Description
బీర్బల్ కు పరీక్ష
వేసవి మండిపోతోంది. కణకణలాడే అగ్ని గోళంలా తొందరగా ఉదయించే సూర్యుడు బారెడు పైకెగబ్రాకేలోగా నిప్పులు చెరగడం ప్రారంభిస్తున్నాడు. అక్కడక్కడ నీటి చెలమలు తప్ప నదులు ఇసుక మేటల్లా కనిపించ సాగాయి. బావులు ఎండి పోయూయి. ఎండ తీవ్రతకు తట్టుకోలేక పగటి పూట వీధుల్లో తిరగడానికే జనం భయపడసాగారు. ఒకనాటి వేకువ సమయంలో అక్బర్ చక్రవర్తి వాహ్యాళికి బయలుదేరాడు. ఆయన వెంట ఎప్పటిలాగే బీర్బల్‌తో సహా మరి కొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. కొంతసేపు నడిచాక, ‘‘ఇప్పుడే వేడి ఆరంభమవుతున్నది. బావులన్నీ ఎండిపోతున్నాయి,” అంటూండగా అక్బర్ దృష్టి రహదారి పక్కనే ఉన్న ఒక బావి మీద పడింది. ‘‘ఆ బావిలో నీళ్ళున్నాయేమో చూద్దాం రండి,” అంటూ వెళ్ళి ఆయన బావిలోకి తొంగి చూశాడు.
తక్కిన వారు కూడా ఆయన్ను అనుసరించి వెళ్ళారు. ‘‘బొట్టు నీళ్ళు లేవు,” అంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రవర్తి. ‘‘వర్షాలు వచ్చేంతవరకు ఈ పరిస్థితి తప్పదు ప్రభూ! బావిలోకి ఏదైనా వేసి అది నేలను తాకుతుందా అని చూడడానికి ఇది అనువైన కాలం. నీళ్ళున్నప్పుడు వేస్తే అలా చూడలేము,” అంటూ బీర్బల్ బాట పక్కనే ఉన్న చిన్నరాయిని తీసి బావిలోకి విసిరాడు.అది నేలను తాకిన శబ్దం ‘టప్’మని వినిపించింది.‘‘ఒకరాయికి తోడు మరొక రాయి కావాలి కదా,” అంటూ చక్రవర్తి తన వేలికి ఉన్న వజ్రం పొదిగిన బంగారు ఉంగరాన్ని తీసి బావిలో వేశాడు. దాన్ని చూసి బీర్బల్ నివ్వెరపోయి, ‘‘ఒకరాయికి తోడు మరొక రాయి కావలసిందే. కాని, మామూలు రాయికి విలువైన వజ్రం తోడు కాజాలదు కదా?” అన్నాడు.
చక్రవర్తికి తను చేసిన పొరబాటు తెలియ వచ్చింది. తొందరపడి ఆ పని చేసినట్టు గ్రహించాడు. సరే జరిగిందేదో జరిగిపోయింది. బావిలోకి దిగగల వారి చేత ఉంగరాన్ని వెలికి తీయిస్తే సరిపోతుంది, అని అనుకుంటూండగా ఆయనలో ఒక వింత ఆలోచన కలిగింది. ‘‘బీర్బల్, మనిషిని బావిలోకి దింపి ఉంగరాన్ని వెలుపలికి తీయించవచ్చు. అయితే…” అంటూ ఆగాడు చక్రవర్తి. ‘‘ఏమిటో సెలవివ్వండి, ప్రభూ!” అన్నారు బీర్బల్‌తో సహా అందరూ ముక్త కంఠంతో.
‘‘అయితే, బావిలోకి దిగకుండా పైనుంచే ఉంగరాన్ని ఎవరైనా వెలికి తీయగలరా?” అని అడిగాడు చక్రవర్తి. ‘‘అసాధ్యం!” అన్నాడు ఒక వృద్ధ ప్రముఖుడు. ‘‘అంటే, బావిలోకి దిగకుండా ఉంగరాన్ని వెలికి తీసే మార్గమే లేదంటారు. అంతే కదా?” అని అడిగాడు చక్రవర్తి. ‘‘అంతే ప్రభూ. అందులో ఏమాత్రం సందేహం లేదు,” అన్నాడు మరొక ప్రముఖుడు. ‘‘బీర్బల్, నీ అభిప్రాయమేమిటి?” అంటూ బీర్బల్ కేసి తిరిగాడు చక్రవర్తి.
‘‘ఆ విషయంగానే ఆలోచిస్తున్నాను, ప్రభూ,” అంటూ తలపాగా తీసి బుర్ర గోక్కో సాగాడు బీర్బల్. ‘‘బురగ్రోక్కున్నంత మాత్రాన పరిష్కార మార్గం తెలుస్తుందనుకుంటున్నాడు బీర్బల్,” అన్నాడు ఒక ప్రముఖుడు హేళనగా. ‘‘అవును. నాకు తరచూ అలా జరుగుతుంది. నీకు జరగదేమో!” అన్నాడు బీర్బల్. ‘‘నీకు మాత్రం ఎలా జరుగుతుంది?” అని అడిగాడు ప్రముఖుడు. ‘‘బుర్ర ఉందిగనక! నీకు లేదు. ఆలోచన రావడం లేదు, అందుకునేనేం చేయను?” అన్నాడు బీర్బల్. ఆ మాటకు చక్రవర్తితో సహా అందరూ గలగలా నవ్వారు. ‘‘ఆ.. చెప్పానా… బుర్ర గోక్కుంటే మంచి ఉపాయం తోస్తుందని. ఇప్పుడు ఉంగరాన్ని ఎలా వెలికి తీయూలో తెలిసిపోయింది,” అన్నాడు బీర్బల్ ఉత్సాహంతో.
|