త్రివేణి సంగమేశ్వరాలయం | Triveni Sangameswaralayam

త్రివేణి సంగమేశ్వరాలయం | Triveni Sangameswaralayam 

సాక్షాత్తు దేవాధి దేవతలు, ఋషులు యోగ సాధకులు నడయాడిన నేల ఇది. పరమ శివుడు స్వయంభువుగా అవతరించిన ప్రాంతమిది. ప్రకృత రమణీయతను, భక్తిభావ పరిమళాలను వ్యాప్తి చెందిస్తూ మంజీరా శ్రీ త్రివేణి సంగమేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ పవిత్ర పుణ్యక్షేత్ర విశేషాలే ఈవారం దర్శనం. 


ఎక్కడ ఉంది?: సంగారెడ్డిజిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డల సంఘం గ్రామంలో ఉన్నది. 
ఎలా వెళ్లాలి?: హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిలో సదాశివపేట పట్టణం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింగూరు ప్రాజెక్టుకు వెళ్లేదారికి సమీపంలో ఈ క్షేత్రం కొలువై ఉన్నది. ఇక్కడ ఏటిగడ్డ సంఘం కాలనీ నుంచి కిలోమీటర్ దూరం వెళ్తే త్రివేణి సంగమేశ్వరాలయం చేరుకోవచ్చు. సదాశివ పేట నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల సౌకర్యం ఉన్నది. 


విశిష్టత: మంజీరా నది ఒడ్డున దేవాధి దేవతలు, ఋషులు తపమాచరించి, సాక్షాత్తు పరమశివుడిని సాక్షాత్కారం పొంది, ఈ ప్రాంతంలో లింగ ప్రతిష్ట చేశారట. మంజీరా ఉధృతంగా ప్రవహించే ఏటిగడ్డ సంఘంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయంటారు. కోరినవి నెరవేరుతాయనీ భక్తుల నమ్మకం. 


పేరెలా వచ్చింది?: మూడు ఏరుల కలిసిన ఎత్తయిన ప్రాంతం కావడం వల్ల ఏటిగడ్డ సంఘం అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. మంజీరా, నారింజ, నీలంగ నదుల కలయికే త్రివేణి సంగమేశ్వరంగా చెబుతున్నారు. 


ప్రాచీనక్షేత్రం: దీనిని తెలంగాణలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా చెప్తున్నారు స్థానికులు. మాలపాడు, బొబ్బిలిగామా, పొట్టిపల్లి, పోచారం, మునిపల్లి, ఆత్మకూర్, బూచిరెడ్డిపల్లె, ఏటిగడ్డ సంఘం గ్రామాల ఇలవేల్పుగా ఈ ఆలయం పూజలందుకుంటున్నది. 


ప్రత్యేకత: కాశీ విశ్వేశ్వరాలయం వెలసిన గంగానది దక్షిణ దిశగా ప్రవహిస్తున్నది. ఏటిగడ్డ సంఘంలో మంజీరానది దక్షిణ దిశగా ప్రవహిస్తున్నది. అందుకే సంగమేశ్వరాలయానికి అంతటి విశిష్టత ఉన్నది. సంగమ కూడలి జలంతో అభిషేకించడం ఈ సంగమేశ్వరాలయం ప్రత్యేకత. 


పూజలు: మహాశివరాత్రితో పాటు శ్రావణ, కార్తీకమాసాలే కాకుండా మామూలు రోజుల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. రుద్రాభిషేకం, ఎదుర్కోళ్లు, లింగోద్భవం, పల్లకిసేవ, అగ్నిగుండం, సర్వదేవతా పూజలు వంటి కార్యక్రమాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి భక్తులు వచ్చి మంజీరాలో స్నానం చేస్తారు. ఆయురారోగ్య సమస్యలు ఉన్నవారు స్వామివారిని దర్శించుకుంటే పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. మానసిక ఆహ్లాదానికి అనువైన క్షేత్రంగానూ దీనికి పేరున్నది.


అతి ప్రాచీనమైంది: 
పరమ శివుడు స్వయంగా వెలసిన సంగమేశ్వరాలయం అతి ప్రాచీనమైంది. మంజీరా దక్షిణ దిశగా ప్రవహిస్తూ పుష్కరస్నానాలకు అనువుగా ఉన్నది. భక్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేశాం. దాతలుగానీ, ప్రభుత్వంగానీ సహకారం అందిస్తే మరింత అభివృద్ధి చేయవచ్చు. 
స్వామి శంభు ప్రసాద్, అర్చకుడు


విశిష్టతను కాపాడాలి: 
ప్రకృతి రమణీయత, ఎటు చూసినా ఆహ్లాదకర పరిస్థితులు, పవిత్ర మంజీరా నది ఒడ్డున ఉండటంతో ఈ ఆలయం విశిష్టత సంచరించుకున్నది. దీనిని భక్తులు దక్షిణ కాశిగా భావిస్తుంటారు. ఈ ఆలయ విశిష్టతను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఆర్య బాబూరావు, కార్య నిర్వాహకులు

Share Now