Adunika Grahalu Vupagrahalu

ఆధునిక గ్రహాలు ఉపగ్రహాలు

99.00

Share Now

Description

Adunika Grahalu Vupagrahalu book (telugu)

ఆధునిక గ్రహాలు ఉపగ్రహాలు

సమస్త చరాచర జగత్తంతా బ్రహ్మ సృష్టేనని అంటారు.మనం నివసిస్తున్న భూగోళమే మనకు తెలిసిన బ్రహ్మాండం.సృష్టిలో ఇదొక్కటే బ్రహ్మాండమా? మరో నాలుగువేల కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయా? విశాల విశ్వంలో ఎన్నో సౌర కుటుంబాలు ఉంటే అక్కడ మనలాంటి కుటుంబాలు ఉండవా? భూమిని మింగిన మానవుడు ఆ నింగినిమింగక మానేస్తాడా? మనకు తెలిసిన సృష్టి మాత్రమేనా? మిగిలినదంతా మనిషి సృష్టేనా? ఎన్నో నిజాలను ఛేదించిన మానవుడు అన్నే అబద్ధాలనూఅల్లాడుగా! మన నింగి అవతల జీవం ఉందా? బ్రహ్మ సృష్టిలో అది కూడా ఒక మాయా? లేక అంతా మన భ్రమా?
మనం నివసించే భూమికి వెలుపల మరింకెక్కడైనా జీవం ఉందా..? ఉంటే, ఎక్కడ ఉంది? ఎలా ఉంది? జీవం ఉన్నత ఇతరేతర గ్రహాలకు వెళ్లి భూమ్మీది మనుషులు మనుగడ సాగించగలరా..? చాలాకాలంగా ఇవన్నీ అంతు చిక్కని ప్రశ్నలుగానే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి శతాబ్దాలుగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. భూమికి వెలుపల గ్రహాలపై జీవానికి సంబంధించి ఇప్పటివరకు లభించినవల్లా చిన్నచిన్న ఆధారాలు మాత్రమే! సౌర కుటుంబానికి వెలుపల ఎక్కడో ఒకచోట గ్రహాంతరవాసులు ఉండవచ్చని, వారు మనకంటే తెలివైన వారై ఉంటారని సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ అభిప్రాయపడ్డాడు. విశాల విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఒకటి కాదు, రెండు కాదు కోటాను కోట్లుగా ఉన్నాయి. ‘కెప్లర్‌ స్పేస్‌ మిషన్‌’ 2013లో వెల్లడించిన నివేదిక ప్రకారం భూమిని పోలిన గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఏకంగా 4 వేల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇవన్నీ సూర్యుని వంటి నక్షత్రాల చుట్టూ తిరుగుతున్నాయి. భూమిని పోలిన ఈ గ్రహాలపై ఎక్కడో ఒక చోట జీవజాలం మనుగడ సాగిస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తల ఊహ. గ్రహాంతర జీవుల ఉనికిని ఆధునిక శాస్త్రవేత్తలెవరూ కొట్టిపారేయడం లేదు. భూమికి వెలుపల– ఇంకా చెప్పాలంటే మన సౌరకుటుంబానికి వెలుపల ఉన్న కొన్ని గ్రహాలపై జీవులు ఉండవచ్చని, ఆ జీవుల్లో మనుషులను పోలిన తెలివితేటలు గల జీవులు కూడా ఉండవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంత రిక్షంలో అక్కడక్కడా గుర్తుతెలియని ఎగిరే వస్తువులు (యూఎఫ్‌ఓ) కనిపించినా, గ్రహాంతర వాసులు భూమిపైకి లేదా కనీసం భూమి పరిసరాల్లోకి వచ్చారనేందుకు మాత్రం ఎలాంటి ఆధారాలూ లేవు.

అలుపెరుగని అన్వేషణ Adunika Grahalu Vupagrahalu book

భూమికి ఆవల జీవం కోసం శాస్త్రవేత్తలు అలుపెరుగని అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో అంగారకునిపై జరిపిన అన్వేషణల్లో కొన్ని ఆశాజనకమైన ఫలితాలు లభించాయి. అంగారకుని ఉపరితలం నుంచి సేకరించిన మట్టిలోని మూలకాలు, అక్కడ వ్యాపించి ఉన్న వాయువుల నమూనాలు సూక్ష్మజీవుల మనుగడకు సానుకూలంగా ఉన్నట్లు ‘నాసా’ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. భూమిపై రాలిపడ్డ గ్రహశకలాలను కూడా ‘నాసా’ శాస్త్రవేత్తలు నిశితంగా పరీక్షించారు. వీటి కణాల్లో జీవానికి కీలకమైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ నిర్మాణాలను గుర్తించారు. దీని ఆధారంగా భూమ్మీద పడిన అంతరిక్ష ధూళి నుంచి ఇక్కడ జీవం ఆవిర్భవించి ఉండవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. ‘నాసా’ శాస్త్రవేత్తలు 2011 నవంబర్‌లో ప్రయోగించిన ‘క్యూరియాసిటీ రోవర్‌’ 2012 ఆగస్టులో అంగారకుని ఉపరితలంపై ‘గేల్‌ కార్టర్‌’ ప్రాంతంలో దిగింది. అయితే, ఇది అంగారకునిపై జీవుల ఉనికిని మాత్రం కనుగొనలేకపోయింది. ఒకవైపు ‘నాసా’ తనవంతు ప్రయోగాలు, ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, సౌరకుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై జీవం ఉనికి కనుగొనే లక్ష్యంతో 2014లో న్యూయార్క్‌లోని కార్నెల్‌ వర్సిటీలో కార్ల్‌ సాగన్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ఈ సంస్థ రెండు భారీ టెలిస్కోప్‌ల సాయంతో సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై నెలకొన్న పరిస్థితులను తిలకించి, వాటిపై జీవం మనుగడకు ఉండే అవకాశాలపై పలు అంచనాలు వేసింది. ఇదిలా ఉంటే, భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో సౌరమండలాన్ని తలపించే నక్షత్ర వ్యవస్థలో ‘గ్లైకోలాల్డిహైడ్‌’ అనే చక్కెర అణువుల ఉనికిని కోపెన్‌హాగెన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. జీవకణాల నిర్మాణంలో కీలకమైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల్లో కీలకమైనవి ఈ చక్కెర అణువులే కావడంతో అక్కడ జీవుల ఉనికి ఉండవచ్చనే అంచనాకు వచ్చారు.