కప్పెడు కాఫీ.. గుప్పెడు ముచ్చట్లు !

కప్పెడు కాఫీ.. గుప్పెడు ముచ్చట్లు !

రోజూ పొద్దున్నే లేవగానే కాఫీ.. అని దీర్ఘం తీసి ఆర్డరేయడం తప్పితే.. ఒక మేక వల్ల మనకు కాఫీ పరిచయమైందనే విషయం మీకు తెలుసా? కాస్త అలసిపోతే కొంచెం ఎక్కువ కాఫీ పొడి, కావాలనుకుంటే ఇంకొంచెం చక్కెర వేసి లొట్టలేసుకుంటూ తాగేస్తాం. కానీ కాఫీ తాగితే ఎలాంటి లాభాలున్నాయి? ఎక్కువ తాగితే ఎలాంటి నష్టాలున్నాయి? అసలు తాగకపోతే ఏం మిస్సవుతాం? లాంటి విషయాలు మీకు తెలుసా? ఇవే కాదు.. ఇంకా కాఫీ గురించి బోలెడు ముచ్చట్లతో ఈ వారం మీ ముందుకొచ్చాం. సరదాగా కాఫీ సిప్ చేస్తూ ఈ కథనం చదివేయండి.
-ప్రవీణ్‌కుమార్ సుంకరి,

మొట్టమొదటిసారి కాఫీ ఆకులను అరబ్ దేశానికి చెందిన మేక రుచి చూసింది. ఆ తర్వాత ఆ మేకల మంద యజమాని కూడా వాటిని రుచి చూసి అందరికీ తెలిసేలా చేశాడు. అరబ్ ప్రాంతంలోని ఇస్లాం మతస్థులు కాఫీగింజల పానీయాన్ని ఇస్లాం మతంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాఫీని వైన్ ఆఫ్ అరబ్బీ అని పిలిచేవారు. అరబ్బీలో వైన్‌ను కఫే అని పిలిచేవారు. దీంతో కాఫీ అరబ్బీ వైన్ అయింది. స్వీడన్ దేశస్థుడైన కార్ల్ లీనియస్ అనే వృక్షశాస్త్ర నిపుణుడు 18వ శతాబ్దంలో వివరించాడు. కాఫీ అని పేరు పెట్టింది కూడా అతడే. 1973లో స్పైసెస్ ప్లాన్‌టరుం అనే పుస్తకంలో ఈ వివరాలు నమోదు చేశాడు. వెనీస్ నగరంలో 1683లో మొదటి కాఫీ షాపు స్థాపితమైంది. వాటిని కవే కేన్స్ అని పిలిచేవారు. 17వ శతాబ్దంలో యూరప్‌లో కాఫీ అడుగుపెట్టగానే అక్కడి ప్రజలు వెంటనే కాఫీని యాక్సెప్ట్ చేయలేదు. పోప్ రుచి చూసి, ఓకే చెప్పిన తర్వాతనే యూరప్‌లో కాఫీ సేవనానికి అనుమతి దొరికింది. ఐదు దేశాల్లో కాఫీని నిషేధించడానికి ప్రయత్నించారు. 1511లో మెక్కా, 1615లో వెనీస్, 1623లో కాన్‌స్టాంట్‌నోపుల్, 1746లో స్వీడన్, 1777లో ప్రష్యాలో కాఫీపై నిషేధం విధించారు. కానీ.. ఎక్కువ రోజులు అది సాధ్యపడలేదు. ఇటాలియన్, టర్కిష్ సంస్కృతులు ఉన్న ప్రాంతాల్లో కాఫీ ప్రభావం చాలా ఉంటుంది. ఫిన్లాండ్, నార్వే, ఐస్‌లాండ్, డెన్మార్క్ లాంటి దేశాలు కాఫీ నిఎక్కువగా వినియోగిస్తున్నాయి.

ప్రపంచంలో అత్యధికంగా వ్యాపార లావాదేవీలు సాగుతున్న వస్తువుల్లో కాఫీ రెండవ స్థానంలో ఉంది. మొదటిస్థానంలో పెట్రోల్ ఉంది. గతేడాది దాదాపు 10 మిలియన్ల కాఫీ అమ్మకాలు జరిగినట్టు ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ వెల్లడించింది. కాఫీ మొక్కను ప్రత్యేకంగా పరిరక్షించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కెఫైన్‌లో ఉండే సహజ పెస్టిసైడ్స్ కాఫీమొక్కను ఏ జీవి పాడు చేయకుండా కాపాడుతుంటాయి. కెఫైన్‌ను డ్రగ్స్ పరిభాషలో సైకోయాక్టీవ్ డ్రగ్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 2.25 బిలియన్ల కప్పుల కాఫీ తాగుతున్నారు. పెర్‌ఫ్యూమ్ కొనే క్రమంలో ఎక్కువ పెర్‌ఫ్యూమ్ బాటిల్స్ వాసన చూస్తాం. దీంతో అన్ని వాసనలు ఒకేలా అనిపిస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో మంచి స్ట్రాంగ్ కాఫీ తాగినా, వాసన చూసినా మీ శ్వాసరంధ్రాలు తిరిగి ఉత్తేజితమవుతాయి. కొత్త వాసనలు చూడడానికి రెడీ అవుతాయి.

