Description
శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రేరణతో తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరిన తాళ్లపాక వేంకట శేషాచార్యుల రాతప్రతి ఆధారంగా రూపొందించిన పుస్తకం ఇది. రాగిరేకుల్లో కనిపించని కీర్తనలు కొన్ని, రాగిరేకుల్లోనూ ఉన్నవి కొన్ని, అదనంగాపెదతిరుమలాచార్యుల ద్విపద కృతి ‘శ్రీవేంకటేశ్వర ప్రభాత స్తవము’ ఈ రాతప్రతిలో ఉన్నాయి.
అన్నమాచార్యుడు.. కొలిచిన, పిలిచిన శ్రీవేంకటేశ్వరుడు దశావతార మూర్తి! కోనేటిరాయుడిలోనే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహాది రూపాలను దర్శించుకుంటాడు. కోదండ రాముడంటూ కొలుస్తాడు. కొంటె కృష్ణుడంటూ ముద్దులు కురిపిస్తాడు. నారసింహుడంటూ శరణాగతిని ప్రదర్శిస్తాడు. పరబ్రహ్మమంటూ ప్రణతులు అర్పిస్తాడు. ముప్పైరెండు వేల కీర్తనలతో ముజ్జగాలకూ మూలమూర్తి అయిన దేవుడిని అర్చించి తరించాడు. నిరంతర నిర్నిద్రుడిని మేల్కొలపాలన్నా, అన్నగత ప్రాణులకు ఆధారమైనవాడికి నైవేద్యం సమర్పించాలన్నా, గంగా జనకుడిని అభిషేకించాలన్నా, విశ్వంభరుడికి వస్ర్తాలంకారం చేయాలన్నా, మకరారి రక్షకుడికి మకర కుండలాలు తొడగాలన్నా, యదుకుల తిలకుడికి తిలకం దిద్దాలన్నా, లక్ష్మీపతికి నవరత్నఖచిత ఆభరణాలు తొడగాలన్నా, సృష్టి- స్థితి- లయకారుడికి ఊంజల సేవ జరపాలన్నా, నిత్య చైతన్య స్వరూపుడిని నిద్రపుచ్చాలన్నా.. ఆనందనిలయ ఆవరణలో అన్నమయ్య కీర్తన వినిపించాల్సిందే! వేదమంత్రాల కన్నా, ఉపనిషత్ వాక్కుల కన్నా… క్షీరాన్నాన్ని తలపించే అన్నమాచార్యుల కీర్తనలే స్వామికి మహా ఇష్టమని చెబుతారు.
ఆ సంకీర్తనా సర్వస్వంలో.. తాళపత్రాలుగా కాలగర్భంలో కలిసిపోయినవి కలిసిపోగా, రాగిరేకులగా కరిగించినప్పుడు కరిగిపోయినవి కరిగిపోగా.. సంకీర్తనా భాండాగారంలో కొంత సాహిత్యం లభ్యమైంది. తంజావూరు సరస్వతీ మహలులో కొన్ని కీర్తనలు భద్రంగా ఉన్నాయి. ఎనిమిది దశాబ్దాల క్రితం.. తాళ్లపాక వంశీయులైన శేషాచార్యులు తమ సంరక్షణలోని దాదాపు మూడు వందల కీర్తనలను శ్రీవేంకటేశ్వర ప్రాచ్యలిఖిత భాండాగారానికి సమర్పించారు. కాబట్టే, వీటికి ‘శేషాచార్యుల ప్రతి’ అన్న పేరొచ్చింది. ‘వేడుకొందామా’, ‘పొడగంటిమయ్యా’, ‘కంటి శుక్రవారము’.. తదితర కీర్తనలు అందులోనివే. వాటిలో కొన్నిటిని వేటూరి ప్రభాకరశాస్త్రి పరిష్కరించారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కొంతమేర అధ్యయనం చేశారు. ఆ తర్వాత, ప్రభాకర శాస్త్రి తనయుడు వేటూరి ఆనందమూర్తి.. పితృపూజ్యులు ప్రారంభించిన పనిని కొనసాగించారు.
ఆ మహత్కార్యంలో శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, శాంతా వసంతా ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ కె.ఐ.వరప్రసాదరెడ్డి, అన్నమాచార్య సాహిత్య పరిశోధకులు, తనను తాను అన్నమయ్య పదదాసుడని సవినయంగా ప్రకటించుకున్న గంధం బసవ శంకరరావు సంపాదకత్వ, పరిష్కరణ బాధ్యతలలో పాలుపంచుకొని వెలువరించిన అమూల్య గ్రంథం ‘తాళ్లపాక సంకీర్తనలు’. శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి ప్రేరణతో తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరిన తాళ్లపాక వేంకట శేషాచార్యుల రాతప్రతి ఆధారంగా రూపొందించిన పుస్తకం ఇది. రాగిరేకుల్లో కనిపించని కీర్తనలు కొన్ని, రాగిరేకుల్లో ఉన్నవి కొన్ని, వీటికి అదనంగా పెదతిరుమలాచార్యుల ద్విపద కృతి ‘శ్రీవేంకటేశ్వరప్రభాత స్తవము’ ఈ రాతప్రతిలో ఉన్నాయి. సుప్రసిద్ధమైన ‘అలరచంచలమైన ఆత్మలందుండ.. నీకలవాటుజేసె నీ వుయ్యాల’ కృతి ఇందులోనిదే. ‘నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి.. ఆడుచు సోబాన బాడుమనరే చెలులూ’ అంటూ శ్రీవారి కల్యాణోత్సవాన్ని వర్ణిస్తుందో కీర్తన. ‘హరి ఇతడు, హరుడతండు’ కీర్తన హరిహర తత్త్వాన్ని బోధిస్తుంది. ‘సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల..’ అని మొదలై ‘కప్పురగందుల కమ్మని పువ్వుల చప్పరములలోనోలాల.. తెప్పలుగా రతిదేలుచు గోనేటప్పని బాడెదరోలార’ అంటూ కోనేటిరాయని వసంతరాయనిగా కొలిచే శృంగార కీర్తన అబ్బురమనిపిస్తుంది. వీటిలో కొన్ని అన్నమాచార్యులవే అన్న నిర్ధారణకు రాగలిగినా, మరికొన్ని పెదతిరుమలయ్య, చినతిరుమలయ్య రచనలూ కావొచ్చన్న అభిప్రాయానికి వచ్చారు పరిష్కర్తలు. అలా అని వీటిని కేవలం కీర్తనలేనని సరిపుచ్చలేం. ఇవి శ్రుతులు, శాస్ర్తాలు, పురాణకథలు, విపుల మంత్రార్థాలు, వేంకటపతిని వెదికిచ్చే మంత్రాక్షరాలు. పాటలా పాడుకుని పరవశించవచ్చు, పాఠంలా చదువుకుని తరించనూవచ్చు.
Annamayya Keerthanalu
తాళ్లపాక సంకీర్తనలు
పరిశోధనలో కొత్తగా వెలుగు చూస్తున్న తాళ్లపాక కవుల పద సాహిత్యం
సంపాదకులు-పరిష్కర్తలు: డా. వేటూరి ఆనందమూర్తి, గంధం బసవ శంకరరావు, డా.కె.ఐ.వరప్రసాదరెడ్డి
పేజీలు: 370;
ప్రచురణ: తిరుమల తిరుపతి దేవస్థానములు