Description

“సప్రమాణ జ్యోతిస్సారము “ online video
గ్రంధ కర్త – శ్రీ త్రిరుమల నల్లాన్ చక్రవర్తుల వేంకట వరదాచార్యులు
ప్రథమ ద్వితీయ తరంగములో గ్రంధకర్త తొలిపలుకులు.
ఇందులోనే చాల సూక్ష్మ ప్రశ్నలు జ్యోతిషమునకు మూల ఆధారము ఎదనేది వారు తెలిపారు.
వారి అభిప్రాయము అనుభవమును సరిగా అర్ధము చేసుకొని వారు ఈ గ్రంధములో గల రహస్యములను సాధించలేరు.
చక్కగా గమించండి.
**************************
శ్రీ రాఘవేంద్ర గురుభ్యోనమః
విజ్ఞప్తి
దైవజ్ఞ మహాశయులారా ఈ గ్రంధమునకు ప్రమాణ మెక్కడ అనువారు లేకపోలేదు. ప్రకృతమున్న గ్రంధములు సప్రమాణములా? అప్రమాణములా? అన్న విషయము మాత్రము ఎట్లు తెలుసుకొననగునో వారికే తెలియవలయును. ముద్రితమైన గ్రంధములన్నీ సప్రమాణములు అముద్రితములన్నీ అప్రమాణములని వారిభావమై యుండవచ్చును. ప్రమాణములని నమ్మిన గ్రంధముల పరికించగా మానవులకు ఉపకరించునవి విద్యార్థులు సులభోపాయముగ గ్రహింపగలట్టివి ప్రశ్నలకు తగువైన ప్రత్యుత్తరము ఇయ్యగలట్టివి. సందేహాస్పదము గానట్టివి గానరాక పోవుటచేత శోధింపవలసివచ్చి శోధించితిని ఉదా:- గురు, శుక్ర, చంద్ర, బుధులు శుభులుగా శేషించిన శని, కుజ, రవి, రాహు, కేతువులు పాపులుగా నిర్ణయించిరి. నవగ్రహములలో పాపులుగలరాయను సందియము గలుగకమానదు గ్రహరాట్ అన్న సూర్యుని పాపియనుట చూడ కంచయే చేనుమేసిన గలదెదిక్కు అన్నట్లున్నది – ఇతరులకు శుభత్వమిచ్చి తానుపాపత్వము తీసుకొన్నాడన్న చూట.
లగ్నాత్ 2, 3, 6, 7, 8, 11, 12 గృహములేర్పడి ఆ లగ్నములకు పాపఫలమిచ్చు వారైరిగాని శుద్ధపాపత్వము గల గ్రహములుండునా? పాపులు పాపస్థానములందుండిన మరింత పాపఫల మియ్యక శుభఫలము ఎట్టిత్తురు అనుసందేహము ఏర్పడకపోదు.
ప్రమాణ గ్రంధములలో ఈ విధముగా వీరు శుభులైరి ఈ రీతిగ వీరు పాపులైరి అన్నవచనములు ఎక్కడ గానబడదు. కారకత్వశుభుల శుభులన్నారనిన రాజగ్రహములగు రవి,కుజులకు కారకత్వములు శుభఫల మిచ్చునవి లేవా ఎందుకు గురు శుక్ర చంద్ర బుధుల శుభులనిరో వారికే తెలియును. ఇందువల్ల శుభులైరన్నమాట, విన, బడదు కనబడదు. వీరు వేసిన పునాది భద్రము లేక పోవుటచేత దానిపై ఎంద రెన్ని విధములుగా గోడలుకట్టిన నిలువ లేదనక తప్పదు.
ఉదా:- శుభులన్న వారు నలువురు ద్వాదశరాసులకు 2, 3, 6, 7, 8, 11, 12 రాసుల వారుగారా? వీరికి పాపస్థానములు లేవా.
ఉదా:- మీనలగ్నమునకు తృతీయాష్టమాధిపతి శుక్రుడు పాపి కాడా?
సింహమునకు వ్యయాధిపతి చంద్రుడు పాపి కాడా?