అ, ఆ.. (అందం + ఆరోగ్యం)..-చర్మకణాల ఉత్పత్తికి కాఫీ ఉపకరిస్తుంది.
-నిద్రలేమి వల్ల కండ్ల చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను తొలగించడంలో కాఫీ గింజలు తోడ్పడుతాయి.


-కాఫీపొడి, తేనె, నిమ్మరసం పేస్ట్‌లా ముఖానికి ఐప్లె చేసి 15 నిమిషాల తర్వాత కడిగితే ముఖ చర్మం మీద రక్త ప్రసరణ మెరుగవుతుంది.

-కాఫీ పౌడర్, ఓట్‌మీల్ పౌడర్, తేనె కలిపి మెడకు, ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగితే చర్మం మృదువుగా మారుతుంది.

-రోజుకు 4 నుంచి 7 సార్లు కాఫీ తాగితే కిడ్నీ, లివర్ వంటి వ్యవస్థలు వ్యాధుల బారిన పడకుండా అడ్డుకుంటాయి.

-ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ తాగేవారికి జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తవు.

-కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం మీద వ్యాధుల దాడిని నిరోధిస్తాయి.

-కాఫీ మెమొరీ స్కిల్స్‌ను మెరుగు పరుస్తుంది. న్యూరో డిజనరేటీవ్ వ్యాధులను నివారించి షార్ట్‌టర్మ్ మెమొరీ లాస్ నుంచి కాపాడుతుంది.

-టైప్ 2 డయాబెటీస్, గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు.

-రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే మెదడులో రక్తం గడ్డ కట్టడాన్ని 14 శాతం తగ్గించవచ్చు.

-గర్భసంచి, గొంతు, స్కిన్ క్యాన్సర్ అవకాశాలను 10 నుంచి 17 శాతం వరకూ తగ్గిస్తుంది.

కాఫీ తాగిన తర్వాత..తలనొప్పిగా అనిపిస్తే, అలసటగా అనిపిస్తే వెంటనే కప్పు కాఫీకి రెడీ అయిపోతాం. కానీ కాఫీ తాగిన తర్వాత మన శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయనే విషయం మీకు తెలుసా!

10నిమిషాల తర్వాత..కాఫీ తాగిన పది నిమిషాల తర్వాత మన శరీరంలో బీపీ పెరుగుతుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది.

20నిమిషాల తర్వాత..అలసట పూర్తిగా తగ్గి శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది. శరీరంలో సెరటోనిన్ లెవల్స్ పెరుగుతాయి. మూడు మారుతుంది. కండరాలు ఉత్తేజితమవుతాయి.


30నిమిషాల తర్వాత..శరీరంలో అడ్రినలిన్ తయారవుతుంది. ఇది ఏకాగ్రతను పెంచుతుంది. పరిశీలనా శక్తిని మెరుగు పరుస్తుంది.

40నిమిషాల తర్వాత..శరీరంలో కెఫిన్ పెరుగుతుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. జీర్ణాశయంలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి.

60నిమిషాల తర్వాత..శరీరంలో ఉండే కెఫెన్ డై యూరెటిక్ ఎఫెక్ట్ కలిగిస్తుంది. దీంతో మూత్రం అధికంగా వస్తుంది. తద్వారా రక్తంలో ఉండే కీలక విటమిన్స్, మినరల్స్ కోల్పోతాం. దీంతో క్యాల్షియం, మెటబాలిజంకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితి మోతాదుకు మించి కాఫీ తాగినప్పుడు సంభవిస్తుంది.

కాఫీ యాప్కాఫీ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ ఉంది. దీని పేరు మిస్టర్ కాఫీ. మీ ఫోన్లో వైఫై యాక్సెస్ ఉంటే చాలు. మీరు బయటి నుంచి ఇంటికి వచ్చే లోపు ఘుమఘుమలాడే కాఫీ రెడీగా ఉంచుతుంది. కాకపోతే ఇంటికి చేరే ఏడు నిమిషాల ముందు ఫోన్‌లో యాప్‌కి లింకప్ అయి

ఉన్న బటన్ ప్రెస్ చేస్తే చాలు. ఇంట్లో వేడి వేడి తాజా కాఫీ సిద్ధంగా ఉంటుంది.

Share Now