Sampurna Sri Guru Charitra

సంపూర్ణ శ్రీ గురు చరిత్ర 

డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

189.00

మరిన్ని Telugu Books కై
,
Share Now

Description

సంపూర్ణ శ్రీ గురు చరిత్ర 

Adipudi Venkata Siva Sairam
డా. ఆదిపూడి వెంకట శివ సాయిరామ్

గురువై ఇలలో జ్ఞానమై మనలో
ఈనెల 22 దత్త జయంతి

త్యజించడం దత్తం… జయించడం దత్తం… మనస్సును దేదీప్యమానం చేయడం దత్తం… సాక్షాత్తు దైవం గురువుగా మారితే, మానవుడికి ముక్తి మార్గాన్ని చూపితే… జ్ఞాన దీపాలు వెలుగుతాయి, చిమ్మ చీకట్లు తొలగుతాయి… దత్తుడి అవతరణ, కార్యాచరణ రెండూ ప్రత్యేకమే, సమాజానికి అత్యావశ్యకమే…

మనం భగవంతుడి అవతారాలన్నీ నిశితంగా పరిశీలిస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యాలుగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన విధి నిర్వహణ తర్వాత ఆ అవతారాలు పరిసమాప్తి అవుతాయి. కానీ దత్తాత్రేయ అవతారం అలాకాదు. ఆయన ఆవిర్భావం వెనక ఒక నిగూఢమైన, నిరంతరాయమైన కార్యక్రమం ఉంది. మనుషుల్లో జ్ఞాన, వైరాగ్య, ఆధ్యాత్మికోన్నతి కలిగించడం అనే ముక్కోణ ప్రణాళిక ఉంది. అందుకే భాగవత మహాపురాణం మహావిష్ణువు ధరించిన 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారాన్ని గురించి ప్రత్యేకంగా వివరించింది.
సత్త్వ, రజో, తమో గుణాలను జయించిన మహా తపశ్శాలి అత్రి మహాముని. అసూయలేని సాధ్వీమణి అనసూయ. ఈ దంపతులిద్దరి తపో ఫలితంగా త్రిమూర్తుల అంశతో మార్గశిర పూర్ణిమనాడు దత్రాత్రేయుడు జన్మించాడు.
దత్తుడు జ్ఞానానికి ప్రతీక. ఇతర దైవాల తీరులో ఆయన రాక్షస సంహారం చేయలేదు. ఆయన దృష్టిలో మనిషిలో ఉండే అజ్ఞానం, అహంకార‌ మమకారాలే రాక్షసులు. మనిషిలోని దుర్గుణాలే అతడిని రాక్షసుడిని చేస్తాయి. అందుకే దత్తుడు అజ్ఞానాన్ని సంహరించి, జ్ఞానదీపాలు వెలిగించాడు. అసలు దత్తాత్రేయుడి పేరులోనే ప్రత్యేకత ఉంది. దత్తం అంటే త్యజించడం అనే అర్థముంది. సూక్ష్మ, స్థూల, కారణాలనే మూడు రకాల శరీరాలను,  జాగృత్‌, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులను, సత్త్వ, రజో, తమో గుణాలను జయించినందుకు ఆయన దత్తాత్రేయుడయ్యాడు.
మహా యోగీశ్వరుడైన దత్తుడు జగదాచార్యుడు కూడా.. సకల లోకాలకు గురుమూర్తి. మిగిలిన భగవదవతారాల్లో దైవత్వం మాత్రమే దర్శనమిస్తుంది. కానీ దత్తావతారంలో మాత్రమే దైవలక్షణాలతో పాటు గురులక్షణాలు కూడా కనిపిస్తాయి. శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, స్వామి సమర్థ, మాణిక్య ప్రభు మహరాజ్‌, షిరిడీ సాయినాధులను భక్తులు దత్తావతారాలుగా భావించి కొలుస్తారు. మనం గమనిస్తే ఈ అవతారాలన్నీ నరుడి ఆకారంలో ఉన్న నిరాకారాలే. వారంతా సకల గురు స్వరూపాలు. దత్తాంశతో జన్మించిన సిద్ధ గురువులందరి లక్ష్యం ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలకు పరిష్కారాలు తెలుపుతూ, వారిని సన్మార్గంలో నడిపించడం.
అంతేకాదు ఆయన మహా అవధూత. ప్రకృతి పరిశీలన ద్వారా భూమి, మిడత, చేప, ఏనుగు, సాలె పురుగు వంటి 24 చరాచరాల నుంచి దత్తుడు జ్ఞానాన్ని గ్రహించాడు. వాటినే గురువులుగా భావించి సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకుని లోకానికి వివరించాడు.  యాదవ వంశానికి మూలపురుషుడైన యదు మహారాజుకు ఈ విషయాన్ని స్వయంగా దత్తుడే చెప్పాడు. భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, పావురాయి, కొండచిలువ, తుమ్మెద, తేనెటీగ, ఏనుగు, జింక, చేప, సర్పం, గద్ద, సాలీడు, సముద్రం, వేశ్య, కన్య, లోహకారుడు, చిమ్మెట, కందిరీగ… ఈ విషయాలను దత్తాత్రేయుడు గురువులుగా స్వీకరించాడు. భూమి నుంచి క్షమ, వాయువు నుంచి నిస్సంగత్వం, ఆకాశం నుంచి సర్వవ్యాపకత్వం, జలం నుంచి నిర్మలత్వం, అగ్ని నుంచి తేజస్సు… ఇలా ప్రతి జీవి నుంచి ఒక్కో అంశాన్ని గ్రహించాడు. సృష్టిలోని ప్రతి ప్రాణినీ గౌరవించాలి. రూపభేదాలు భౌతికమైన దేహానికే గానీ మనసుకి లేదు. ప్రతి ప్రాణి హృదయంలో ఉండే భగవంతుడు ఒక్కడే. ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శించగల స్థాయికి చేరుకోవాలి. ప్రకృతి వైవిధ్యం విలసిల్లేలా మన కార్యకలాపాలు ఉండాలి. అనంతమైన ప్రకృతిలోని ప్రతి అణువు నుంచి మనం గ్రహించాల్సిన అంశాలెన్నో ఉంటాయి. రూపం వెనకాల ఉన్న భావాన్ని గ్రహించాలని ప్రకటించటమే ప్రకృతిలోని వివిధ విషయాలను దత్తుడు గురువులుగా స్వీకరించటంలో ఉన్న అంతరార్థం.
* బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా దత్తపురాణం ఉంది. మనకు లభిస్తున్న మొదటి గురుచరిత్ర ఇది. వ్యాసమహర్షి దీనికి కర్త. భాగవత మహాపురాణం, మార్కండేయ పురాణాల్లో కూడా దత్తుడికి సంబంధించిన ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన ఉద్భవగీతలో మొదటి అధ్యాయం పూర్తిగా దత్తాత్రేయుడి గురించి వివరిస్తుంది. జగన్మాతను అర్చించే శ్రీవిద్యా సంప్రదాయంలో కూడా దత్తాత్రేయుడికి ముఖ్యస్థానం ఉంది.
– శ్రీదత్తా