లో చెప్పాలంటే, ‘‘గ్రీకుల ఇతిహాసకావ్యములైన ‘ఇలియాడ్-ఒడిస్సే’లకును, హిందువుల రామాయణ, మహాభారతములకును పోలికలే లేవు. బ్రహ్మాండమైన హిమాలయములలో పుట్టి అనంతవాహినులతో పెల్లుబ్బి విస్తరించిన గంగాసింధూమహా స్రవంతులను, ధెసిలీ కొండవాగులతో పోల్చిన ఎంత హాస్యాస్పదముగా ఉండునో, రామాయణ, భారతాలను ఇలియాడ్ ఒడిస్సీలతో పోల్చుట అట్లే ఉండును. రామాయణము వంటి మరోజ్ఞకావ్యము ప్రపంచ సాహిత్యమున కానరాదు. ప్రాచీన ప్రమాణ గంథ్రములలో ఉండు పరిశుద్ధ, స్పష్ట, సరళైలి, గంభీర ప్రకృతిదృశ్యముల వర్ణన, మానవ హృదయములలోని పరస్పర ఘర్షణ, ఆవేదనమును తెలుపు సుకుమార భావ ప్రకటనము మొదలైన సుగుణములిందు పుష్కలముగా ఉన్నవి. ఈ కావ్యమొక ఆనందవనము వంటిది. శ్రీరాముని శీలము ఘనముగా చిత్రింపబడినది. అతడు మొదటినుండి చివరవరకు ఒకేవిధముగా స్వార్ధరహితుడుగా ఉన్నందున మానవమాత్రుడు కాడనిపించును. కాని ఆయన కేవలము ధీరుడు, ఉదారచిత్తుడు, సద్గుణుడు అయిన మానవమాత్రుడిగానే చిత్రింపబడినాడు.
ఆదర్శపారాయులగు నారీమణులలో సీత ఉత్తమురాలు-ఆమె గృహిణీ ధర్మజ్ఞులకు వేలుబంతి. ఇందు వర్ణింపబడిన నిర్వ్యాజపతిభకి, పవిత్రప్రణయము, భార్యాభర్తలకు శాశ్వతమైన ఈశ్వరోద్దిష్ట సంబంధమున్నట్టు భావించుట అను ఉదాత్త గంభీరాదర్శముల వంటివి ఏ ఇతర భాషా సాహిత్యములోనూ కానరావు. సంస్కృత సారస్వములోని మహానిక్షేపములలో రామాయణము ఒక్కటి అనుటలో సందేహంలేదు.’’
అన్నిదేశాలవారికి అన్ని కాలాలలోనూ సంసేవ్యమైన అమోఘమైన భవౌషధం శ్రీమద్రామాయణం:
పుణ్య పాపహరం, సదా శివకరం, విజ్ఞానభక్తి ప్రదం
మాయామోహమలాపహం, సువిమలం, ప్రేమాంబుపూరం, శుభం
శ్రీమద్రామచరిత్రమానస మిదం, భక్త్యావగాహంతి యే
తే సంసారపతంగ ఘోరకిరణ్యై, ర్ధహ్యంతినో మానవాః. – సౌమ్యశ్రీ రాళ్లభండి