ఫైనాపిల్

ఫైనాపిల్

పైనాపిల్ తింటే.. ఏ పిల్ అవసరం లేదంటారు. అనాస ఆరోగ్యాలకు ఆవాసమని పేరు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, అందాన్ని పెంచే.. ఔషధ గని! కప్పు ముక్కలతో క్యాన్సర్‌కే చెక్ పెట్టొచ్చు.. జ్యూస్ జుర్రుకుంటే ఏ అనారోగ్యాలూ దరిచేరవు. అన్ని ఫైన్ విషయాలు ఉన్న పైనాపిల్‌కి కూడా ఓ రోజుంది.. ఈ నెల 27న ప్రత్యేకంగా పైనాపిల్ డేని జరుపుతున్నారు.ఈ సందర్భంగా పైనాపిల్‌పై ప్రత్యేకంగా ఈ జంటకమ్మ.

ముళ్లతో కాస్త వికారంగా కనిపించినా.. ఔషధాలు మాత్రం మెండు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రంలో పైనాపిల్‌ని ఎక్కువ పండిస్తారు. ప్రకృతి ప్రసాదించిన అమూల్యఫలం ఇది. దీన్ని అమెరికన్ ఆదివాసులు దేవతాఫలంగా భావిస్తారు. క్రీ.శ.1548 సంవత్సరంలో భారతదేశంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయింది. 1 మీటరు నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. కొంచెం పరిపక్వతకు వచ్చిన తర్వాత పువ్వు వస్తుంది. ఈ పువ్వు సుమారు 15 సెం.మీ.లు ఉంటుంది. పువ్వు 12 నుంచి 20 నెలల తర్వాత పండుగా ఏర్పడుతుంది. వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి.
100గ్రా. పైనాపిల్‌లో ఉండే పోషకాలు.. నీరు : 87.8 గ్రా.
ప్రొటీన్ : 0.4 గ్రా.
కొవ్వు : 0.1 గ్రా.
పిండి పదార్థాలు : 10.8 గ్రా.
క్యాల్షియం : 20 మి.గ్రా.
పాస్ఫరస్ : 9 గ్రా.
ఐరన్ : 2.4 గ్రా.
సోడియం : 34.7 గ్రా.
పొటాషియం : 37 గ్రా.
మాంగనీస్ : 0.56 గ్రా.
కెరోటిన్ : 18 మైక్రో గ్రా.
శక్తి : 46 కిలోక్యాలరీలు
మీకు తెలుసా?- క్రీ.శ.1398లో పైనాపిల్ అనే పేరును అన్నట్లుగా రికార్డులు ఉన్నాయి.
– అమెరికాలో దీన్ని కనుగొన్నారు. యూరోపియన్లు దీనికి పైనాపిల్ అని పేరు పెట్టారట.
– పైనాపిల్ చెట్టు జీవిత కాలం 50 సంవత్సరాలు. కేవలం పైనాపిల్ పై భాగాన్ని కట్ చేసి దాన్ని పాతిపెడితే పైనాపిల్ చెట్టు వస్తుంది.
– ప్రపంచంలోనే అతి పెద్ద పైనాపిల్‌ని 2011లో ఆస్ట్రేలియాకి చెందిన క్రిస్టిన్ మెక్‌కొల్లమ్ పండించాడు. దీని ఎత్తు 32 సెం.మీ.లు బరువు 8.28 కేజీలు.
– 75 శాతం పైనాపిల్‌లో యూరోప్‌లో అమ్ముడుపోతాయి.
n హవాయిలో రికార్డు స్థాయిలో ఈ పంట పండిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొన్ని వందల ఎకరాల్లో పైనాపిల్ సాగు చేస్తున్నారు.
– పైనాపిల్‌ని ఇసుకతో కలిపి మొండి మరకలు ఉన్నచోట రుద్దితే మరకలు మాయమవుతాయి.
– ఆస్ట్రేలియన్ యాసలో ముగింపు పలుకడానికి లేదా చెడు ఒప్పందాలు ఏర్పరుచుకోవడానికి ఒక పదం ఉద్భవించింది. 1930లో బ్రిటన్‌లో బీయింగ్ ఆన్ ద పైనాపిల్ అనే పదం ఒక ప్రెస్‌గా మారింది.
– ప్రపంచం మొత్తం మీద 1/3 పైనాపిల్ పండ్లు హవాయిలో ఉత్పత్తి అవుతాయి.
– ఫ్రూట్‌సలాడ్స్, డ్రింక్స్‌లాగే కాదు.. పైనాపిల్‌తో వైన్‌ని కూడా తయారుచేస్తారు.
ఆరోగ్యం మహాభాగ్యం.. రోజూ ఓ కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే క్యాన్సర్, గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజు మొత్తానికి అవసరమైన
విటమిన్ సి ఈ పైనాపిల్ ద్వారా పొందవచ్చు.

– పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేయడమే దీని పని. అందుకే అజీర్తికి ఇది మంచి మందు.
– కీళ్లనొప్పులు పైనాపిల్ తింటే తగ్గుముఖం పడుతాయి. కారణం.. ఇందులో బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండు. అయితే దీన్ని ఉదయం భోజనం తర్వాత తింటే మంచిది.
– పైనాపిల్‌లోని ఎంజైమ్ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరితగతిన బాగు చేస్తుంది. మధుమేహం కారణంగా ఏర్పడే పుండ్లని, ఇతరత్రా గాయాల్ని కూడా ఇది త్వరగా తగ్గిస్తుంది. ఈ రసం తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గుతుంది.
– ఇందులో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధుల్లో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇది కడుపులోని పురుగుల్ని చంపేస్తుంది.
– పైనాపిల్‌ను రోజూ రెండు ముక్కల చొప్పున తింటే బెస్ట్. ఇది రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. అంటే.. రక్తనాళాల్లోంచి గడ్డల్ని తొలిగించి ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. హీమోఫీలియాతో బాధ పడేవాళ్లు మాత్రం వీటిని తినకపోవడమే మంచిది.
– గొంతునొప్పి, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల్ని పైనాపిల్ తగ్గిస్తుంది. ఈ రసాన్ని గొంతులో పోసుకొని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి.
– వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు పైనాపిల్‌ను మించిన ఔషధం లేదు. ఇందులోని విటమిన్ – సి బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది.
– ఎముకలకు ఇది బలం. పెరిగే పిల్లలకూ, వృద్ధులకూ ఇది చాలా మంచిది. జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం మంచిది.
– ఇందులోని పీచుపదార్థం మలబద్దకానికి, ఆడవాళ్లకైతే రుతుక్రమ సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది.
– పైనాపిల్ డిప్రెషన్, మతిమరుపును తగ్గిస్తుంది. జాండిస్, కాలేయ వ్యాధులున్న వారు ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే మంచిది.
అందమే ఆనందం.. పైనాపిల్ ముఖానికి ఐప్లె చేసే ముందు మొదట చేతి మీద లేదా చెవి వెనుక భాగంలో కాస్త రుద్ది టెస్ట్ చేయాలి. చర్మం మంట, దురద, ఎర్రగా మారడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే ముఖానికి రాసుకోవచ్చు.
-చర్మకాంతిని పొందాలంటే పైనాపిల్ జ్యూస్ సహాయపడుతుంది. ఇందులోని బ్రొమైలిన్ ఎంజైమ్ మొటిమలను నివారించడంతో పాటు చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం ఎలాసిటిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడం వల్ల ముఖంలో ముడుతలు, మచ్చలు లేకుండా స్కిన్‌టోన్ పెరుగుతుంది.
-ప్రతిరోజూ ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఫెయిర్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు. ఈ జ్యూస్‌ని నీళ్లలో కలిపి ముఖానికి పట్టించి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మకాంతి మరింత పెరుగుతుంది.
-పైనాపిల్లోని విటమిన్ సి, అమైనో యాసిడ్స్ చర్మంలో కొలెజెన్‌ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. చర్మాన్ని బిగువుగా, పటుత్వాన్ని కోల్పోకుండా చేస్తాయి. అలాగే చర్మం మీది మృతకణాలను తొలిగించడంలో ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది.
-పైనాపిల్ ైస్లెస్ తీసుకొని చర్మం మీద నేరుగా మర్దన చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాదు.. వాటివల్ల మచ్చలు కూడా క్రమంగా చర్మఛాయలో కలిసిపోతాయి.
-పైనాపిల్‌లో, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మం నవయవ్వనంతో నిగనిగలాడేలా చేస్తాయి. చర్మం యంగ్‌గా కనబడడానికి సహాయపడుతుంది.
గులాబీ పైనాపిల్పండ్ల ఉత్పత్తిలో శాస్త్రీయంగా ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ ఉత్పత్తికి భిన్నంగా ద్రాక్షలో గింజలు లేకుండా.. పండ్ల పరిమాణాన్ని పెంచుతూ వినూత్న రీతిలో ఉత్పత్తి చేస్తున్నారు. పైనాపిల్ పైన ముదురు గోధుమ రంగు పొలుసులతో.. లోపల పసుపు రంగులో ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ పండును గులాబీ రండులోకి మార్చడానికి డెల్ మౌంటే అనే ప్రముఖ ఆహార ఉత్పత్తి సంస్థ 2005 నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. 2016 డిసెంబర్‌లోనే ఈ పండు ఉత్పత్తికి యూ.ఎస్.ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. టమాట.. పుచ్చకాయ వంటి ఎరుపు, గులాబీ రంగులుండే పండ్లలో లైకోపీన్ అనే వర్ణకారకం ఉంటుంది. అది పైనాపిల్‌లోనూ ఉంటుంది. కానీ కొన్ని ఎంజైమ్స్ గులాబీ వర్ణకారకాన్ని పసుపు రంగులోకి మార్చేస్తాయి. అలాంటి ఎంజైమ్స్‌ను నియంత్రించి ఈ గులాబీ రంగు పైనాపిల్ పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలో ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.
-సౌమ్య పలుస

Share Now