Description
Mantra Shakti
మంత్రశక్తి
మనసును ప్రక్షాళనం చేసి, నైర్మల్యం కలిగించే ముఖ్య పరికరాలు..మంత్రాలు. జన్మ….గత వాసనలతో, మనలను కట్టి పడవేసి, అచేతన,సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది.
మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తాయి. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తాయి.
మంత్రములు, తంత్రములు, యంత్రములు ఇవన్నియు ఎన్నటికి మూఢనమ్మకములు కనేకావు. అలా తలిచే వారు మూడులు. అనుమానస్కులకు సందేహ ప్రాణులకు విషయగ్రాహ్యం కాదు. ఏదో నవీన యుగం కొత్త ప్రపంచం అంటూ మంత్రతంత్రాలను కొందరు మూఢ నమ్మకములని కొట్టిపారేస్తున్నారు. తెలిస్తే మాట్లాడవలె. తెలియకున్న మిన్నకుండవలె. తెలిసీ తెలియక వాదులాడువారినే మనవలె?
ఇవ్వాళ నిన్న కాదు. వేలవత్సరముల నుండి ఈ దేశంలో దేశీయ ఆయుర్వేదంతో బాటుగా మంత్ర తoత్ర యంత్రములు ధీటుగా ప్రజారోగ్యమునకు ఉపయోగింపబడు విషయము వీరికి అర్ధం కాదు. తెలుసుకునే ఓపిక తీరిక వారికి లేదు. చిన్నప్పుడు గ్రహదోషాలతో ఏడుస్తుంటే మెడలో కట్టిన రక్షరేకు గుర్తులేదు. అమ్మ మసీదుకు తీసుకెళ్ళి సాయిబుగారితో తాడుకట్టించి మంత్రంతో ఊదగా తగ్గిపోయిన జ్వరం గురించీ గుర్తులేదు. తేలు కుడితే మంత్రం వేయించగా తగ్గిపోయిన సంఘటన గుర్తులేదు. ఈ రోజు వారికివి చాదస్తం మూఢనమ్మకాలుగా తోచడం ఆశ్చర్యం కాదా?
నవీన వైద్య విధానానికి అలవాటు పడి వేలకు వేలు దోచి పెట్టడం తెలుసు గానీ దేశీయ వైద్య విధానాలు తెలుసుకుని వాటిని ప్రోత్సహించాలన్న ఆలోచన వీరికి రాదు. వాస్తవం ఏమంటే మంత్ర తంత్రాలు యంత్రాలు అన్ని నిత్య సత్యములైయున్నవి. ఇవేమియు గారడీ విద్యలు కావు. అనుసరించి అనుష్టించి సాధన చేసి సత్యము తెలుసుకున్న వారికే ఇది అనుభవము.
వేదాలు ఆధ్యాత్మికమగు శాస్త్రముల ననుసరించి ఏర్పరచబడినవి మంత్రములు. జ్యోతిష్యశాస్త్రము ననుసరించి ఏర్పరచబడినవి యంత్రములు. మనసు ఇంద్రియములు శరీరతత్వములను అనుసరించి ఆయుర్వేదానుసారంగా చెప్పబడినట్టివి తంత్రములు. వీటన్నిటికి అవినాభావ సంబంధం కలదు.ఇవి తేలిక అనేకులు దేశీయ వైద్య విధానాన్ని మంత్ర తంత్ర యంత్ర విధానాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. చేసి చూస్తేనే ఫలితం తెలియగలదు. చేయకుండా ఫలితం లేదనుట విచారించతగ్గ విషయం.
ఈ మంత్ర తంత్ర యంత్రములనేవి నిరాధారములని ఎలాంటి ప్రామాణికం లేదనుకోవటం పొరపాటు. ఇవన్నియు శాస్త్రాల ఆధారంగానే చెప్పబడినవి. ఎందరో మహానుభావులు సిద్ద పురుషులు ఋషులు మానవ కళ్యాణం కోసం ఎంతో కృషి చేసి ఆవిష్కరించిన అద్భుతాలివి. వాటిని అనుసరించి చూచువారికే మహిమ తెలియగలదు.
అయితే ఆత్మకు ఈ విధానాలకు సంబంధం ఉందని సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆచరించిన వారికే ఇవి మంచి ఫలితాన్నిస్తాయని మర్చిపోకూడదు. అపనమ్మకముతో ఆచరించిన ఏ పనీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. కాబట్టి విశ్వాసం ఉంచి ఈ విధానాలను ఆశ్రయించి చూడండి. నిశ్చయముగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములు సీధ్దిస్తాయి. – సదానందయోగి