Description
ఆదిత్య హృదయం సూర్యారాధన
ప్రవచన
ఆదిత్య హృదయమంటే ఏదో పుణ్యం వచ్చే కొన్ని అక్షరాలు గుంపులు, శ్లోకాలు అనుకుంటాం. కాని దీనిలో ఉన్న అంతరార్థాలను చూస్తే మహావిషయాన్ని ఒకచోట నిబద్ధం చేసి శక్తివంతమైన మహామంత్రంగా సమకూర్చాడు అగస్త్య. మహర్షి అనే విషయం తెలుస్తుంది. మన ఋషుల విజ్ఞానానికి, వాళ్ళ అనుగ్రహానికి రెండు చేతులెత్తి నమస్కరిస్తాం.
సూర్య ఉపాసనకు సంబంధించి ఆదిత్యహృదయం రామాయణం యుద్ధకాండలో ఇంచుమించు చివర భాగంలో వస్తున్నది. అక్కడ వరకూ ఇంకెక్కడా ఆదిత్యుని గురించి చెప్పలేదా అంటే, పరిశీలించి చూస్తే రామాయణంలో అనేక చోట్ల సూర్యభగవానుని విశేషాలను చెప్తారు.
మహాభారతంలో కూడా సూర్యతత్త్వం చాలా విస్తారంగా చెప్పబడింది. భాగవతంలో ప్రత్యేకించి సూర్యోపాసన ఉన్నది. అష్టాదశ పురాణాలలోను సూర్యతత్వం చెప్పబడుతున్నది. ఇదికాక వేదాలను పరిశీలిస్తే వేదాలు అసలు సూర్యుని గురించే చెబుతున్నాయా అనిపిస్తుంది. మొత్తంగా, ఆదిత్యహృదయం గురించి ఆలోచన చేస్తే భారతీయులందరూ నిజానికి సూర్యభగవానునే ఉపాసిస్తున్నారు అని తెలుస్తుంది.
మనం రకరకాల దేవతలను ఆరాధిస్తున్నా ఈ దేవతలందరూ సూర్య భగవానుని స్వరూపాలే అని, ఋషుల హృదయం బట్టి స్పష్టమౌతుంది. దీన్నిబట్టి వేదం చెబుతున్న ఏకేశ్వరవాదం ప్రకారంగా మనందరం వివిధ రూపాలలో ఒకే పరమాత్మని ఉపాసిస్తున్నాం సూర్యుని ద్వారానే ఆ పరమాత్మని మనం నేరుగా ఉపాసిస్తున్నాం. వేదంలో ఉన్న కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ – ఈ మూడు కాండములు కూడా సూర్యభగవానుని వైభవాన్ని అడుగడుగునా ఆవిష్కరిస్తున్నాయి.
శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు ఈ గ్రంథం ద్వారా కర్మ ఉపాసన మార్గాలలోని సూర్యప్రశస్తిని చెప్పే ప్రయత్నం చేశారు.
పుటలు: 340