మేషమునకు తృతీయ, షష్టాధిపతి బుధుడు పాపి కాడా?
తులకు తృతీయ, షట్ స్థానాధిపతి గురువు పాపి కాదా?
వీరుమాత్రము ఎట్లుశుభులైరి, కొదుమవారు అశుభులెట్లయిరి అన్న దానికి ఉత్తర మెక్కడగానము. “త్రిషడష్టాయ రిప్పేశ విపరీత ఫలప్రదాః” అన్న వాక్యము అన్ని లగ్నములకు ఉండవలయునుగదా. చంద్రునకు శత్రువులు లేరనుట మరింతవింత కటకమునకు 3, 6, 8, 12, 7 స్థానములు లేవా వారు శత్రువులుగారా?. లగ్నమున కైన లగ్నాధిపతికికారా. ఇట్టి ప్రశ్నలు వేనవేలు పట్టును. ప్రత్యుత్తరము మాత్రము గానము. “సర్వే త్రికోణ నేతారో గ్రహాశుభ ఫలప్రదాః” అన్న వాక్య ప్రకారము లగ్న పంచమ నవమాధిపతులు శుభులుగదా. ఈమూడు స్థానములకు ఎదురిండ్లు ఆశుభస్థానములుగదా వెరసి ఆరు గ్రహములుకాగా ఒక్క గృహము గ్రహము మిగులును. ఆ వక్కడు చంద్రుడుగానో సూర్యుడుగానో నుండి స్థానాధిపత్యమువల ఏక గృహస్తులు గాబట్టి శుభులపరమో అశుభులపరమో చేరకతప్పలేదు చూడుము.
ఉదా:- ధనస్సుకు అష్టమ స్థానాధిపత్యమువల్ల చంద్రుడు పాపులతో కలసి పనిచేయవలసి వచ్చెను. మీనమునకు పంచమాధిపత్యమువల్ల శుభులతో చేరవలసివచ్చెను. సూర్యుడు ఇట్లే మీనమునకు శత్రువుగను ధనస్సుకు మిత్రుడుగను కావలసివచ్చెను. వృషభమునకు చతుర్ధాధి పత్యమువల్ల సూర్యుడు శత్రువులతో చేర వలసివచ్చెను. తులాలగ్నమునకు దశమాధిపత్యమువల్ల చంద్రుడు శత్రువులతో చేరి మిత్రులపై దండెత్తవలసి వచ్చెను ఇట్లే గురుకుజుల పరముగా శని శుక్ర బుధులపరముగా సూర్య చంద్రులు తిరుగుచు 7 గ్రహములుగా నుండిరని తేలుచున్నది. అనుభవమున సరిపోవు చున్నది. గురు కుజులకు సూర్య చంద్రులకు కోణాధిపతులుగా శని, శుక్ర, బుధులు ఎక్కడా లేరు. శని-శుక్ర-బుధులకు కోణాధిపతులుగా గురు-కుజ-సూర్య-చంద్రులు ఎక్కడ లేరు.
కోణములే శాస్త్రమునకు మూలముగాన గురుపాలితములని శనిపాలితములని లగ్నముల విభజింప వలసివచ్చెను. మకర – కుంభ – వృషభ – మిధున – కన్య – తులలు శనిపాలితములనియు మీన – మేష – కటక – సింహ – వృశ్చిక – ధనస్సులు గురుపాలితములనియు రెండు భాగలుగా ద్వాదశ లగ్నములు విడ దీయవలసివచ్చెను. ఈవిభజనవల్ల శాస్త్రమంతయు మార్పుజనించెను.
లగ్నము బేటరీయనియు నక్షత్రములు శల్సులనియు గ్రహములు బల్పులనియు గోచరించెను. గ్రహములేక లగ్నము నక్షత్రము సుఖ దుఃఖముల ప్రసరింపజాలదని తెలియనయ్యెను. ఇట్లే గ్రహించినవి అనుభవమునకు తీసుకొనగ సరిపోయెను దానిని వ్రాయగలిగి తిని చెప్పగలిగితిని.
