Description
రాక్షసులు ఎక్కడ ఉంటారు. అని అడిగితే కలిపురుషుడు ప్రవర్తిస్తున్న విశేషాన్ని పురస్కరించుకుని మనుష్యుల మనసులలోనే రాక్షసులు ఉంటారు. ఏ మనుష్యుని ప్రవర్తన రాక్షసత్వంతో కూడుకుని ఉంటుందో ఆ మనుష్యులందరినీ సంహరించవలసి ఉంటుంది. పరీక్షిత్ మహారాజు కలి పురుషునకు ఇచ్చిన ఐదు స్థానాలకు మరి ఐదు స్థానాలు ఏర్పడి లోకం అంతటా కలి విజృంభణం ఉన్న సందర్భం. పాపం చేసిన వాళ్ళను, ధర్మానికి విఘ్నం కలిగిస్తున్న వాళ్ళను నేను సంహారం చేస్తానని పరమేశ్వరుడు అవతారం స్వీకారం చేస్తే కలియుగంలో ఎంత మందిని మిగల్చాలి? ఎంత మందిని తెగటార్చాలి? కృష్ణ పరమాత్మ చేసిన ప్రతిజ్ఞ ఆయనకే ఇబ్బందికరం అవుతుంది. శివ కేశవుల మధ్య ఏ విధమైన భేదం లేదు కనక మనుష్యుల మనసులలో తిష్ఠ వేసి కూర్చున్న రాక్షసత్వాన్ని బోధ చేత తరిమి కొట్టి మనుష్యుడు మనుష్యుడుగా బతకగలగడానికి, శరీరంతో ఉత్కృష్ట కర్మ చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందడానికి, పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఈ భూమి మీద అవతరించాడు. ఆయన వచ్చేసరికి కలిపురుషుని విజృంభణం చేత సనాతనమైన ధర్మానికి ప్రమాణమైన వేదం ప్రామాణ్యం సన్నగిల్లి అనేక వాదనలు ప్రబలి పోయాయి. అటువంటి సందర్భంలో పరమ శివుడు శంకరాచార్యుడిగా అవతార స్వీకారం చేసాడు. కృష్ణుడు, పరమశివుడు జ్ఞానం అందిస్తారు.