Description
పి. సుశీల సుమధురగీతాలు
మన జాతి సంపద!
నలభయ్యేళ్ళపాటు దక్షిణ భారత దేశాన్ని తన పాటతో ఉర్రూతలూపిన సుశీల గారు సినీ నేపథ్య రంగాన్ని ఒక విధంగా ఏలారని చెప్పవచ్చు. ఆమె సినీ రంగంలోకి వచ్చేటప్పటికి అగ్ర గాయనీమణులుగా వెలుగొందుతున్న పి.లీల, జిక్కీలు ఆ ప్రభంజనానికి వెనక్కు తగ్గక తప్పలేదు. సుశీలగారి తరువాత అయిదేళ్ళకు సినీ రంగంలోకి వచ్చిన ఎస్.జానకి గారు కూడా 1970ల ద్వితీయార్ధంలో కానీ అగ్ర గాయనిగా కుదురుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో సుశీల గారి హవా అంతగా నడిచింది.
సుశీలగారిది తియ్యటి గొంతు. ప్రయత్నించి, సాధన చేస్తే వచ్చే గొంతు కాదది. భగవత్ ప్రసాదం. ఏది పాడినా తీయగా ఉంటుంది. ఆ గొంతు పలకని సంగతి లేదు. ప్రణయ గీతాలైనా, విరహ గీతాలైనా, విషాద గీతాలైనా, వీణ పాటలైనా, జానపదాలైనా, జయదేవుడి అష్టపదులైనా… ఏదైనా… ఎటువంటిదైనా సుశీలగారు పాడితే కొత్త అందం వచ్చి తీరాల్సిందే!
1935లో కళలకు కాణాచిగా పేరుపొందిన విజయనగరంలో పుట్టిన సుశీలగారు 1953లో విడుదలైన ‘కన్నతల్లి’ సినిమాతో గాయనిగా తెలుగు లోకానికి పరిచయమయ్యారు. తొలి చిత్రంలో ఉప పాత్రధారులకు పాడిన ఆమె రెండో చిత్రం ‘పక్కింటి అమ్మాయి’లోనే నాటి అగ్ర కథానాయికలలో ఒకరైన అంజలీదేవికి పాడారు. అది మొదలు 1990ల వరకూ ఆ గళానికి అలూపూ లేదు, విశ్రాంతీ లేదు. తెలుగు, కన్నడ, మళయాళ భాషలలో అగ్రేసర గాయనిగా కొనసాగిన సుశీలగారు హిందీ, ఒరియా, సింహళ భాషలలో కూడా పాడారు. ఆమె పాడిన మొత్తం పాటలు 20 వేల వరకూ ఉంటాయని అంచనా. ఒక్క తెలుగులోనే దాదాపు 7 వేల పాటలు పాడారు.