28 Vrathalu

28 వ్రతాలు 

150.00

మరిన్ని Telugu Books కై
Share Now

Description

28 vrathalu book in telugu | devullu.com |

28 వ్రతాలు book

పూజలు చేయించు పురోహితులకు
 మిక్కిలి ఉపయోగకరము
     హిందూ పూజా విధానంలో వ్రతాలకు విశిష్ట స్థానం ఉంది. పురాణేతిహాసాల కాలం మొదలుగా… సామాన్య ప్రజల నుండి చక్రవర్తుల వరకూ వివిధ వ్రతాలను ఆచరించినట్లు మనకెన్నో తార్కాణాలున్నాయి. ఆయురారోగ్య సంపదలను సిద్ధింపజేసే అటువంటి వ్రతాలను పాఠకులకు అందిచాలనే సదుద్దేశ్య ఫలితమే ఈ “28 వ్రతాలు” పుస్తకం. వినాయక వ్రతం, వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం, కేదారేశ్వర వ్రతం వంటి 28 వ్రతాల సంపూర్ణ పూజా విధానాలు మూలశ్లోక సహితంగా ఈ పుస్తకంలో ఇవ్వబడ్డాయి. సభక్తికంగా మేం ప్రచురించిన ఈ పుస్తకం తప్పక భక్తవరేణ్యుల ఆదరాన్ని పొందుతుందని ఆశిస్తున్నాం.

ఋషిపంచమి :

మన ప్రాచీన రుషులను పూజించేవ్రతం రుషిపంచమి. భారతీయ పరంపరాగత పౌరాణిక కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ రుషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు. మరీచి రుషి వంశం వరసగా వివవస్వత్‌ క్రమంగా శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది.
ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది. కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వసిష్ఠుడు… వీరు ఏడుగురు పూజనీయులు. రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి. భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు. విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు. తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే. జమదగ్ని రుషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు. ఏడో రుషి వసిష్ఠుడు. ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు. స్వాయంభువ మన్వంతరంలోనూ సప్తరుషుల్లో ఒకడు. ఒకప్పుడు మిత్రా వరుణులకు ఊర్వశిని చూసి రేతస్సు స్ఖలితం కాగా కుండలో వసిష్ఠుడు, అగస్త్యుడు జన్మించారని ప్రతీతి. సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు. అందుకే భాద్రపద శుక్లపక్ష పంచమి రోజున స్త్రీలు తమ పూర్వకృత దోష పరిహారం కొరకు విధివిధానంగా పూజిస్తారు. ప్రతి రుషిపంచమికి సుమంగుళులు రుషులను పూజించి తమ దోషాలను దూరం చేసుకొని, ఆయువు, బలం, యశస్సు, ప్రజ్ఞ పొందగలరని వ్రతవిధానం తెలుపుతోంది. సప్తర్షుల ప్రతిమలు చేయించి, షోడశోపచారాలతో పూజించి, రుత్విక్కులను సంతుష్టులను చేసి, భోజనం ఏర్పాటు చేస్తారు. వారి ఆశీర్వాదాలందుకుంటారు. అలా చేసినవారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణ పరమాత్మ వివరించినట్లు పౌరాణిక వ్రతకథలు తెలుపుతున్నాయి. ప్రాచీన రుషులను పూజించే రుషిపంచమి భారతీయ సంస్కృతిలో చిరస్థాయిగా నిలుస్తుంది. -డాక్టర్‌ మాడుగుల భాస్కరశర్మ
ఋషిపంచమి వ్రతము ను స్త్రీలు తప్పక ఆచరించాలి . వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని ” ఋషిపంచమి ” అంటారు . సప్త ఋషులు ఆరోజు తూర్పున ఉదయిస్తారు . బ్రహ్మ విద్య నేర్వవలసినరోజు . సప్తఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి . . . గనుక బ్రాహ్మీ ముహూర్తముననే లేచి ధ్యానం చేసుకోవాలి . సప్తఋషులే గాయత్రీమంత్రానికి మూలగురువులు . మానవుని శరీరం లో ఏడు యోగచక్రాలు ఉంటాయి , వాటిని వికసింపజేసే వారే ఈ సప్తఋషులు .
మొట్టమొదటిసారిగా వేదమంత్రాల్ని దర్శించి వైదిక ధర్మాన్ని ప్రవర్తింపజేసిన ఆద్య హిందూఋషుల్ని స్మరించే శుభసందర్భం… భాద్రపద శుద్ద పంచమి . ఆ రోజున ఉపవాసం ఉంటే ఆ తొలిగురువులు మిక్కిలి ప్రసన్నులయి మనం కోరిన కోరికలు తీఱుస్తారు. ముఖ్యంగా స్త్రీలు రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికీ, వారి సంతానానికీ తరతరాల పాటు ఆయురారోగ్య సౌభాగ్యాల్ని అనుగ్రహిస్తారు. సంపూర్ణ ఉపవాసం అంటే రెండు పూటలు ఉప్మా తీసుకోవచ్చు. అత్తలకి శక్తి లేకపోతే కోడళ్ళయినా ఉపవాసం చేయాలి. సర్పదోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడేవారికి మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా చెయ్యడం వంశవృద్ధికరం. ఐశ్వర్యదాయకం.
కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. మనిషి తప్పనిసరిగా తీర్చుకోవలసిన ఐదురుణాల్లో ఋషిరుణం కూడా ఒకటి. ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్లేమరి. ఇంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవడం మన ధర్మం కాదూ!
దేవుడు ఎంత కరుణామయుడో చూశారా! ఇది చెయ్యి అంటాడు. పోనీ, చేతకాకపోతే కనీసం చెప్పినదానిలో సగమైనా చెయ్యమంటాడు అదీకుదరక పోతే అందులో సగం చెయ్యమంటాడు. ఎన్ని మినహాయింపులో చూశారా! అయినా ఆయన్ను తలవలేకపోతున్నాం. కొలువలేకపోతున్నాం. సరే! ఏడుగుర్ని కాకపోయినా వీరిలో ఐదుగురినైనా తప్పనిసరిగా ఈ భాద్రపద శుద్ధ పంచమినాడు స్మరించుకుని అర్చించాలన్నారు. అందుకే ఈరోజును ఋషిపంచమి అన్నారు.
ఆ ఐదుగురూ ఎవరంటే త్రిగుణాతీతుడైన అత్రి, ఈయన భార్య అనసూయ. వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట. ముఖ్యంగా ప్రస్తుతం ఈ జంటను పూజించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండవవారు భరద్వాజుడు. ఆపై గాయత్రీమంత్ర సృస్టి విశ్వామి త్రుడు, వసిష్ఠుడు, జమదగ్ని. ఈ ఐదుగురినీ పూజించే రోజే ఋషిపంచమి.
నిజానికీ పండుగ స్త్రీలకు సంబంధించింది. ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం. దీన్ని భాద్రపద మాసం శుద్ధపంచమిరోజున ఆచరిం చాలని భవిష్యోత్తరపురాణం తెలియచేస్తోంది. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో చేసిన దోషాలన్నీ పరిహారమవుతాయని బ్రహ్మ దేవుడు శితాశ్వుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియచేస్తోంది.