శంభులింగా శరణు శరణు!

శంభులింగా శరణు శరణు!

తలమీద గంగమ్మతో అర్ధనారీశ్వర రూపంతో స్వయంభూగా ఆ జంగమయ్య వెలసిన క్షేత్రం నల్గొండ జిల్లా మేళ్లచెరువు. పుష్కరకాలానికి అంగుళం చొప్పున శివలింగం వృద్ధి చెందడం, లింగం శిరస్సు భాగం నుంచి జలం రావడం, శివరాత్రి సందర్భంగా అయిదురోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం… ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం. దేవదేవుడు ఇక్కడ శంభులింగేశ్వరుడిగా భక్తసులభుడిగా పూజలందుకుంటున్నాడు.

పంచభూతాలతో కలిసి ఉండే శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి మేళ్లచెరువులోని ఇష్టకామేశ్వరీ సమేత శంభులింగేశ్వరస్వామి ఆలయం. పన్నెండో శతాబ్దంలోనే ఆలయ నిర్మాణానికి పునాది పడిందని స్థలపురాణం తెలియజేస్తోంది. పూర్వం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో ఉండేది. ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు తమ ఆవులను ఇక్కడికే మేతకు తీసుకు వచ్చేవారు. వాటిని ఒకచోట కట్టి ఉంచేందుకు ఒక కొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మందలోని ఒక ఆవు రోజూ కొట్టంలోని గుండ్రాయిమీద పాలు అభిషేకిస్తూ ఉండటాన్ని గమనించిన కాపలాదారుడు పల్లెపెద్దలకు తెలియజేయాలని బయలుదేరతాడు. ఆ రోజు రాత్రే పరమశివుడు పల్లెపెద్దలు గంగబోయిన మంగన్న, బోయన్నలకు స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు. తాను పరమశివుడిననీ కొట్టంలో గుండ్రాయి రూపంలో కొలువై ఉన్నాననీ చెప్పి, తనకు ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆనతిమీద వారు వారి తాహతుకు తగ్గట్లుగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాడని ఆలయగోడలమీద ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్ద చెరువూ దాని అంచువెంబడి మేడి చెట్లు ఎక్కువగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతాన్ని మేడి చెరువుగా పిలిచేవారు. కాలక్రమంలో అది మేళ్ల చెరువుగా స్థిరపడిపోయింది.

విశిష్టలింగం

ఈ క్షేత్రంలో శివలింగం అనేక విశిష్టతలకు నెలవు. ప్రధానంగా శివలింగం శ్వేతలింగంగా ఉండటం, వెనకవైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులు ఉండటంతో భక్తులు శంభులింగేశ్వరస్వామి రూపాన్ని అర్ధనారీశ్వరుడిగా పూజిస్తారు. పానపట్టంమీద ఉన్న లింగమైతే ప్రతి పుష్కరకాలానికీ ఒక అంగుళం చొప్పున పెరుగుతూ వస్తోందనీ లింగం ముందుభాగంలో ఏర్పడుతున్న బొట్టులాంటి ఆకారాలే ఇందుకు నిదర్శనమనీ పండితులు చెబుతున్నారు.


శివలింగం శిరస్సు భాగంలో మూడు వేళ్లు పట్టేంత రంధ్రం ఉంది. దీన్నే గంగమ్మ స్థానమంటారు. ఇక్కడినుంచి గంగాజలం ఊరుతూ ఉంటుంది. ఈ జలం ప్రవహించదు కానీ తీస్తున్న కొద్దీ ఊరుతూ ఉంటుందట. ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ జలాన్నే తీర్థప్రసాదంగా అందజేస్తారు అర్చకులు. ప్రతి సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకానంతరం విశిష్ట పుష్పాలంకరణ చేస్తారు.

అయిదురోజుల జాతర

రాష్ట్రంలో దక్షిణకాశీగా విరాజిల్లుతున్న ఆలయాల్లో మేళ్లచెరువు శివాలయం ముఖ్యమైంది. ఇక్కడ ఏటా మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అయిదురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలతో ఈ ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోతుంది. శివరాత్రి రోజున ప్రత్యేక పూజలూ, లింగోద్భవకాల అభిషేకాలూ, శివకల్యాణోత్సవాలను ఇక్కడ వైభవోపేతంగా జరుపుతారు. చివరి రోజున పవళింపుసేవను కన్నులపండగగా నిర్వహిస్తారు. జాతరలో రెండురోజుల పాటు ఎత్తయిన ప్రభలను నిర్మిస్తారు. ఈ ప్రభలను విద్యుద్దీపాలతో నింగిలోని నక్షత్రాలు ప్రభలమీద పడ్డాయా అన్నట్టుగా అలంకరిస్తారు. వీటిని చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ అయిదు రోజులూ పురాణ ప్రవచనాలతో, భాగవతోపన్యాసాలతో ఆలయ ప్రాంగణం మారుమోగుతూ ఉంటుంది. రాష్ట్రస్థాయిలో ఎడ్లపందేలనూ, వివిధ రకాల ఆటలపోటీలనూ నిర్వహిస్తారు. వీటిలో పాల్గొనడానికి రెండు మూడు నెలల ముందు నుంచీ ఎద్దులకు శిక్షణ ఇస్తారు. ఇందులో గెలిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తమ ఊరికి లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. మేళ్లచెరువులోని ఈ శివాలయానికి 25 కిలోమీటర్ల దూరంలో మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. అలాగే సమీపంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు ప్రముఖ పర్యటక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇలా చేరుకోవచ్చు
సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి 68 కిలోమీటర్ల దూరంలో ఉందీ ఇష్ట కామేశ్వరీ సమేత శంభులింగేశ్వర స్వామి ఆలయం. ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారిలో కోదాడ దగ్గర ఈ క్షేత్రం ఉంది. రైలు ప్రయాణం అయితే మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవచ్చు.

– వేణుగోపాల్‌రెడ్డి, న్యూస్‌టుడే, మేళ్లచెరువు

Share Now