ప్రమాణ గ్రంధముల లక్ష్యము చేయడనువారు వారికన్నా పెద్దవాడా అనువారు శాస్త్రమునకు విరుద్ధముగా నడచువాడను వారు విరుద్ధముగా మాట్లాడుతారనువారు ఎదురౌచువచ్చిరి. బాగ చెప్పినాడని పృచ్చకులనిన ఆయనకు శాస్త్ర మెక్కడిదయ్యా కర్న పిశాచి స్వాధీనమయ్యా లేకున్న అన్ని విషయములు చెప్పగలడా, అంటూవచ్చిరి.
మిత్రులుకూడానమ్మినాలో చేరక అప్పుడప్పుడు ఎదిరించుచునే వచ్చిరి ఈదారిన రాకపోయిరి. గురు-శుక్ర-బుధ-చంద్రులు శుభులు శేషించినవారు పాపులుగా చెప్పుచునే వచ్చిరి. ఉన్న ప్రమాణ గ్రంధ ములన్నియు వాస్తుశాస్త్ర మంతయు కృత్రిమములన్న అప్పుడంతయు విసుగుచెందుచు వచ్చిరేగాని ఆడిగినదానికి ప్రత్యుత్తర మియ్యలేక ప్రక్కకుపోయి ముందొచ్చిన చెవులకన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి లేరా అనుచూ అసూయపడిరి అసూయపరులై ఇతరులకు చెప్పిరి దుష్ప్రచారములచేసిరి. గాని నేనాలోచించునది మానలేదు ఎట్లయిన చక్కని మార్గము కనిపెట్టవలెనను పట్టుదలను విడువ లేదు స్థూలములో సూక్ష్మాతి సూక్ష్మములకు పోలేకపోయినను స్థూలముగానైన చక్కనిమార్గము ఏర్పరుపవలెనను ఆశను వదలలేదు శ్రీ శారదామతల్లి కరుణాకటాక్షము గలదనియు నేనునమ్మి ధ్యానించు దైవములు వృధాచేయరనినమ్మి సద్గురు శ్రీ రాఘవేంద్రునిపై భారము వేసి గ్రహించినది గురుశిష్య సంభాషణతో వ్రాసితిని. మద్గురువరేణ్యులు మంత్రాలయము శ్రీశ్రీ రాఘవేంద్రస్వామి వారు చెప్పునట్లు నా గోత్రము శ్రీవత్ససగాన శ్రీవత్సుడు అడుగునట్లు చేసితిని. శ్రీవత్సా అని వత్సా అని సంబోధించుటకు కారణమిది. నేను శ్రీ వైష్ణవుడనయ్యు శ్రీవారు కరుణించి ద్వాదశ ఊర్ధ్వ పుండ్రములతో స్వప్నమున దరిశనమిచ్చి కొన్ని దృక్కులుచూపి తన శిష్యకోటిలో నన్నొకనిగా చేర్చుకొనుటచేత ఈగ్రంధరచనకు కారకులుగా వారినే నియ మించితిని వారి కరుణాకటాక్షము వల్లనే వ్రాయగలిగితిని.
అన్ని ముహూర్తములు ప్రధమ భాగమునందే వ్రాయుటకు గ్రంధవిస్తర భీతిచే వివాహ ఉపనయనములనే వ్రాసితిని. జ్యోతిషము చక్కగా తెలియక పోయిన ముహూర్త భాగములో చొరువ గలుగక పోవునని స్థూలముగా జ్యోతిష ఫలభాగము వ్రాసితిని. జ్యోతిషము చక్కగా తెలిసిన సర్వముహూర్తములు పెట్టగలుగు శక్తిగలుగునని తలంచి ప్రథమతరంగమంతయు ఫలభాగముగా వ్రాసితిని తృతీయ తరంగమున సర్వముహూర్తములు గోచరించిన సర్వ విషయములు వాస్తు బాగము స్థూలముగా వ్రాయనుద్దేసించితిని.
