Description
ఆలయవేదం AlayaVedam
(ఆలయ నిర్మాణ శాస్త్రీయ విజ్ఞానం)
‘‘నాన్న ఈరోజు సెలవు కదా! గుడికి తీసుకెళ్తావా’’
అడిగాడు పదేళ్ళ కొడుకు తన తండ్రి వెంకట్ ని.
కొడుకుకు కలిగిన ఆలోచనకు మనసులోనే మురిసిపోయాడు తండ్రి. వెంకట్ కి భక్తి ఎక్కువే! అయితే….. గుడికి పోయామా… దణ్ణంపెట్టుకుని వచ్చేసామా… అంతవరకే!
కొడుకుతోపాటు కూతురిని కూడా వెంటబెట్టకుని గుడికి బయలుదేరాడు వెంకట్.
అది ఒక ప్రాచీన ఆలయం. ఆగమాలలో వివరించబడ్డ వర్ణనలకు అది అచ్చమైన తార్కాణం. అపురూప శిలా సంపదకు నిలయం.
తరుచూ దర్శనం చేసుకునే ఆలయమే కావడంతో వడివడిగా అడుగులు వేస్తున్న తండ్రికి ఊహించని విధంగా ‘‘నాన్న గుడిముందర ఉన్నఇదేంటి?’’ అనే ప్రశ్నతో కొడుకు వెలెత్తి చూపించిన వైపు తలతిప్పాడు వెంకట్. అది బలిపీఠం. గుడికి వస్తాడన్నమాటే కానీ… అదేమిటో, అక్కడెందుకుందో తనకీ తెలియదు. అప్పటికేదో తనకు తోచినమాట చెప్పి ముందుకు సాగాడు.
తండ్రి దర్శనం చేసుకుంటుంటే కూతురు శైలజ చూపు మూలమూర్తి వెనుకున్న మకరతోరణంపై నిలిచింది. ఆ ఆకారామేమిటని అడిగింది. తెల్లమొహం వేసుకొని చూస్తున్న వెంకట్ పరిస్థితిని అర్థం చేసుకున్న ఆలయ అర్చకుడు కలగజేసుకొని మకరతోరణం గురించి ఆ పిల్లలిద్దరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు.
గుడినుంచి బయటకొచ్చి ప్రదక్షిణలు చేస్తున్న వెంకట్ మనసులో ఒకటే ఆలోచన. ఇన్ని సంవత్సరాలుగా గుడికి వస్తున్నా గుడిలో చాలా విషయాలు తనకు తెలియదు. తెలుసుకోవడానికి కూడా తాను ప్రయత్నం చేయలేదు. ఇకనైనా తెలుసుకోవాలి. పిల్లలకు తెలియజెప్పాలి.
తనలో ఈ ఆలోచనకు కారణమైన పిల్లలవైపు చూసి, మనసులోనే అభినందిస్తూ, వారిని వెంటపెట్టుకొని చిరునవ్వుతో ఇంటి దారి పట్టాడు వెంకట్.
ఇది ఒక వెంకట్ కథ మాత్రమే కాదు…! గుడికి వెళ్ళే ఎంతోమంది భక్తుల కథ. చాలా మందికి ఆలయాలలోని అపురూప విషయాలు తెలియవు. తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా, ఎలా? ఎవరు చెబుతారు? సమాధానం దొరకని ప్రశ్నలే! అటువంటి ప్రశ్నలెన్నింటికో సమాధానం ‘‘ఆలయవేదం’’ అనే గ్రంథం.
‘‘ఆలయంలోకి అడుగుపెట్టిన భక్తులకు అందులోని ధ్వజస్తంభం, బలిపీఠం, వాహనాలు మొదలైన వాటిపై ప్రాథమికమైన అవగాహన కలిగి ఉండాలి. వాటిని మరొకరికి పరిచయం చేసేలా ఉండాలి’’ అనే ఆశయంతో ఆలయాల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన అనేక ఆగమాలు, శిల్పశాస్త్రాలను అధ్యయనం చేసి రూపొందించిన గ్రంథమే ఈ ఆలయవేదం. ‘‘ఆలయవేదం’’ ఆలయంలోని అణువణువు పరిచయం చేసే అమృతభాండం. ఆలయ విజ్ఞాన దర్పణం.
సులభశైలిలో చదివించడమేగాక…. చదివినవారికి ఆలయం గురించి చాలా తెలుసుకున్నామన్న సంతృప్తితో గ్రంథాన్ని ముగించేలా చేయడంలో రచయిత శ్రీ కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య కృతకృత్యులయ్యారు. – రచయిత: కందుకూరి వేంకట సత్య బ్రహ్మాచార్య