భారతీయ సంస్కృతిలో విడదీయరాని భాగం
భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా పూజిస్తారు. వేపను ఆయుర్వేద శాస్త్రం చింతామణి, సర్వరోగ నివారిణి అని కొనియాడుతోంది. అమ్మవారు వంటి అంటువ్యాధులు సోకినవారిని వేపాకుల మీద పడుకోబెడతారు. వేపచెట్టు కలపను తలుపులు, కిటికీలు తయారు చేయటానికి వాడుతారు.
వారానికి ఒకసారి పరగడుపున 7 నుంచి 8 వేప చిగుళ్లు నూరి ఉండ చేసి మింగి, పావుకప్పు పెరుగు సేవిస్తుంటే కడుపు, పేగుల్లోని వివిధ రకాల క్రిములు చనిపోతాయి. వేపచిగుళ్లు, పసుపు సమంగా కలిపి మెత్తగా నూరి ఆయా భాగాల్లో లేపనం చేస్తుంటే దురదలు, దద్దుర్లు తగ్గుతాయి. ఒక వారంపాటు ఉదయం పరగడుపునే 5 వేపాకులు, 5 మిరియాలు కలిపి నమిలి మింగుతూ ఉంటే వివిధ రకాల అంటువ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది.
వేపపువ్వును ఆంధ్రులు, కన్నడిగులు, మహారాష్ట్రులు ఉగాది పచ్చడిలో చేదు రుచికోసం వాడతారు. వేపచెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షంగా ఎంపికయింది. వేపగాలి పీల్చని, వేపపుల్లతో పళ్లు తోమని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని గ్రామాలలో వేపచెట్టుని దైవంగా భావించి ప్రతి శుభకార్యంలోనూ మొదటగా వేపచెట్టునే పూజిస్తారు. ఇలా వేపచెట్టు మన సంస్కృతిలో ఒక ప్రధాన భాగమయింది.