వాస్తు మానవునుండి పుట్టినదా ప్రత్యేకముగా నుండెనా అను సందేహము కలుగకమానదు. ఎట్లన లగ్నచతుర్దమును గృహముగా జ్యోతిషము చెప్పుచున్నది గదా. గృహస్థానమున పాపగ్రహమున్న మానవునికి గృహమే లేక బాధపడుచున్నాడు. ధనికుడై యుండిన గృహమున్న చాలనిది, వసతులు లేనిది, చిక్కులతో నుండినది గలిగి దుఃఖించు చున్నాడు. చతుర్థమున శుభగ్రహముగలవారు రాజభవనములందు, భవనములందు, వసతిగృహములందు నివసించుచున్నారు. ఏవిధగ్రహ మందుండునో అట్టికోణములతో చేరిన గృహమతనికి లభ్యమగుచున్నది జన్మతహ తెచ్చుకొన్న గృహభాగమునుమానవుడు మార్చజాలడని జ్యోతిషము నిరూపించును వాస్తు గ్రంధకర్తలు గలదనిన జ్యోతిష్యము శూన్యమగును జ్యోతిషుడు వ్యర్ధుడగును. జాత కుని గృహమెట్టిదో జ్యోతిషమే నిర్ణయింప వలయును. గాని వాస్తు గ్రంధములు నిర్ణయింప జాలపు, ప్రకృతము వాస్తు గ్రంధములు లోకుల భయబ్రాంతుల చేసినవి చేయుచున్నవి. జ్యోతిలేని వాస్తు భాగమంతయు గాడాంధకార మనియే భావింపవలయును. “మునుల వాక్యములని కాళిదాసాదుల ప్రణీతములని తెలిపిరిగాని ఇవి నమ్మ తగిన మాటలుగావు వారు భూత భవిష్యత్ వర్తమానముల నెరింగిన మహనీయులు”. ఇట్టి గ్రంధముల లిఖించిరనుట సందేహాస్పదము వారి రచనయనిన వారి వాక్యములనిన మహనీయుల రచ్చకీడ్చినట్లగును, వారి వాక్యములు మరుగైనవనుట శ్రేయోదాయకము. జోస్యము వంశ పరంపరగా వచ్చి వంశము లంతరించుట చేత ఆగిపోయి కృత్రిమ జోస్యము బయలు దేరినదని తెలియుచున్నది.
వరాహమిహిరాదుల కాలమునకు ముందెప్పుడో ప్రక్కదారిని సృష్టించినట్లు తెలియుచున్నది. లగ్నములకు శుభగ్రహముల నేర్పరచినవారు గురుశనుల విభజన చేసినవారు కన్పించిరిగాని వారు తిరిగి గ్రంధములందు పూర్వపద్దతులనే అనుసరించిరి. గ్రహముల విడచి నక్షత్రములతో ఆట్లాడిరి సంధికాలములతో కాలహరణము చేసిరి. కాలగతుల నడిపించునవి మానవ జీవిత రక్షణోపాదుల నడిపించునవి చావుపుట్టుకల గలిగించునవి, వధూవరుల అన్యోన్యతను, వధూవరుల సౌఖ్యాసౌఖ్యములను, ఆయుర్దాయమును గలిగించునవి నడిపించునవి గ్రహములని తెలుపరైరి. నక్షత్రములకు సంధికాలముచూపి విధవయగునని మృత్యుప్రదమని భయపెట్టిరి గ్రహముల బలాబలముల తెలుపరైరి అందుచే ఒకటననేల సర్వముహూర్తములు మానవులకుపకరింపక చెడిపోయెను. గ్రంధములు మాత్రము ప్రమాణము లుగానిలచెను. శాస్త్రము శాసించినది మాత్రము చల్లాచెదురయ్యెను.
