Description
భారతీయ జ్యోతిషశాస్త్ర చరిత్రను వ్రాయడమంటే భారతీయ విజ్ఞానానికి మూలాలు వెతకడమే. ప్రకృతి నుండి, సూర్యచంద్రాదుల నుండి, ఆకాశం, నక్షత్ర మండలాల నుండి, గ్రహ వ్యవస్థల నుండి ప్రభావాలను అధ్యయనం చేసిన విధాన క్రమాన్ని తెలియజేయడమే. పరిసరాలలో వస్తున్న మార్పులకు మూలాలను అన్వేషించిన భారతీయ వైజ్ఞానికుల గొప్పదనాన్ని పరిశీలించడమే. ప్రకృతిలోని క్రమతే గణితశాస్త్ర ఆవిర్భావానికి కారణం. ఊహించలేనంత గణితాన్ని ప్రకృతి నుండి విశ్వం నుండి భారతీయులు గమనించారు. గమనించిన చాలా అంశాలను వేరువేరు సూత్రాల్లో నిక్షిప్తం చేసేందుకు ప్రయత్నించారు. అటువంటి అంశాలన్నింటి సమాహారమే వేదము. ప్రపంచ వాజ్మయానికి ఆద్యమై, విశ్వవిజ్ఞానాన్ని లోకానికి అందించిన తొలి వాజ్మయం. భారతీయ జ్యోతిష, గణిత శాస్త్రాలకు మూలమంతా వేదంలోనే కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ మార్గంలో ప్రయత్నించి మరికొంత శాస్త్ర విజ్ఞానాన్ని కాలానుసారంగా తెలుసుకుంటూ, పెంచుకుంటూ లోకానికి అందజేసిన మహనీయుల యోగదాన సంగ్రహమే ‘భారతీయ గణితశాస్త్ర చరిత్ర’. – ఆచార్య సాగి కమలాకరశర్మ అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ గణితానికి సేవలందించిన మహానుభావుల జీవితచరిత్రలను, వారి రచనలను, విశ్లేషణాత్మకంగా క్రోడీకరించి, ఒక సమగ్ర గ్రంథాన్ని శంకరబాలకృష్ణ దీక్షిత్ మనకు అందించారు. ఇందులో 100 పైగా జ్యోతిర్గణితానికి చెందిన గ్రంథకర్తలను, గ్రంథాలను చారిత్రకపద్ధతిలో సవివరంగా పరిచయంచెయ్యడం జరిగింది. ఇటువంటి గ్రంథం అంతకు పూర్వం ఏ భారతీయభాషలోను సంకలనం చేయబడలేదని తెలుస్తోంది. అయితే, అతను అందించిన మూలగ్రంథం మరాఠీభాషలో ఉంది. దానికి డా ఆర్.వి. వైద్య చేసిన ఆంగ్లానువాదాన్ని 1968, 1981లలో రెండు భాగాలుగా ముద్రించడం జరిగింది. మూలగ్రంథ రచయిత అయిన శంకరబాలకృష్ణ దీక్షిత్‌నకు ఈ దేశం శాశ్వతంగా ఋణపడి ఉంది. జ్యోతిశ్శాస్త్రంపైన, గణితశాస్త్రంపైన అభిమానం ఉన్న ప్రతి భారతీయుడు ఈ గ్రంథాన్ని చదివితీరాలి. ఇందులోని విషయం అంత అపూర్వమైనది. – డా. రేమెళ్ళ అవధానులు