బృహజ్జాతకమున మేషము లగ్నమై లగ్నమున రవి, చతుర్థమున గురువు, సప్తమమగు తులలో శనియుండిన రాజయోగమన్నాడు. ఏకాదశ స్థానాధిపతియై గురు రవులకు పరమశత్రువైయున్న శని ఉచ్చస్థితినొంది రవిగురువుల చూచుటవల్ల ఇరువుర ఫలము నాశనమైపోగా, రాజయోగ మెటుల గలుగును ముంతయిచ్చి చెంబు ఎత్తుకపోవను. శని మేషమునకు పంచమభాగ్య స్థానాధిపతులగు రవి గురువులను శని చూచుటచే యోగభ్రష్టత గలుగుక యోగమెటుల జరుగును. రవి-శనిని చూచుటచేత శనిలో గల నీచపదార్థములతో యోగముగల్పించును నీచజీవనమగును. రవి-శనుల సమ సప్తకము లోకభయంకరము. దినదినగండము నూరేడులాయువన్నట్లుండును ఇట్లే వరాహమిహిరాదులు అనేక రాజయోగముల చెప్పిరిగాని విద్యార్థులుగాని సామాన్య జోస్యులుగాని నేర్చుకొనుటకు అలవిగావు అనుభవరీత్యా పరికింతమని గొప్పవారి జాతకములలో చూచిన వీరు చెప్పిన యోగములెచ్చట గానరావు. చెప్పినవి కంఠస్తము చేయవలయుననిన అలవిగావు. వీరుకూడ త్రికోణాధిపతుల రాజగ్రహములగు సూర్య-చంద్ర-కుజుల గమనించి శాస్త్రము యోగములు వ్రాయలేదని వారి శాస్త్రమే చెప్పుచున్నది. బృహజ్జాతకము, సారావళి, వృద్ధపరాశరము, చంద్రికలు మొదలగు గ్రంధములన్నియు వారివారి యిష్టమొచ్చినట్లు ఇదినా మతము ఇదినామత మని వ్రాసినారు. శాసించినవి మాత్రము ఫలించలేదు. గురు-శని పాలితముల విడదీసి లగ్నములకు శుభాశుభులనెరింగి గ్రహకారకత్వముల గమనించి స్థానకారకత్వముల తెలుసుకొని ముందుకు నడచిన గమ్యస్థానము చేరుకొనును. వీరు శాసించిన శాస్త్ర ఫలమంతయు శూన్యమగును. ఏనాటికైనా శాస్త్రమునకు జీవము కోణాధి పతులనియు రాజ యోగములకు సూర్య-చంద్ర-కుజులనక తప్పదు. వీటిని గమనించక వ్రాసిన గ్రంధములన్నియు వ్యర్ధములనక తప్పదు.
దైవజ్ఞ మహాశయులారా! నా ఈ గ్రంధమునకు ప్రమాణము శ్లో || త్రికోణ నేతారో గ్రహా శుభఫలప్రదాః అన్న శ్లోకమే ప్రమాణము, ఈశ్లోకాధారము చేసుకొని అనుభవరీత్యా శ్రీ సద్గురు రాఘవేంద్రుని అనుగ్రహముతో సాధింపగలిగితిని పృచ్చకులనుండి జాతకముల నుండి అనుభవము గడించిన దీనిని ఈర్ష్యాసూయలతో చూడక శాంతముతో సొంతముగా పఠించి అనుభవములో గమనించి తెలుసుకొన్నవారు తెలియని వారికి తెలిపి ప్రజోపయుక్తముగా చేసి కళాశాలలందు ప్రవేశమగునట్లు చేయుదురని ప్రార్ధన.
శాసించినది జరుగవలయును శపించినది తగులవలయును, శాసించినది జరుగక శపించినది తగులకపోయిన శాసించినది శాస్త్ర ముగాదు శపించినది వాక్కుగాదు. అనువిషయము ఎల్లరు ఎరింగిన విషయమే. శాసించినది జరుగుచూ వచ్చిన ఇంక కొంతకాలమునకెనా ఈ శాస్త్రము కళాశాలలందు నెలకొని పాపపుణ్యములు ఇట్లు పుట్టుచున్నవి. పుణ్యమువల్ల మానవుడు పురోగమించి సుఖపడును. పాపమువల్ల తిరోగమించి దుఃఖపడునని యెల్లరు తెలుసుకొనుటకి శాస్త్రము అద్దము వంటిదనిలోకము బాగుపడునని తలంతును. ఇట్లు గ్రంధ కర్త